Saturday, December 3, 2016

ప్రజారాజ్యమా....పోలీసు రాజ్యమా

రాష్ట్రంలో పోలీస్ రాజ్యం; కాలరాయబడుతున్న హక్కులు; సిపిఐ రామక్రిష్ణ



రాష్ట్రంలో పోలీస్‌ రాజ్యం నడుస్తోందని, సమస్యలపై ఆందోళన చేస్తే ప్రజాస్వామ్య హక్కును కూడా కాలరాస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. హోం మంత్రి చినరాజప్ప నిమిత్తమాత్రుడని, శాంతిభద్రతలన్నీ పోలీసుల చేతుల్లో పెట్టేశారని విమర్శించారు. విశాఖ జిల్లా చింతపల్లి ఏరియా ధారకొండలో ఓ సభలో పాల్గొనేందుకు వెళ్ళిన తమపార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవివి సత్యనారాయణమూర్తిని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌లో నిర్భంధించారని పేర్కొన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు సహా వామపక్ష నేతలు ఎక్కడ సమస్యలపై ఆందోళనకు దిగితే అక్కడ ముందస్తు అరెస్టులు, గృహనిర్బంధాలకు పోలీసులు బరితెగించారని, ఈ చర్యలను తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. చిన్న ప్రదర్శన చేయాలన్నా అనుమతించడం లేదన్నారు. ఈ పోలీస్‌ చర్యను నిరసిస్తూ రాష్ట్ర వ్యాపితంగా రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు నిర్వహించి, భవిష్యత్‌ పోరాట కార్యక్రమాన్ని రూపొందిస్తామన్నారు. జనసేన నేత పవన్‌ కళ్యాణ్‌ను కలిసి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపైన, కేంద్రం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపైన చర్చించామన్నారు. అంశాలన్నింటిపైనా పవన్‌కళ్యాణ్‌ అసంతృప్తితో ఉన్నట్లు వెల్లడించారు. పవన్‌తో కలిసి చర్చించిన అంశాలను సిపిఎం దృష్టికి కూడా తీసుకువెళ్ళి, రాబోయే కాలంలో ప్రజా సమస్యల పరిష్కారం దిశగా, కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు కలిసి పని చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. 

మమతా బెనర్జీపై మండిపడ్డ గవర్నర్

మమతా బెనర్జీపై బెంగాల్ గవర్నర్ ఆగ్రహం



పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీపై ఆ రాష్ట్ర గవర్నర్ కేశరీనాథ్ త్రిపాఠి ఆగ్రహం వ్యక్తం చేశారు.  సైన్యాన్ని తక్కువ చేసి మాట్లాడడం మానుకోవాలని హితవు పలికారు. టోల్‌ప్లాజాల వద్ద కేంద్రం ఆర్మీని మోహరించడంపై స్పందించిన మమత వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆర్మీ మోహరింపును సీఎం తిరుగుబాటుగా అభివర్ణించారు. అయితే తమ మోహరింపునకు సంబంధించి ప్రభుత్వానికి ముందే లేఖలు రాసినట్టు ఆర్మీ ప్రకటించడంతో మమత చిక్కుల్లో పడ్డారు. తాజాగా కొద్దిసేపటి క్రితం మమత వ్యాఖ్యలపై గవర్నర్ స్పందించారు. ఆర్మీపై ఆరోపణలు చేసేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని సూచించారు.

నోట్లు వెదజల్లి ఏంజాయ్ చేశారు..

2వేలనోట్లతో కచేరి; గుజరాత్ లో అర్భాటంగా వివాహ వేడుక




నోట్ల రద్దుతో జనం అల్లాడుతుంటే  కొత్త నోట్లతో కొందరు సరదాలు చేస్తున్నారు. ప్రధానిమోడి జన్మభూమి గుజరాత్‌లో మాత్రం డబ్బులు ఎక్కువైనట్లుంది. రూ.2000 రూపాయిల కొత్త నోట్లను విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. ప్రముఖ గాయకుడు కీర్తిదాన్‌ గడ్విపై అభిమానులు రెండు వేల రూపాయిల వర్షం కురిపించారు. గుజరాత్‌‌లోని రాజ్‌‌కోట్‌లో ఓ వివాహవేడుకలో కీర్తిదాన్ కచేరీ జరిగింది. కార్యక్రమంలో ఆయన పాటకు ఖుషీ అయిన అభిమానులు రెండు వేల రూపాయిల నోట్లను విచ్చలవిడిగా వెదజల్లారు. ‌కొత్త నోట్ల కోసం గంటల తరబడి క్యూలో నిలబడి జనాలు నానా ఇబ్బందులు పడుతుంటే వీరికి వెదజల్లేంత డబ్బులు ఎక్కడ్నుంచి వచ్చాయని సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్ ఒక్క సామాన్యుడికే.. సంపన్నులు కాదన్న మాట మరోసారి రుజువైందని నిపుణులు మండిపడుతున్నారు.

టోల్ వలిచేయ్...

టోల్ గేట్ల వద్ద చిల్లర సమస్య; వాహనదారులకు తప్పనిపాట్లు



దేశవ్యాప్తంగా టోల్‌గేట్స్ వద్ద వాహనదారులకు ఇబ్బందులు ఎదరవుతున్నాయి. పాతనోట్లు చెల్లకపోవడం, రూ.2వేలకు చిల్లర లేకపోవడంతో టోల్‌గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడుతున్నాయి. బెంగళూరు, అహ్మదాబాద్, నాగపూర్‌తో పాటు పలు ప్రాంతాల్లో జనం ఇబ్బంది పడుతున్నారు. కొన్ని చోట్ల పాత నోట్లు తీసుకుంటున్నా, రూ.2వేలకు పాత రూ.500 నోటును చిల్లరగా టోల్‌గేట్ల యాజమాన్యం ఇస్తున్నారు. దీంతో పాతనోట్లను ఎలా మార్చాలో అర్థం కావడం లేదని వాపోతున్నారు. అటు ముంబైలో టోల్‌గేట్ల వద్ద చిల్లర సమస్య ఎక్కువైంది. అందరూ రూ.2వేల నోట్లు ఇస్తుండటంతో చిల్లర లేక తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గంటల కొద్దీ టోల్‌గేట్ల వద్ద ఆగిపోవాల్సి వస్తోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది రూ.500నోట్లను తీసుకోకపోవడంతో గొడవలు జరుగుతున్నాయి. చాలా టోల్‌గేట్లలో స్వైపింగ్ మిషన్లు అందుబాటులో లేవు. దీంతో ప్రయాణికులకు టోల్‌గేట్ నిర్వాహకులకు మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి.

ప్రాణాలు తీసిన బొగ్గుగని

చైనా బొగ్గుగనిలో భారీ పేలుడు 21మంది మృతి


చైనాలోని హీలాంగ్‌జియాంగ్ ప్రావిన్స్‌లోని ఖిటాయ్హె నగరంలోని ఓ  బొగ్గు గనిలో జరిగిన పేలుడులో 21 మంది మృతి చెందినట్టు అధికారులు  ప్రకటించారు. గనిలో శిథిలాల కింద 22 మంది చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు రంగంలోకి దిగిన సహాయ సిబ్బంది 21 మంది మృతి చెందినట్టు నిర్ధారించారు. ఒక్కరు మాత్రం ఇంకా శిథిలాల కింద చిక్కుకున్నారని, రక్షించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. గనిలో పేలుడు ఘటనలో పోలీసులు అరెస్టులు ప్రారంభించారు. గని యజమాని, మేనేజర్ సహా నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

Friday, December 2, 2016

ఇక కాపుల సత్తా చూపిస్తాం

నాలుగంచెల ఉద్యమం; ముద్రగడ


ఏపీలోని 13 జిల్లాల కాపు ఐకాస నేతలతో మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం సమావేశమయ్యారు. కాపు జాతికోసం నాలుగు అంచెల ఉద్యమం చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈనెల 18న నల్ల రిబ్బన్లు, కంచం, గరిటతో ఆందోళన, ఈ నెల 30న ప్రజాప్రతినిధులను కలిసి వినతిపత్రాలు ఇస్తామని తెలిపారు. జనవరి 9న కొవ్వొత్తుల ప్రదర్శన, జనవరి 25న రావులపాలెం నుంచి అంతర్వేది వరకు పాదయాత్ర నిర్వహించనున్నట్లు చెప్పారు. పాదయాత్రకు పోలీసు అనుమతి తీసుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

ఏం చెప్పావ్ స్వామీ....అలా పెట్టు మోడీకి

తప్పు సరిదిద్దకుంటే జనాగ్రహం తప్పదు; సుబ్రహ్మణ్యస్వామి


భాజపా ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ప్రధాని తీసుకున్న నోట్లరద్దు నిర్ణయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ న్యూస్‌ ఛానల్‌తో మాట్లాడుతూ.. దేశంలో అవినీతి, నల్లధనం నిర్మూలనే ధ్యేయంగా నవంబర్‌ 8న ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయంతో దేశంలో నెలకొన్న గందరగోళాన్ని సరిదిద్దకపోతే ప్రజాదరణ అంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు కూడా ఆరు నెలల పాటు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందనీ.. ఆ తర్వాత ప్రజాదరణ అంతా ఆమెకు ప్రతికూలంగా మారిందని గుర్తుచేశారు. అంతేకాకుండా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీపైనా తీవ్ర విమర్శలు చేశారు. నోట్లరద్దు నిర్ణయం అమలు ఘోరంగా ఉందన్నారు. ఆర్థికవేత్తలైన ఆర్థికశాఖ మంత్రులు దేశానికి అవసరం కానీ..2+2=4అని చెప్పే వారు అవసరంలేదన్నారు. నోట్లరద్దుతో ఎదురైన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రధానికి సూచించారు. అలాగైతే నోట్లరద్దుతో ప్రజలకు కొంతమేర ఇబ్బందులు వచ్చినా అది 2019 ఎన్నికల్లో ప్రభావం చూపదని వ్యాఖ్యానించారు.