Friday, November 4, 2016

అమ్మ చల్లగుండాలి

జయమ్మను పరామర్శించిన శారదమ్మ


తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత త్వరగాకోలుకుని ఆసుపత్రి  నుంచి బయటపడతారని సీనియర్‌ నటి శారద అన్నారు. గురువారం ఆమె అపోలో ఆసుపత్రికి వచ్చి జయ ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. జయలలిత ఝాన్సీరాణి అంతటి ధైర్యసాహసాలు కలిగిన నేతగా అభివర్ణించారు. జ

శబరిమలకు ప్రత్యేక రైళ్ళు

అయ్యప్ప యాత్రికులకోసం ప్రత్యేక రైళ్ళు


శబరిమలైకి ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే సీనియర్‌ డీసీఎం కే ఉమా మహేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. నెంబర్‌ 06336 కొచ్చువేలి - గువహటి ప్రత్యేక రైలు ఈ నెల 13, 20, 27, డిసెంబర్‌ 4, 11, 18, 25 తేదీల్లో మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1.05 గంటలకు గుంటూరు వచ్చి బుధవారంలలో ఉదయం 8.45 గంటలకు గువహటి చేరుకొంటుంది. నెంబర్‌ 06335 గువహటి - కొచ్చువేలి రైలు ఈ నెల 16, 23, 30, డిసెంబర్‌ 7, 14, 21, 28 తేదీల్లో రాత్రి 11.25 గంటలకు బయలుదేరి శుక్రవారంలలో రాత్రి 8.55 గంటలకు వచ్చి శనివారం రాత్రి 10.30 గంటలకు కొచ్చువేలి చేరుకొంటుంది. ఈ రైళ్లలో ఎనిమిది స్లీపర్‌క్లాస్‌, ఆరు జనరల్‌ సెకండ్‌ క్లాస్‌ కోచలుంటాయని , ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అదనపు రైళ్ళు నడుపుతున్నట్లు చెప్పారు.

ఇంధనం లేకుంటే బండినడవదే...

పెట్రోల్ డీలర్ల మెరుపు సమ్మె


పెట్రో బంక్‌ డీలర్లు మెరుపు సమ్మెకు దిగారు. కమీషన్‌ పెంచాలన్న ప్రధాన డిమాండ్‌తో దశల వారీగా ఆందోళనకు సిద్ధమయ్యారు. తొలుత రెండు రోజుల పాటు కంపెనీల నుంచి కొనుగోళ్లు నిలిపి వేస్తున్నారు. ఈ మేరకు గురువారం తొలిరోజు కంపెనీల నుంచి పెట్రోల్‌, డీజిల్‌ కొనుగోళ్లు పూర్తిగా నిలిపివేశారు. శుక్రవారం కూడా ఇదే కొనసాగించనున్నారు. ఆ తర్వాత శనివారం నుంచి ఒకే షిష్ట్‌లో అమ్మకాలు జరపాలని పెట్రో డీలర్లు నిర్ణయించారు. ఆ మేరకు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 7వరకే పెట్రో అమ్మకాలు కొనసాగిస్తారు. ఇక ఆదివారం నుంచి ఆందోళనను ఉధృతం చేయనున్నారు. ప్రతి ఆదివారంతో పాటు, బ్యాంక్‌ల సెలవు రోజుల్లో బంక్‌లు మూసివేయాలని పెట్రో డీలర్లు నిర్ణయించారు. ఈనెల 15న దేశవ్యాప్తంగా బంక్‌ల బంద్‌ పాటించనున్నారు.

ఎన్నిసార్లు పోతావు బాబు...

10వ తేదిన బాబు ఢిల్లీ టూర్



ఈ నెల 10న సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ మరోసారి మోడి సర్కారు దృష్టికి తీసుకురానున్నారు. పోలవరం ప్రాజెక్ట్‌కు నాబార్డు రుణంపై అరుణ్‌జైట్లీ, ఉమాభారతితో చంద్రబాబు చర్చించనున్నారు. ఫిక్కి ఆధ్వర్యంలో ఉన్నత విద్యపై జరిగే సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొననున్నారు. ఇప్పటి వరకు అనేక మార్లు ఢిల్లీ చుట్టూ తిరిగిన చంద్రబాబు ఈ రాష్ట్రానికి ఏం సాధించి తీసుకొచ్చారని అటు ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. కేంద్రం ప్రకటించిన శాఖ హుదూద్ తుఫాన్ సహాయానికే ఇంతవరకు అతిగతిలేకపోతే హామీల గురించి ఎందుకు పట్టించుకుంటారన్న వాదన వినిపిస్తుంది. ఇదిలా వుంటే ఢిల్లీ టూర్ తరువాత రాష్ట్రంలో మంత్రి వర్గ విస్తరణ ఉండవచ్చన్న ప్రచార జోరందుకుంది. 

అద్దె మైకు గాలి మాటలు....

జగన్, దిగ్విజయ్ మంతనాల వెనుక రహస్యం ఏమిటి; టిడిపి గాలి ముద్దుకృష్ణ


మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీని నాశనం చేసిన చరిత్ర దిగ్విజయ్‌ సింగ్‌దని గాలి ముద్దుకృష్ణ ఆరోపించారు. తిరుపతి ఎయిర్‌పోర్టులో రెండు గంటలపాటు జగన్‌తో దిగ్విజయ్‌ రహస్య మంతనాలు బయటపెట్టాలని గాలి ముద్దుకృష్ణమనాయుడు డిమాండ్ చేశారు. ఏపీలో విహారయాత్రకు వచ్చి చంద్రబాబుపై విమర్శలు చేయడం సరికాదని గాలిముద్దుకృష్ణమ అన్నారు. ఆగస్టా, బొగ్గు, 2జీ స్పెక్ట్రం కుంభకోణాల్లో దిగ్విజయ్‌ హస్తం ఉందని గాలి ఆక్షేపించారు. డిగ్గీరాజా కాదు...సూట్‌కేసుల రాజా అని గాలిముద్దుకృష్ణమ విమర్శించారు. దిగ్విజయ్‌ ఏ రాష్ట్రంలో అడుగుపెడితే అ రాష్ట్రం నాశనమేనన్నారు. ఇదిలా వుంటే గాలి ముద్దు కృష్ణ మాటలపై చాలా మంది సెటైర్లు కూడా వేస్తున్నారు. డిగ్గీరాజా సూట్ కేసురాజా అయితే...టిడిపి నుండి కాంగ్రెస్ కు...కాంగ్రెస్ నుండి టిడిపిలోకి ఇలా రంగులు మార్చే అవకాశవాది గాలిని ఏమనాలంటున్నారు...ఎవరు అధికారంలో ఉంటే ఆపార్టీకి అద్దె మైకుగా గాలి బాగా ఉపయోగపడతాడంటూ సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు.

సంద్రంలో కలిసిపోయిన ప్రాణాలు; 240 మంది శరణార్ధులు మృతి.

మధ్యదరా సముద్రంలో ఓడ మునక; 240 మంది మృతి


మధ్యదరా సముద్రంలో జరిగిన రెండు వేర్వేరు పడవ ప్రమాదాల్లో దాదాపు 240 మంది శరణార్థులు మృతి చెందినట్లు ప్రత్యక్ష సాక్షులు ద్వారా తెలిసిందని ఐరాస శరణార్థుల విభాగం వెల్లడించింది. తాజా ఘటనలతో కలిపి ఈ ఏడాది మధ్యధరా సముద్రాన్ని దాటడానికి ప్రయత్నిస్తూ గల్లైంతనవారి సంఖ్య 4,220కు చేరుకుందని తెలిపింది. లిబియా నుంచి బయల్దేరిన ఈ రెండు పడవలు బుధవారం మునిగిపోయాయని.. ఘటనల నుంచి 31 మంది మాత్రమే సురక్షితంగా బయటపడ్డారని ఐరాస శరణార్థుల విభాగం అధికార ప్రతినిధి కార్లోటా సామి చెప్పారు. మొదటి పడవ 140 మందితో బయల్దేరిందని.. ప్రయాణికుల్లో ఆరుగురు పిల్లలు, 20 మంది మహిళలు ఉన్నారని ఆమె వెల్లడించారు. లిబియా తీరానికి 40 కి.మీ. దూరంలో ఈ పడవ ప్రమాదానికి గురైనట్లు.. ఘటన నుంచి 29 మంది బయటపడ్డట్లు చెప్పారు. మరో ప్రమాదంలో 128 మంది సముద్రంలో మునిగిపోయినట్లు ఆమె వెల్లడించారు. శరణార్థులను అక్రమంగా తరలించేవారు రబ్బరు పడవలను వాడుతుండటంతోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది.

మావో అగ్రనేత సేఫ్

ఆర్ కె క్షేమంగానే ఉన్నారు; వరవరరావు



ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌ అనంతరం ఆచూకీ లేకుండా పోయిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రామకృష్ణ అలియాస్‌ ఆర్కే క్షేమంగానే ఉన్నాడని తమకు సమాచారం అందినట్లు పౌర హక్కుల సంఘం నేత వరవరరావు చెప్పారు. ఎన్‌కౌంటర్‌ అనంతరం ఆర్కే జాడ లేకపోవడంతో తామంతా ఆందోళన చెందామన్నారు. చివరకు పదిరోజుల తర్వాత ఆయన క్షేమంగా ఉన్నట్లు తమకు సమాచారం అందిందని తెలిపారు. ఏవోబీతో పాటు తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో పోలీసుల నిర్బంధం ఇంకా కొనసాగుతూనే ఉందన్నారు. గాలింపు చర్యలు వెంటనే నిలిపివేయాలని కోరారు. ఏవోబీలో మావోయిస్టులను పట్టుకుని కాల్చి చంపారనడంలో సందేహం లేదని, ఈ ఘటనపై న్యాయ విచారణజరపాలని డిమాండ్‌చేశారు. ఏవోబీలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగిన తర్వాత మావోయిస్టు పార్టీలో కీలకనేత ఆర్కే కనిపించకుండా పోవడంతో పెద్దఎత్తున పౌరహక్కుల నేతలు ఆందోళన వ్యక్తం చేయటంతోపాటు న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు. ఆర్కె సేఫ్ గా ఉన్నాడన్న సమాచారం అందటంతో వారందరికి  కొంత ఊరట లభించింది.