Tuesday, June 14, 2016

రాజధాని పేదోళ్ళకు హైక్లాస్ హౌస్ లు

పేదోళ్ళ పక్కా ఇంటికి  ప్రభుత్వం పక్కా ప్రణాళిక

అమరావతి రాజధానిలో ఆర్థికంగా వెనకబడి ఉన్న కుటుంబాలకు ఇళ్లను నిర్మించి ఇచ్చేందుకు సీఆర్‌డీఏ సిద్ధమౌతుంది. ప్రజా రాజధానిగా అమరావతిని నిర్మించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. హైఫై రాజాధానిలో పూరిగుడిసెలు కనబడకూడదన్న లక్ష్యంతో వెనకబడి ఉన్న వర్గాలకు అనువుగా ఉండే, ఆమోదయోగ్యమైన ఇళ్లను నిర్మించి ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. రాజధానిలోని 29 గ్రామాల్లో ఇళ్లు లేని నిరుపేదలను సామాజిక ఆర్థిక సర్వే ద్వారా గుర్తించారు. వారికి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఇళ్లను నిర్మించి ఇస్తామని పలుమార్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వాగ్దానాలు చేశారు. బలహీనవర్గాలకు ఇళ్ల నిర్మాణం ద్వారా 980 మందికి ఉద్యోగాలు కూడా లభిస్తాయని సీఆర్‌డీఏ అంచనా వేసింది. ఈ ప్రాజెక్టులోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించింది. గృహనిర్మాణం రంగంలో 100 శాతం ఎఫ్‌డీఐలను ఆటోమేటిక్‌ రూట్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. ఇందుకోసం తన నుంచి ఎలాంటి అనుమతి తీసుకోవాల్సిన పని లేదని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఎఫ్‌డీఐలను ఈ రంగంలో ఆకర్షించేందుకు కనీస పెట్టుబడి నిబంధనను ఎత్తివేసింది. అలానే కనీస అభివృద్ధి మార్గదర్శకాలు అంటూ ఏవీ లేవు. ట్రంక్‌ ఇనఫ్రాస్ట్రక్చర్‌ అభివృద్ధి జరిగాక ప్రాజెక్టులు పూర్తి అయ్యేవరకు వేచి చూడకుండా విదేశీ పెట్టుబడిదారులు తప్పుకోవచ్చు. 15 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఇంచుమించు 10 లక్షల మంది ఇతరత్రా ఉద్యోగులు అమరావతికి కొన్ని నెలల్లోనే రానున్నారు. దీని వలన ఇక్కడ ఇళ్ల నిర్మాణాలకు డిమాండ్‌ గణనీయంగా పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు ఇళ్ల నిర్మాణం చేసి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. 2018 నాటికి ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయడానికి సీఆర్‌డీఏ లక్ష్యం నిర్దేశించుకొన్నది.

No comments:

Post a Comment