Saturday, July 2, 2016

ప్రేమించకపోతే ఇక అంతే

ప్రేమించలేదని గొంతు కోశాడు


ప్రేమించలేదన్న నెపంతో యువతి గొంతుకోసి దారుణంగా హత్య చేసిన ఘటన ఆదిలాబాద్‌ జిల్లాలో చోటు చేసుకుంది. భైంసా పట్టణంలోని గోపాల్‌నగర్‌లో పట్టపగలే నడిరోడ్డుపై యువతిని కిరాతంగా హత్య చేశాడో ఉన్మాది. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం గోపాల్‌నగర్‌లో నివాసముంటున్న సంధ్య(16)ను అదే వీధికి చెందిన మహేష్‌ హత్య చేసి పారిపోయినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న డీఎస్పీ అందెరాములు, సీఐ రఘు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పరారీలో ఉన్న నిందితుడు మహేష్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

వెంకన్న దర్శనం కోసం

ఆగస్టు, సెప్టెంబర్ సేవా టిక్కెట్లు విడుదల



తిరుమల శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లను తితిదే విడుదల చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 1,09,092 సేవా టికెట్లను అంతర్జాలంలో అందుబాటులో ఉంచింది. ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల కోసం వీటిని విడుదల చేస్తున్నట్లు ఈవో సాంబశివరావు తెలిపారు. అత్యధికంగా 26,600 సహస్ర దీప అలంకరణ, 12,476 సుప్రభాత సేవ, 2,952 నిజపాద సేవ, 24,080 వసంతోత్సవ టికెట్లను అంతర్జాలంలో వుంచారు. రైల్వే టికెట్లకు అనుసంధానంగా గదుల టికెట్లను, సేవా టికెట్లకు గడవు 90 రోజులకు పెంచినట్లు ఈవో తెలిపారు.

పుష్కర పనులు పూర్తికాకపోతే అధికారులపై చర్యలు

పుష్కర పనుల్లో వేగం పెంచండి; చంద్రబాబు


కృష్ణా పుష్కరాలపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. పుష్కర పనులు పూర్తి చేయడానికి నెల మాత్రమే సమయం ఉందని, పనులు ముమ్మరం చేయాలని సూచించారు. నిర్దిష్ట గడువులోగా పనులు పూర్తికాకపోతే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. భక్తుల కోసం రహదారికి ఒక వైపు బారికేడ్లు ఏర్పాటు చేయాలి, రహదారి నిర్మాణం, విద్యుత్‌ పనులు వేగంగా సాగాలని పేర్కొన్నారు. కృష్ణా పుష్కరాల కోసం ప్రభుత్వం రూ.216.42 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు.

నోరా అది.....

వారంపాటు స్వామి నోటికి మూత


ట్విట్టర్‌లో వరుస విమర్శలు చేస్తూ సొంత పార్టీ బీజేపీని ఇరకాటంలో పడేసిన ఆ పార్టీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి తాజాగా పంథా మార్చారు. ఆర్బీఐ గవర్నర్‌ రఘురాం రాజన్, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులపై నేరుగా, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీపై పరోక్షంగా స్వామి చేసిన ఆరోపణలు బీజేపీలో గగ్గోలు రేపిన సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సైతం ఈ ఆరోపణలు తోసిపుచ్చారు.ఈ నేపథ్యంలో ఒక వారంపాటు ట్విట్టర్‌కు కొంత దూరంగా ఉంటానని స్వామి తాజాగా ప్రకటించారు. ఈ వారం రోజుల్లో అయోధ్యలో రామాలయం, కాంగ్రెస్‌ అధినేతలు సోనియా, రాహుల్‌ గాంధీ ప్రమేయమున్న నేషనల్ హెరాల్డ్‌, ఎయిర్‌సెల్‌-మాక్సిస్‌ కేసులపై దృష్టి పెడుతానని ఆయన తెలిపారు. అదేసమయంలో భారత జీడీపీ మీద ఆయన చేసిన ఓ ట్వీట్ రాజకీయ వర్గాలను ఒకింత విస్మయపరిచింది. భారత జీడీపీ గణన, ఆర్బీఐ వడ్డీ రేట్లపై సామ్యూల్‌సన్-స్వామి థీయరీ వర్తింపజేసి విశ్లేషిస్తే.. అది పార్టీ వ్యతిరేక చర్య అంటూ మీడియా గగ్గోలు పెడుతుందని ఆయన పేర్కొన్నారు. రామాలయం కేసు, నేషనల్ హెరాల్డ్, ఎయిర్‌సెల్ మాక్సిస్ , సీఎస్‌కే తదితర కేసులపై దృష్టి పెడుతున్నందున ట్విట్టర్‌లో పెద్దగా కనిపించకపోవచ్చునని ఆయన చెప్పుకొచ్చారు.

సీజన్ మారితే విదేశాలకు చెక్కేస్ధాడు

రాహుల్ పై అమిత్ షా విమర్శల వర్షం


కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తీవ్ర విమర్శలు చేశాడు. దేశంలో వేడిపెరగగానే రాహుల్ దేశం విడిచిపెట్టి వెళ్లిపోతాడని అన్నారు. 'దేశంలో ఉష్ణోగ్రతలు పెరగగానే రాహుల్ బాబా విదేశాలకు వెళ్లిపోతాడు. అలాంటాయని బీజేపీ పరిపాలన రికార్డును అడుగుతాడు' అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. గోరఖ్ పూర్ లోని బస్తీలో పార్టీ కార్యకర్తలతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ ఎస్పీని, బీఎస్పీని మట్టికరిపించి 2017 ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశాడు. రెండు పార్టీలను చెత్తబుట్టలో వేయాలని, ఆ పార్టీల వల్ల ఇప్పటి వరకు రాష్ట్రం అభివృద్ధికే నోచుకోలేదని చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎస్పీ, బీఎస్పీ నే కారణం అన్నారు. నేరస్తులు, మాఫియానే ఎస్పీ ప్రభుత్వాన్ని డామినేట్ చేస్తున్నాయని చెప్పారు.

420ని మాత్రం కాదు

420ని కాదు...నాన్న పేరు నిలుపుతా....లోకేష్ నాయుడు


‘నేనేం ఫోర్ ట్వంటీ (420)ని కాదు.. తండ్రికి చెడ్డపేరు తెచ్చిపెట్టేలా ప్రవర్తించను.. మీరు పార్టీకి అండగా ఉంటే మీకు నేను అండగా ఉంటా’’ అంటూ సీఎం చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మహా నాడు విజయవంతం చేశారంటూ టీడీపీ వాలంటీర్లకు శుక్రవారం చిత్తూరు జిల్లా రామచంద్రాపురంలో సన్మాన సభ నిర్వహిం చారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న లోకేశ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రిపై చేసిన ఆరోపణలను దమ్ముంటే నిరూపించాలని ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌కు సవాల్ విసిరారు.

తిరుమల భక్తులకోసం రెండు బస్సులు

వెంకన్నకు రెండు బస్సులు బహుకరణ



తిరుమల శ్రీవారికి కోల్ కతాకు చెందిన ప్రకాష్ చౌదరి అనే భక్తుడు రెండు బస్సులను విరాళంగా ఇచ్చారు. తిరుమల భక్తుల ఉచిత రవాణాకు ఈ బస్సులు ఉపయోగపడనున్నాయి. ప్రకాష్ శనివారం ఉదయం ఈ బస్సులను టీటీడీ అధికారులకు అందించారు. రెండు బస్సుల విలువ సుమారు రూ.25 లక్షలు ఉంటుంది. ధర్మ రథం బస్సుల పేరుతో వాటిని భక్తులకోసం ఉపయోగిస్తామని టీటీడీ అధికారులు తెలిపారు.