Thursday, June 16, 2016

ఇక నిఘా అంతా డ్రోన్ లతోనే

అమరావతిలో డ్రోన్ లతో నిఘా - సియం బాబు

రాజధాని అమరావతి ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట భద్రతా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఇందుకోసం సీసీటీవీ కెమెరాలను విస్తృతంగా వినియోగిస్తామన్నారు. అంతేగాక నాలుగు డ్రోన్‌లతో నిఘా ఏర్పాటు చేయనున్నట్టు ఆయన ప్రకటించారు. వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అధికారులు, ఇంజనీర్లనడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్‌శాఖ మంత్రి పి.నారాయణ, సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్‌తో కలసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రి నారాయణ జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేయించారు. అనంతరం సీఎం విలేకరులతో మాట్లాడుతూ.. తాత్కాలిక సచివాలయం నుంచి అత్యాధునిక టెక్నాలజీతో పాలన కొనసాగిస్తామని చెప్పారు. ప్రస్తుతం స్మార్ట్‌పల్స్ సర్వే చేస్తున్నట్టు, అది పూర్తై ఎటువంటి సర్టిఫికెట్లు కావాలన్నా వెంటనే పొందే అవకాశం లభిస్తుందన్నారు. రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులు హైదరాబాద్‌లో ఉండి పనిచేస్తామంటే కుదరదు. అన్ని ప్రభుత్వ శాఖలు అమరావతిలోని తాత్కాలిక రాజధానికి తరలిరావాల్సిందే. ఇక్కడినుంచే పాలన జరగాలి’ అని సీఎం అన్నారు. ఈనెల 27 నుంచి అమరావతి నుంచే మొత్తం పాలన సాగాలని చెబుతున్న విషయాన్ని గుర్తుచేస్తూ.. అందులో భాగంగా పనులు వేగంగా చేస్తున్నట్లు చెప్పారు. 22న మరోసారి తాత్కాలిక సచివాలయ పనుల్ని పరిశీలించి యాక్షన్‌ప్లాన్ ప్రకటిస్తామన్నారు. మాస్టర్‌ప్లాన్ వచ్చేంతవరకు అమరావతి ప్రాంతంలో ఉన్నరోడ్లనే అభివృద్ధి చేస్తామని చెప్పారు.

No comments:

Post a Comment