Tuesday, June 14, 2016

సిఐ బదీలీపై నేతల మధ్య యుద్ధం

టిడిపిలో సిఐ బదిలీ చిచ్చు

అద్దంకి తెలుగుదేశం పార్టీలో సిఐ బదిలీ వ్యవహారం చిచ్చురేపింది. ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అద్దంకి సీఐ బేతపూడి ప్రసాద్‌ను  బదిలీ చేయించిని గంటల వ్వవధిలోనే, ఆ బదిలీని నిలిపివేయించి కరణం తన రియాక్షన్‌ చూపించారు. అధికార పార్టీలోని ఇరువర్గాల గొడవ అధిష్టానం తలకు చుట్టుకుంది. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ ఇటీవలే అధికార పార్టీలో చేరారు.గొట్టిపాటి రాకను కరణం బలరామకృష్ణమూర్తి,ఆయన తనయుడు కరణం వెంకటేష్‌లు వ్యతిరేకించారు. అయినా చంద్రబాబు గొట్టిపాటిని పార్టీలో చేర్చుకున్నారు. అప్పటి నుంచి అద్దంకిలో వర్గవిభేదాలు భగ్గుమన్నాయి. గొట్టిపాటిని కరణం వర్గీయులు అడుగడుగునే అడ్డుకుంటూనే ఉన్నారు. అయితే గొట్టిపాటి చాప కింద నీరులా తన పని చక్కబెట్టుకునే ప్రయత్నానికి దిగారు. ఇందులో భాగంగా ఏడాదిన్నరగా అద్దంకి సీఐగా పని చేస్తున్న బేతపూడి ప్రసాద్‌ను గొట్టిపాటి పట్టుపట్టి డీఐజీ ద్వారా బదిలీ చేయించారు. ఆదివారం ఉదయానికి బదిలీ ఉత్తర్వులు వెలువడినట్లు విశ్వసనీయ సమాచారం. ఆయన స్థానంలో గుంటూరు వీఆర్‌లో ఉన్న హైమారావును అద్దంకి సిఐగా బదిలీ చేయించారు. బేతపూడి ప్రసాద్‌ కరణం వర్గీయుడిగా ముద్ర వేసుకున్న విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న కరణం హుటాహుటిన పావులు కదిపారు.ఐజీతో పాటు ఏకం గా డీజీపీ పైనే ఒత్తిడి తెచ్చారు. అంతే..! ఆదివారం సాయంత్రానికి సీఐ బదిలీ ఆగిపోయింది. ప్రసాద్‌ బదిలీని నిలిపివేస్తున్నట్లు పోలీస్‌ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో ఇరువర్గాల మధ్య వర్గవిభేదాలు పతాకస్థాయికి చేరాయి. తాను పార్టీలో చేరేటప్పుడే సీఐ బదిలీ ప్రధాన డిమాండ్‌గా చెప్పానని, ఇప్పుడు అది కూడా చేయకపోతే తాను పార్టీలో ఉండటం ఎందుకంటూ రవికుమార్‌ చినబాబు లోకేష్‌ వద్ద వాపోయినట్లు సమాచారం. తొలి డిమాండే నెరవేరకపోతే మిగిలిన హామీలు ఏం నెరవేరుస్తారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

No comments:

Post a Comment