Friday, September 9, 2016

స్విస్ ఛాలెంజ్ పై రాష్ట్రాన్ని ప్రశ్నించిన హైకోర్టు

ఏపి రాజధాని అమరావతి నిర్మాణం కోసం స్విస్‌ ఛాలెంజ్‌ పద్ధతిలో టెండర్లను ఆహ్వానించేప్పుడు ఆదాయ వివరాలను ఎందుకు రహస్యంగా ఉంచాల్సి వస్తోందని హైకోర్టు మరోసారి ప్రశ్నించింది. సిఆర్‌డిఎ(క్రిడా) సవరించిన టెండర్‌ నోటిఫికేషన్‌ను చెన్నైకు చెందిన ఎన్వీఎన్‌ ఇంజినీర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ డైరెక్టర్‌ కార్తీయనాథన్‌, హైదరాబాద్‌కు చెందిన ఆదిత్య కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ డైరెక్టర్‌ బి మల్లికార్జునరావు వేర్వేరుగా దాఖలు చేసిన రిట్‌ పిటిషన్లపై గురువారం ప్రభుత్వ వాదనలు ముగిశాయి. ఈ సందర్భంగా న్యాయమూర్తి సర్కారుకు పలు ప్రశ్నలు సంధించారు. సింగపూర్‌ కన్సార్టియం విషయంలో జీవోను పరిశీలిస్తే ముందే ప్రభుత్వం జోక్యం చేసుకున్నట్టు స్పష్టం అవుతోందని న్యాయమూర్తి పేర్కొన్నారు. సాక్షాత్తూ ప్రభుత్వమే జోక్యం చేసుకుంటే కిందిస్థాయి సంస్థలు లేదా అధికారులు వ్యతిరేకంగా ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఏపిీ తరఫున అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహత్గీ దానికి జవాబు చెప్పకుండా మరో అంశంపై వాదించారు. స్విస్‌ఛాలెంజ్‌ విధానంలో ఆదాయ వివరాలన్నీ ప్రాథమిక దశలోనే వెల్లడించాలని చట్టం చెబుతోందని న్యాయమూర్తి అనగానే, అటార్నీ జనరల్‌ స్పందిస్తూ సింగపూర్‌ కన్సార్టియం ప్రతిపాదనలను తొలి దశలోనే బట్టబయలు చేస్తే పెద్ద పెద్ద కంపెనీలు ముందుకు రాకపోవచ్చునన్నారు. సింగపూర్‌ కంపెనీ కూడా వెనక్కి వెళ్లిపోయే ప్రమాదం ఉందని బదులిచ్చారు. ఆదాయ వివరాలు లేకుండా ఏ కంపెనీ ముందుకు వస్తుందని హైకోర్టు పేర్కొనగా, ఎల్‌అండ్‌టి వంటి పేరున్న కంపెనీయే ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని అటార్నీ జనరల్‌ జవాబిచ్చారు. ఆదిత్య కంపెనీకి అర్హతే లేదని, మరో కంపెనీ ఎన్వీఎన్‌ ప్రీ బిడ్డింగ్‌ మీటింగ్‌లో కూడా పాల్గొనలేదని చెప్పారు. ప్రపంచానికే తలమానికంగా భావిస్తున్న రాజధాని విషయంలో పాలకులు ఆదాయ వివరాలు వెల్లడించకుండా టెండర్లను ఆహ్వానించడంలో ఆంతర్యం ఏమిటి? సింగపూర్‌ కన్సార్టియం ప్రతిపాదనలన్నీ సీల్డ్‌ కవర్‌లో గోప్యంగా ఉన్నాయని చెబుతున్న వారు ఏపికి మేలు జరుగుతుందని ముందే నిర్ణయానికి ఎలా వచ్చారు? ప్రధాన ప్రతిపాదికుడైన సింగపూర్‌ కన్సార్టియం ఇచ్చిన నివేదికపై ఏపీ సర్కార్‌ ఎందుకు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది? ఆదాయ వివరాలు తెలిస్తేనే కదా అంతకంటే పెద్ద కంపెనీలు ముందుకొచ్చేది అని హైకోర్టు నిలదీసింది. స్టే వంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తే, ఇంతవరకు జరిగిన పనులపై తీవ్ర ప్రభావం పడుతుందని ప్రాజెక్టు ఆగితే అభివృద్ధి పూర్తిగా కుంటుపడుతుందనిఅటార్నీ జనరల్‌ వాదించారు. చిన్నపాటి కంపెనీల కేసుల్ని కొట్టేయాలని కోరారు. రాజధాని నిర్మాణం ద్వారా విదేశీ పెట్టుబడుల్ని రాబట్టాలన్న మహత్తర సంకల్పం ఉన్నందునే ఆదాయ వివరాల్ని గోప్యంగా ఉంచుతున్నామన్నారు. ఇవేవీ తప్పుకానే కాదని చట్టం కూడా స్పష్టం చేస్తోందన్నారు. టెండర్‌లో బిడ్స్‌ దాఖలు చేసి అర్హత పొందితే ఆ తర్వాత కంపెనీలకు ఆదాయ వివరాలు ఇస్తామని అటార్నీ జనరల్‌ వివరించారు. ఈనెల 12న తీర్పును వెలువరిస్తామని న్యాయమూర్తి ప్రకటించారు. సవరించిన టెండర్ల నోటిఫికేషన్‌ ప్రకారం బిడ్స్‌ దాఖలుకు ఆఖరి తేదీ ఈ నెల 13వ తేదీకి ఒక రోజు ముందుగా న్యాయమూర్తి తీర్పు వెలువరించనున్నారు.

No comments:

Post a Comment