Wednesday, June 22, 2016

బస్సుకంటే విమానం ఎక్కటమే నయం

బస్సు రేటుకే విమాన ప్రయాణం - స్పైస్ జెట్ బంపర్ ఆఫర్లు


ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ ‘మాన్‌సూన్‌ బొనాంజా సేల్‌’ పేరుతో ఆఫర్లను ప్రకటించింది. దేశీయ రూట్లలో పలు విమాన టిక్కెట్లపై ఆఫర్‌లు ప్రకటించింది. ఒకవైపు ప్రయాణం ప్రారంభ ధర రూ.444 అని తెలిపింది. జమ్ము-శ్రీనగర్‌, అహ్మదాబాద్‌-ముంబయి, ముంబయి-గోవా, దిల్లీ-డెహ్రడూన్‌, దిల్లీ-అమృత్‌సర్‌ రూట్లలో ఒక వైపు ఛార్జీ రూ.444 మాత్రమేనని పేర్కొంది. అయితే మిగిలిన రూట్లలో సెక్టార్లు, ప్రయాణ దూరాన్ని బట్టి ఛార్జీలు వేర్వేరుగా ఉంటాయని చెప్పింది. ఐదు రోజుల పాటు అంటే జూన్‌ 26 వరకు ఈ ఆఫర్‌ కింద టిక్కెట్లు బుక్‌ చేసుకోవచ్చని వెల్లడించింది. దీని కింద టిక్కెట్లు బుక్‌ చేసుకున్న వారు జూలై1 నుంచి సెప్టెంబర్‌ 30లోపు ప్రయాణాలు చేయవచ్చు. స్పైస్‌జెట్‌.కామ్‌తోపాటు ఇతర ట్రావెల్‌ పోర్టళ్లు, ట్రావెల్‌ ఏజెంట్ల ద్వారా ఈ ఆఫర్‌ ద్వారా టిక్కెట్లు బుక్‌ చేసుకోవచ్చు. ఫస్ట్‌ కమ్‌-ఫస్ట్‌ సర్వ్‌ పద్ధతిలో సీట్లు కేటాయిస్తామని తెలిపింది. అయితే ఇది టిక్కెట్ ధర మాత్రమే ట్యాక్స్ లు మాత్రం అదనంగా ఉంటాయట.

Thursday, June 16, 2016

దొంగబాబా నిలువుదోపిడి

రియల్ వ్యాపారీని బురిడీ కొట్టించిన దొంగ బాబా

అచ్చూ సినీపక్కీలో జరిగిన ఈ ఘరానా మోసం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. ప్రసాదంలో మత్తు మందు కలిపి ఇచ్చి దొంగ బాబా రూ.కోటి ముప్పై లక్షలతో ఉడాయించాడు. బంజారాహిల్స్ రోడ్ నెం.12లో ఎమ్మెల్యే కాలనీలో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి, లైఫ్‌స్టైల్ బిల్డింగ్ యజమాని మధుసూదన్‌రెడ్డి నివాసం ఉంటున్నారు. ఆయన తన కుటుంబానికి పట్టిన కీడు తొలగిపోవాలని, వ్యాపారాభివృద్ధి జరగాలని కర్ణాటకకు చెందిన ఓ బాబాను సంప్రదించాడు. తాను పూజలు చేస్తే ఎంతటి కీడైనా తొలగిపోతుందని, వ్యాపారంలో అడ్డంకులు తొలగిపోతాయని బాబా నమ్మించాడు. ఆ మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా మధుసూదన్‌రెడ్డికి సూచించారు. మంగళవారం ఉదయం కర్ణాటక నుంచి వచ్చిన బాబాకు మధుసూదన్‌రెడ్డి బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌లో బస కల్పించారు. పూజకు కావాల్సిన సామగ్రిని మంగళవారమే కొనుగోలు చేయించారు. బుధవారం ఉదయం.10.30 గంటలకు మధుసూదన్‌రెడ్డి ఇంటికి వచ్చిన బాబా హాల్‌లో ముగ్గులు వేసి నిమ్మకాయలతో అలంకరించాడు. మధుసూదన్‌రెడ్డితో పాటు ఆయన భార్య విద్యావతి, కొడుకు సందేశ్‌రెడ్డిలను పూజల్లో కూర్చోబెట్టాడు. డబ్బు ఎంత ఉంటే అంత పూజ దగ్గర పెడితే అంతా మంచి జరుగుతుందని, దోషాలు తొలగిపోతాయని, గ్రహాలు అనుకూలిస్తాయని చెప్పాడు. దీంతో మధుసూదన్‌రెడ్డి తన వద్ద ఉన్న రూ.కోటి 30 లక్షల నోట్ల కట్టలను ముగ్గులో పేర్చాడు. మధ్యాహ్నం దాకా బాబా ఏవేవో పూజలు చేశాడు. 3.30 గంటల ప్రాంతంలో పూజలు అయిపోయినట్లు ప్రకటించిన బాబా మధుసూదన్‌రెడ్డికి, ఆయన భార్య, కొడుకుకు ప్రసాదం ఇచ్చాడు. ఆ ప్రసాదం తిన్న కొద్ది క్షణాలకే ఆ ముగ్గురూ కుప్పకూలారు. వాళ్లు కింద పడిపోగానే బాబా తన చేతికి పని చెప్పాడు. ముగ్గులోని నగదును బ్యాగులో సర్దుకొని అక్కడి నుంచి ఉడాయించాడు. కొద్దిసేపటికి పని మనుషులు, డ్రైవర్ లోనికి వచ్చారు. ముగ్గురూ కిందపడి ఉండటం చూసి అపోలో ఆస్పత్రికి తరలించారు. తేరుకున్న సందేశ్ జరిగిన విషయాన్ని డ్రైవర్‌కు చెప్పడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మధుసూదన్‌రెడ్డి పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో చేర్చారు. విద్యావతి, సందేశ్ ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం మధుసూదన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు ప్రకటించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మధుసూదన్‌రెడ్డి కోలుకుంటే ఈ దొంగ బాబాకు సంబంధించిన మరింత సమాచారం సేకరించవచ్చని భావిస్తున్నారు. బాబా కోసం ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసి వెతుకుతున్నారు. బాబా కారు డ్రైవర్ శివను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బాబా జాడ కోసం రైల్వే స్టేషన్లు, బస్‌స్టేషన్లలో నిఘా ఉంచారు. బెంగళూరు రహదారిలో ప్రత్యేక పోలీసు బృందం గాలింపు చేపట్టింది.

ఎఎస్పీ మృతిపై అనుమానాలు

పాడేరు ఎఎస్పీ అనుమానాస్పద మృతి

విశాఖపట్నం జిల్లా పాడేరు అడిషనల్ ఎస్పీ శశికుమార్ గురువారం అనుమానాస్పద స్థితిలో మరణించారు. ప్రమాదవశాత్తూ గన్ పేలిందా లేక కావాలనే ఆయన గన్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడా అనేది తెలియాల్సి ఉంది. ఈ రోజు తెల్లవారుజామున ఏఎస్పీ బంగ్లాలో కాల్పులు వినిపించడంతో అప్రమత్తమైన సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. శశికుమార్ తలకు తీవ్ర గాయం కావటంతో ఆయన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఏఎస్పీ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. అవివాహితుడు అయిన శశికుమార్ ఆరు నెలల క్రితమే పాడేరు ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన స్వస్థలం తమిళనాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇక నిఘా అంతా డ్రోన్ లతోనే

అమరావతిలో డ్రోన్ లతో నిఘా - సియం బాబు

రాజధాని అమరావతి ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట భద్రతా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఇందుకోసం సీసీటీవీ కెమెరాలను విస్తృతంగా వినియోగిస్తామన్నారు. అంతేగాక నాలుగు డ్రోన్‌లతో నిఘా ఏర్పాటు చేయనున్నట్టు ఆయన ప్రకటించారు. వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అధికారులు, ఇంజనీర్లనడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్‌శాఖ మంత్రి పి.నారాయణ, సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్‌తో కలసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రి నారాయణ జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేయించారు. అనంతరం సీఎం విలేకరులతో మాట్లాడుతూ.. తాత్కాలిక సచివాలయం నుంచి అత్యాధునిక టెక్నాలజీతో పాలన కొనసాగిస్తామని చెప్పారు. ప్రస్తుతం స్మార్ట్‌పల్స్ సర్వే చేస్తున్నట్టు, అది పూర్తై ఎటువంటి సర్టిఫికెట్లు కావాలన్నా వెంటనే పొందే అవకాశం లభిస్తుందన్నారు. రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులు హైదరాబాద్‌లో ఉండి పనిచేస్తామంటే కుదరదు. అన్ని ప్రభుత్వ శాఖలు అమరావతిలోని తాత్కాలిక రాజధానికి తరలిరావాల్సిందే. ఇక్కడినుంచే పాలన జరగాలి’ అని సీఎం అన్నారు. ఈనెల 27 నుంచి అమరావతి నుంచే మొత్తం పాలన సాగాలని చెబుతున్న విషయాన్ని గుర్తుచేస్తూ.. అందులో భాగంగా పనులు వేగంగా చేస్తున్నట్లు చెప్పారు. 22న మరోసారి తాత్కాలిక సచివాలయ పనుల్ని పరిశీలించి యాక్షన్‌ప్లాన్ ప్రకటిస్తామన్నారు. మాస్టర్‌ప్లాన్ వచ్చేంతవరకు అమరావతి ప్రాంతంలో ఉన్నరోడ్లనే అభివృద్ధి చేస్తామని చెప్పారు.

రాయలసీమ మొనగాడు

సీమ నేతల సవాళ్ళు

ఇకపై డబ్బు కోసం అమ్ముడుపోయారని ఆరోపణలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని వైసీపీ అధ్యక్షుడు జగన్, ఆ పార్టీ నాయకులను ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హెచ్చరించారు. డబ్బు కోసం పార్టీలు మారాల్సిన అవసరం తమకు లేదని, గత 30 ఏళ్లుగా తమ కుటుంబం రాజకీయాల్లో కొనసాగుతోందని తెలిపారు. ‘కావాలంటే రేపే రాజీనామా చేస్తాం. తిరిగి మేం గెలిస్తే వైసీపీని మూసేస్తారా? ధైర్యముంటే ఈ సవాల్‌ను స్వీకరించాలి. నేను, నా కుమార్తె, ఎస్వీ మోహనరెడ్డి ముగ్గురిలో ఎవరు కావాలన్నా రాజీనామా చేస్తాం. వైసీపీ సిద్ధమా’ అని భూమా సవాల్‌ విసిరారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, తన కుమార్తె అఖిలప్రియతో కలిసి విజయవాడలోని సీఎం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

మన మంచినీళ్ళల్లో మన పంచదార కలిపి

కోకోకోలా జాక్ పాట్

విశాఖ జిల్లా కృష్ణంపాలెంలో నాన్‌ ఆల్కహాలిక్‌ బేవరేజెస్‌ ప్లాంట్‌ స్థాపన కోసం హిందుస్థాన్‌ కోకా కోలా బేవరేజెస్‌కు 100 ఎకరాల భూమిని కేటాయిస్తూ పరిశ్రమల శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ సంస్థ మూడు విడతల్లో రూ.1375 కోట్ల పెట్టుబడితో నాన్‌ ఆల్కహాలిక్‌ బేవరేజెస్‌ ప్లాంట్‌ను స్థాపించనుంది. అనంతపురం జిల్లా గుడిపల్లిలో ఏరోస్పేస్‌- డిఫెన్స్‌ క్లస్టర్‌ ఏర్పాటు కోసం ఎస్సెల్‌ డిఫెన్స్‌ సొల్యూషన్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌కు 95 ఎకరాల భూమి కేటాయించింది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం వెలంపాడులో వెట్రిఫైడ్‌ యూనిట్‌ స్థాపన కోసం సుధా సిరమిక్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌కు 70 ఎకరాలకు కేటాయిస్తూ పరిశ్రమల శాఖ ఉత్తర్వులిచ్చింది.

అమేజాన్ కు కుచ్చుటోపి

అమేజాన్ ను బురిడీ కొట్టించిన యువకులు

అమెజాన్‌ ఆన్‌లైన్‌ సంస్థలో ఖరీదైన ఫోన్లు కొనుగోలు చేసి మోసం చేస్తున్న ఇద్దరిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఆరు ఆపిల్‌ ఐ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కాచిగూడకు చెందిన అంకుష్‌ బిరాజ్‌ దార్‌, పురానాహవేలికి చెందిన మిర్‌ ఫిరోజ్‌ అలీ గతంలో ఆబిడ్స్‌లోని ప్లేమాక్స్‌ గేమింగ్‌ సెంటర్‌లో పనిచేసి స్నేహితులుగా మారారు. బిరాజ్‌దార్‌ ప్రసుత్తం అమెజాన్‌ ట్రాన్‌జాక్షన్స్‌ విభాగంలో రిస్క్‌ ఇన్వ్‌స్టిగేటర్‌లో పనిచేస్తున్నాడు. ఖాతాదారులు తిరస్కరించే లొసుగులు అతడికి తెలుసు. స్నేహితుడు ఫిరోజ్‌ అలీ ద్వారా ఖరీదైన ఐ ఫోన్లను ఫేక్‌ కస్టమర్‌ ఐడీ ద్వారా అమెజాన్‌ సంస్థలో ఆన్‌లైన్‌లో బుక్‌ చేయించేవాడు. ఫిరోజ్‌ అలీ వాటిని తన కాంటాక్ట్‌ నంబరు ద్వారా డెలివరీ బాయ్‌ నుంచి కలెక్టు చేసుకుని పార్శిల్‌లోని ఖరీదైన ఐ ఫోన్‌ బదులు చైనా ఫోన్‌ పెట్టేవాడు. పార్శిల్‌ సరిగా లేదు.. ఫోన్‌లో లోపం.. రాంగ్‌ ఆర్డర్‌.. లేట్‌ డెలివరీ తదితర కారణాలతో పార్శిల్‌ వెనక్కి పంపేవాడు. చేతికి అందిన ఐ ఫోన్‌ను ఇతరులకు అమ్మి వచ్చిన లాభాన్ని ఇద్దరూ పంచుకునేవారు. నిందితుల నుంచి ఫోన్లను స్వాధీనం చేసుకుని దర్యాప్తు నిమిత్తం కేసును కాచిగూడ పోలీసులకు అప్పగించారు.

Tuesday, June 14, 2016

రాజధాని పేదోళ్ళకు హైక్లాస్ హౌస్ లు

పేదోళ్ళ పక్కా ఇంటికి  ప్రభుత్వం పక్కా ప్రణాళిక

అమరావతి రాజధానిలో ఆర్థికంగా వెనకబడి ఉన్న కుటుంబాలకు ఇళ్లను నిర్మించి ఇచ్చేందుకు సీఆర్‌డీఏ సిద్ధమౌతుంది. ప్రజా రాజధానిగా అమరావతిని నిర్మించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. హైఫై రాజాధానిలో పూరిగుడిసెలు కనబడకూడదన్న లక్ష్యంతో వెనకబడి ఉన్న వర్గాలకు అనువుగా ఉండే, ఆమోదయోగ్యమైన ఇళ్లను నిర్మించి ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. రాజధానిలోని 29 గ్రామాల్లో ఇళ్లు లేని నిరుపేదలను సామాజిక ఆర్థిక సర్వే ద్వారా గుర్తించారు. వారికి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఇళ్లను నిర్మించి ఇస్తామని పలుమార్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వాగ్దానాలు చేశారు. బలహీనవర్గాలకు ఇళ్ల నిర్మాణం ద్వారా 980 మందికి ఉద్యోగాలు కూడా లభిస్తాయని సీఆర్‌డీఏ అంచనా వేసింది. ఈ ప్రాజెక్టులోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించింది. గృహనిర్మాణం రంగంలో 100 శాతం ఎఫ్‌డీఐలను ఆటోమేటిక్‌ రూట్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. ఇందుకోసం తన నుంచి ఎలాంటి అనుమతి తీసుకోవాల్సిన పని లేదని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఎఫ్‌డీఐలను ఈ రంగంలో ఆకర్షించేందుకు కనీస పెట్టుబడి నిబంధనను ఎత్తివేసింది. అలానే కనీస అభివృద్ధి మార్గదర్శకాలు అంటూ ఏవీ లేవు. ట్రంక్‌ ఇనఫ్రాస్ట్రక్చర్‌ అభివృద్ధి జరిగాక ప్రాజెక్టులు పూర్తి అయ్యేవరకు వేచి చూడకుండా విదేశీ పెట్టుబడిదారులు తప్పుకోవచ్చు. 15 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఇంచుమించు 10 లక్షల మంది ఇతరత్రా ఉద్యోగులు అమరావతికి కొన్ని నెలల్లోనే రానున్నారు. దీని వలన ఇక్కడ ఇళ్ల నిర్మాణాలకు డిమాండ్‌ గణనీయంగా పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు ఇళ్ల నిర్మాణం చేసి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. 2018 నాటికి ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయడానికి సీఆర్‌డీఏ లక్ష్యం నిర్దేశించుకొన్నది.

అన్వితా విజయ్ కు అరుదైన అవకాశం

యాపిల్ సదస్సుకు చిన్నారికి అవకాశం
యాపిల్‌ సదస్సుకు హాజరుకానున్న పిన్న వయస్కురాలిగా భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియా బాలిక రికార్డు సృష్టించింది. ఐఫోన్‌, ఐప్యాడ్‌లలో వాడే కొన్ని చిన్న పిల్లల యాప్‌లను 9 ఏళ్ల అన్వితా విజయ్‌ రూపొందించింది. శాన్‌ఫ్రాన్సిస్కోలో జరగనున్నWWDC- 2016 సదస్సులో యాపిల్‌ సీఈవో టిమ్‌కుక్‌ను కలుసుకోవడం తన కల అని అన్వితా చెబుతోంది. యూట్యూబ్‌ ద్వారా యాప్‌లను అభివృద్ధి చేసే ఉచిత కోడింగ్‌ పాఠాలను నేర్చుకొని ఆమె వీటిని తయారు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా యాప్‌లను తయారు చేసే వారికి యాపిల్‌ ఉపకారవేతనాలు అందిస్తోంది.

లోయలో పడ్డ బస్సు

బస్సులో లోయలో పడి ఇద్దరి మృతి

కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలంలోని దూలచెరువు ఘాట్‌ రోడ్డు నాలుగో మలుపు వద్ద  ఆర్టీసీ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, 24 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బెంగళూరు నుంచి కడప వస్తున్న ఆర్టీసీ బస్సు తెల్లవారుజామున 5గంటల సమయంలో ఘాట్‌రోడ్డులోని నాలుగోమలుపు వద్దకు రాగానే అదుపుతప్పి లోయలోపడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 28 ప్రయాణికులు ఉండగా వారిలో బస్సు కండక్టర్‌ రత్నం(45)తోపాటు మరో ప్రయాణికుడు మృతి చెందారు. 24 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను కడప రిమ్స్‌కు తరలించారు.

సిఐ బదీలీపై నేతల మధ్య యుద్ధం

టిడిపిలో సిఐ బదిలీ చిచ్చు

అద్దంకి తెలుగుదేశం పార్టీలో సిఐ బదిలీ వ్యవహారం చిచ్చురేపింది. ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అద్దంకి సీఐ బేతపూడి ప్రసాద్‌ను  బదిలీ చేయించిని గంటల వ్వవధిలోనే, ఆ బదిలీని నిలిపివేయించి కరణం తన రియాక్షన్‌ చూపించారు. అధికార పార్టీలోని ఇరువర్గాల గొడవ అధిష్టానం తలకు చుట్టుకుంది. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ ఇటీవలే అధికార పార్టీలో చేరారు.గొట్టిపాటి రాకను కరణం బలరామకృష్ణమూర్తి,ఆయన తనయుడు కరణం వెంకటేష్‌లు వ్యతిరేకించారు. అయినా చంద్రబాబు గొట్టిపాటిని పార్టీలో చేర్చుకున్నారు. అప్పటి నుంచి అద్దంకిలో వర్గవిభేదాలు భగ్గుమన్నాయి. గొట్టిపాటిని కరణం వర్గీయులు అడుగడుగునే అడ్డుకుంటూనే ఉన్నారు. అయితే గొట్టిపాటి చాప కింద నీరులా తన పని చక్కబెట్టుకునే ప్రయత్నానికి దిగారు. ఇందులో భాగంగా ఏడాదిన్నరగా అద్దంకి సీఐగా పని చేస్తున్న బేతపూడి ప్రసాద్‌ను గొట్టిపాటి పట్టుపట్టి డీఐజీ ద్వారా బదిలీ చేయించారు. ఆదివారం ఉదయానికి బదిలీ ఉత్తర్వులు వెలువడినట్లు విశ్వసనీయ సమాచారం. ఆయన స్థానంలో గుంటూరు వీఆర్‌లో ఉన్న హైమారావును అద్దంకి సిఐగా బదిలీ చేయించారు. బేతపూడి ప్రసాద్‌ కరణం వర్గీయుడిగా ముద్ర వేసుకున్న విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న కరణం హుటాహుటిన పావులు కదిపారు.ఐజీతో పాటు ఏకం గా డీజీపీ పైనే ఒత్తిడి తెచ్చారు. అంతే..! ఆదివారం సాయంత్రానికి సీఐ బదిలీ ఆగిపోయింది. ప్రసాద్‌ బదిలీని నిలిపివేస్తున్నట్లు పోలీస్‌ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో ఇరువర్గాల మధ్య వర్గవిభేదాలు పతాకస్థాయికి చేరాయి. తాను పార్టీలో చేరేటప్పుడే సీఐ బదిలీ ప్రధాన డిమాండ్‌గా చెప్పానని, ఇప్పుడు అది కూడా చేయకపోతే తాను పార్టీలో ఉండటం ఎందుకంటూ రవికుమార్‌ చినబాబు లోకేష్‌ వద్ద వాపోయినట్లు సమాచారం. తొలి డిమాండే నెరవేరకపోతే మిగిలిన హామీలు ఏం నెరవేరుస్తారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.