Friday, September 9, 2016

స్విస్ ఛాలెంజ్ పై రాష్ట్రాన్ని ప్రశ్నించిన హైకోర్టు

ఏపి రాజధాని అమరావతి నిర్మాణం కోసం స్విస్‌ ఛాలెంజ్‌ పద్ధతిలో టెండర్లను ఆహ్వానించేప్పుడు ఆదాయ వివరాలను ఎందుకు రహస్యంగా ఉంచాల్సి వస్తోందని హైకోర్టు మరోసారి ప్రశ్నించింది. సిఆర్‌డిఎ(క్రిడా) సవరించిన టెండర్‌ నోటిఫికేషన్‌ను చెన్నైకు చెందిన ఎన్వీఎన్‌ ఇంజినీర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ డైరెక్టర్‌ కార్తీయనాథన్‌, హైదరాబాద్‌కు చెందిన ఆదిత్య కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ డైరెక్టర్‌ బి మల్లికార్జునరావు వేర్వేరుగా దాఖలు చేసిన రిట్‌ పిటిషన్లపై గురువారం ప్రభుత్వ వాదనలు ముగిశాయి. ఈ సందర్భంగా న్యాయమూర్తి సర్కారుకు పలు ప్రశ్నలు సంధించారు. సింగపూర్‌ కన్సార్టియం విషయంలో జీవోను పరిశీలిస్తే ముందే ప్రభుత్వం జోక్యం చేసుకున్నట్టు స్పష్టం అవుతోందని న్యాయమూర్తి పేర్కొన్నారు. సాక్షాత్తూ ప్రభుత్వమే జోక్యం చేసుకుంటే కిందిస్థాయి సంస్థలు లేదా అధికారులు వ్యతిరేకంగా ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఏపిీ తరఫున అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహత్గీ దానికి జవాబు చెప్పకుండా మరో అంశంపై వాదించారు. స్విస్‌ఛాలెంజ్‌ విధానంలో ఆదాయ వివరాలన్నీ ప్రాథమిక దశలోనే వెల్లడించాలని చట్టం చెబుతోందని న్యాయమూర్తి అనగానే, అటార్నీ జనరల్‌ స్పందిస్తూ సింగపూర్‌ కన్సార్టియం ప్రతిపాదనలను తొలి దశలోనే బట్టబయలు చేస్తే పెద్ద పెద్ద కంపెనీలు ముందుకు రాకపోవచ్చునన్నారు. సింగపూర్‌ కంపెనీ కూడా వెనక్కి వెళ్లిపోయే ప్రమాదం ఉందని బదులిచ్చారు. ఆదాయ వివరాలు లేకుండా ఏ కంపెనీ ముందుకు వస్తుందని హైకోర్టు పేర్కొనగా, ఎల్‌అండ్‌టి వంటి పేరున్న కంపెనీయే ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని అటార్నీ జనరల్‌ జవాబిచ్చారు. ఆదిత్య కంపెనీకి అర్హతే లేదని, మరో కంపెనీ ఎన్వీఎన్‌ ప్రీ బిడ్డింగ్‌ మీటింగ్‌లో కూడా పాల్గొనలేదని చెప్పారు. ప్రపంచానికే తలమానికంగా భావిస్తున్న రాజధాని విషయంలో పాలకులు ఆదాయ వివరాలు వెల్లడించకుండా టెండర్లను ఆహ్వానించడంలో ఆంతర్యం ఏమిటి? సింగపూర్‌ కన్సార్టియం ప్రతిపాదనలన్నీ సీల్డ్‌ కవర్‌లో గోప్యంగా ఉన్నాయని చెబుతున్న వారు ఏపికి మేలు జరుగుతుందని ముందే నిర్ణయానికి ఎలా వచ్చారు? ప్రధాన ప్రతిపాదికుడైన సింగపూర్‌ కన్సార్టియం ఇచ్చిన నివేదికపై ఏపీ సర్కార్‌ ఎందుకు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది? ఆదాయ వివరాలు తెలిస్తేనే కదా అంతకంటే పెద్ద కంపెనీలు ముందుకొచ్చేది అని హైకోర్టు నిలదీసింది. స్టే వంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తే, ఇంతవరకు జరిగిన పనులపై తీవ్ర ప్రభావం పడుతుందని ప్రాజెక్టు ఆగితే అభివృద్ధి పూర్తిగా కుంటుపడుతుందనిఅటార్నీ జనరల్‌ వాదించారు. చిన్నపాటి కంపెనీల కేసుల్ని కొట్టేయాలని కోరారు. రాజధాని నిర్మాణం ద్వారా విదేశీ పెట్టుబడుల్ని రాబట్టాలన్న మహత్తర సంకల్పం ఉన్నందునే ఆదాయ వివరాల్ని గోప్యంగా ఉంచుతున్నామన్నారు. ఇవేవీ తప్పుకానే కాదని చట్టం కూడా స్పష్టం చేస్తోందన్నారు. టెండర్‌లో బిడ్స్‌ దాఖలు చేసి అర్హత పొందితే ఆ తర్వాత కంపెనీలకు ఆదాయ వివరాలు ఇస్తామని అటార్నీ జనరల్‌ వివరించారు. ఈనెల 12న తీర్పును వెలువరిస్తామని న్యాయమూర్తి ప్రకటించారు. సవరించిన టెండర్ల నోటిఫికేషన్‌ ప్రకారం బిడ్స్‌ దాఖలుకు ఆఖరి తేదీ ఈ నెల 13వ తేదీకి ఒక రోజు ముందుగా న్యాయమూర్తి తీర్పు వెలువరించనున్నారు.

Sunday, September 4, 2016

వెంకన్న సన్నిధిలో సింధూ

కలియుగస్వామి మొక్కు చెల్లించుకున్న సింధూ

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ఒలింపిక్ రజత పతక విజేత పీవీ సింధూ దర్శించుకున్నారు. కోచ్ గోపిచంద్‌, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి శనివారం రాత్రి ఆమె తిరుమల చేరుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో సింధు, ఆమె కుటుంబసభ్యులు సహా కోచ్ గోపీచంద్ స్వామి రిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి ఆహ్వానం పలికి ఏడుకొండల వాడి దర్శన ఏర్పాట్లు పూర్తి చేశారు. దర్శనం అనంతంరం సింధు స్వామి వారికి తులాభారంగా 68 కేజీల బెల్లాన్ని సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. అనంతరం సింధు, గోపిచంద్ కుటుంబ సభ్యులకు టీటీడీ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.

చిరంజీవిని జాతి క్షమించదట...కాపు కార్పోరేషన్ ఛైర్మన్


చిరుపై కస్సుమంటున్న కాపు  కార్పోరేషన్ ఛైర్మన్

ముఖ్యమంత్రి చంద్రబాబు కాపుల అభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని.. వాటికి అడ్డంకులు సృష్టిస్తే కాపు జాతి క్షమించదంటూ కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు చిరంజీవికి కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ చలమలశెట్టి రామానుజయ లేఖ రాశారు. నగరంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఈ లేఖను విడుదల చేశారు. ‘మిమ్మల్ని అభిమానించే వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని, అయితే ఇటీవలకాలంలో మీ వ్యవహారశైలి కాపు సామాజికవర్గంలోని ప్రతి ఒక్కరికీ బాధ కలిగిస్తోంది’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. వైసీపీ అధినేత జగన్‌ పన్నిన కుట్రలో భాగంగా రాజకీయ పునరావాసం లేని కొంతమంది నాయకులు సీఎంపై విమర్శలు చేస్తున్నారని, అటువంటి వారితో మీరు కూడా కలవడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. రామానుజ లేఖ సంగతి పక్కనపెడితే, కాపు కార్పోరేషన్ ఛైర్మన్ గా ఉండి కనీసం కాపులను గుప్పిట్లో పెట్టుకోలేక పోతున్నాడని తెలుగుదేశం నేతలు రామానుజయకు రోజు తలంటుతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. పట్టుమని పదిమందికాపులను కూడా వెనుకేసుకుని తిరగలేని వ్యక్తికి కాపు ఛైర్మన్ ఎలా ఇచ్చారంటూ...అధినాయకత్వం తీరును బాహాటంగానే తప్పుపడుతున్నారట. నిన్నటికి నిన్న సదావర్తి సత్రం భూముల వ్యవహారంలో కీలకంగా ఉండి అభాసుపాలై పార్టీకి బ్యాడ్ నేమ్ తెచ్చిన రామానుజయను సాగనంపి మరో కొత్త కాపుకు ఛైర్మన్ పదవి కట్టబెట్టాలని కాపుసామాజిక వర్గం అభిప్రాయపడుతుందట...

ఎపిలో పోలీసుశాఖలో ఉద్యోగాల మేళా

పోలీసు శాఖలో భర్తీలు షురూ


ఆంధ్రప్రదేశ్ స్టేట్‌ లెవెల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ (ఎపిఎస్‌ఎల్‌పిఆర్‌బి)- పోలీస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్‌లో కింది విభాగాల్లో స్టయిపెండరీ క్యాడెట్‌ ట్రైనీ (కానిస్టేబుల్‌) పోస్టుల భర్తీకోసం దరఖాస్తులు కోరుతోంది. 
విభాగం: మెకానిక్స్‌ ఖాళీలు: 25 అర్హత: పదోతరగతి లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. ఐటిఐ(వైర్‌మెన్/ మెకానిక్‌ మోటార్‌ వెహికిల్‌/ డీజిల్‌ మెకానిక్‌/ ఫిట్టర్‌) ఉత్తీర్ణులై ఉండాలి. 
విభాగం: డ్రైవర్‌ ఖాళీలు: 134
అర్హత: ఇంటర్‌ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. లేదా పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు ఐటిఐ (వైర్‌మెన్/ మెకానిక్‌ మోటార్‌ వెహికిల్‌/ డీజిల్‌ మెకానిక్‌/ ఫిట్టర్‌) ఉత్తీర్ణులై ఉండాలి. లైట్‌ మోటార్‌ వెహికిల్‌ డ్రైవింగ్‌ లైసెన్సతోపాటు డ్రైవింగ్‌లో రెండేళ్ల అనుభవం ఉండాలి. 
వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. 
ఎంపిక: ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్‌, ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌, రాత పరీక్ష ద్వారా 
రాత పరీక్ష: నవంబరు మూడోవారంలో 
ఆనలైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: సెప్టెంబరు 13 నుంచి 
ఆనలైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: అక్టోబరు 13 
వెబ్‌సైట్‌: recruitment.appolice.gov.in

Saturday, September 3, 2016

కాణిపాక బ్రహ్మోత్సవం

గణనాధుని బ్రహ్మోత్సవాలు; ఈనెల 5 నుండే


చిత్తూరు జిల్లా కాణిపాక వరసిద్ది వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 5 నుంచి 21 రోజుల పాటూ వైభవంగా జరుగనున్నాయి. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. భక్తులకు అసౌకర్యం కలగకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. బ్రహ్మోత్సవాల వివరాలు...5న వినాయక చవితి, 6న హంసవాహనం,7న నెమలి వాహనం, 8న మూషిక వాహనం, 9న శేష వాహనం, 10న వృషభ వాహనం, 11న గజవాహనం, 12న రథోత్సవం, 13న అశ్వవాహనం,14న ధ్వజ అవరోహణం,15న అధికార నంది వాహనం,16న రావణబ్రహ్మ వాహనం,17న యాళి వాహనం, 18న సూర్య ప్రభ వాహనము, 19న చంద్రప్రభ వాహనము, 20న కామధేను వాహనం, 21న పూలంగి సేవ, 22న కల్పవృక్ష వాహనం, 23న విమానోత్సవం,24న పుష్పపల్లకి సేవ, 25న తెప్పోత్సవాలు నిర్వహిస్తున్నారు.

అడ్డదారుల్లో అంబానీ...నిబంధనలకు టిటిడి తిలోదకాలు...

అంబానీకి టిటిడి రెడ్ కార్పెట్


రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ శుక్రవారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. కుమారుడు అనంత్‌ అంబానీతో కలసి ఆయన వేకువజాము సుప్రభాతం, అభిషేకల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం హుండీలో కానుకలు సమర్పించారు. ఇదే సందర్భంగా వేద పండితులు ఆశీర్వచనం అందించగా, అధికారులు లడ్డూ ప్రసాదాలు అందజేశారు. అంతకుముందు తిరుపతి అలిపిరి వద్ద మూసివేసిన టోల్‌గేట్‌ను నిబంధనలకు విరుద్ధంగా వేవకుజాము 1 గంటకు తెరిచి అంబానీ కుటుంబం, సన్నిహితులతో కూడిన వాహనాలు తిరుమలకు అనుమతించటం విమర్శలకు తావిచ్చింది. దీనిపై మాట్లాడేందుకు టీటీడీ అధికారులు నిరాకరించారు.

లెక్క చెప్తే సరి లేకుంటే లెక్క తేల్చేస్తాం

నివేదికలు ఇవ్వకుండా నిధులా; పురందేశ్వరి


ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాకు 14వ ఆర్థిక సంఘం అభ్యంతరం చెబుతోందని బీజేపీ మహిళా నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి చెప్పారు. విజయవాడలో శనివారం బీజేపీ పదాధికారుల సమావేశనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.... ఏపీకి కేంద్ర ప్రభుత్వం సహాయం చేయడం లేదని టీడీపీ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఇప్పటి వరకు కేంద్రం రూ.4వేల కోట్లు రెవెన్యూ లోటు భర్తీ చేసిందని పురందేశ్వరి చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పనులు త్వరితగతిన జరగడం లేదని...పోలవరం అథారిటీని పరిగణనలోకి తీసుకోకుండా అంచనాలు పెంచేశారని ఆమె ఆరోపించారు. పోలవరంలో పట్టిసీమ అంతర్భాగం కాదన్నారు. ఏపీ రాజధాని అమరావతికి సంబంధించి ప్రభుత్వం సరైన డీపీఆర్ ఇవ్వలేదని పేర్కొన్నారు. అయినా రాజధానికి కేంద్ర ప్రభుత్వం రూ.1050 కోట్లు ఇచ్చిందని గుర్తుకు చేశారు. రాజధానికి, పోలవరానికి సంబంధించి ఏ నివేదికలు ఇవ్వకుండా కేంద్రం నిధులు కేటాయించలేదంటే ఎలా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని పురందేశ్వరి ప్రశ్నించారు.