Monday, December 5, 2016
Sunday, December 4, 2016
ఆన్ లైన్ షాపింగ్ తస్మాత్ జాగ్రత్త...
జాగ్రత్తలు పాటిస్తూ క్రెడిట్, డెబిట్ కార్డులను వాడండి
మీరు క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించి ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా? అయితే ఒక్క క్షణం. ఇకముందు ఆన్‌లైన్‌లో వస్తువులు కొనేముందు కొన్ని జాగ్రత్తలు పాటించండి. లేదంటే ఆరంటే ఆరు సెకన్లలో మీ కార్డులోని సమస్త సమాచారాన్ని హ్యాకర్లు తస్కరించే ప్రమాదం ఉంది. ఈమాటన్నది మరెవరో కాదు.. బ్రిటన్‌లోని న్యూకేజిల్ యూనివర్సిటీ పరిశోధకులు. డెబిట్, క్రెడిట్ కార్డుల వాడకంలోని లోపాలపై అధ్యయనం చేసిన వారు ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా మోసానికి గురయ్యే మార్గాలను బయటపెట్టారు.
తప్పుడు సమాచారంతో హ్యాకర్లు చేసే పలు ప్రయత్నాలను వీసా వ్యవస్థ కానీ, బ్యాంకులు కానీ పసిగట్టలేకపోతున్నాయని పరిశోధనకారులు పేర్కొన్నారు. దీంతో స్వయంచాలిత సమాచారంతో కార్డుల్లోని సమాచారాన్ని హ్యాకర్లు దొంగిలించే ప్రమాదం ఉందని తెలిపారు. వెబ్‌సైట్లలో పలుమార్లు ప్రయత్నించడం ద్వారా కావాల్సిన సమాచారాన్ని తెలుసుకోగలుగుతున్నారని, కేవలం ఆరు సెకన్లలోనే కావాల్సిన సమాచారంపై ఓ అంచనాకు వచ్చేస్తున్నారని వారు వివరించారు. చిన్న ల్యాప్‌టాప్, దానికో నెట్ కనెక్షన్ ఉంటే హ్యాకర్లకు దొరికిపోయే అవకాశం మరింత ఎక్కువని వారు పేర్కొన్నారు. ఒకే కార్డుతో తప్పుడు సమాచారంతో పలుమార్లు ఆన్‌లైన్ కొనుగోళ్లు జరుపుతున్నప్పటికీ దానిని బ్యాంకులు గుర్తించలేకపోతున్నాయని తెలిపారు. పిన్ నంబర్, గడువుతేదీ, కార్డు నంబరు తదితర వివరాలను తెలుసుకునేందుకు హ్యాకర్లు చేసే విఫల యత్నాలను బ్యాంకింగ్ వ్యవస్థ గుర్తించలేకపోతోందన్నారు. ఒక్కో వెబ్‌సైట్ ఒక్కో రకంగా సమాచారాన్ని తెలుసుకుని నిర్ధారించడం కూడా హ్యాకర్లకు అనుకూలంగా మారుతోందన్నారు
నోట్ల రద్దుతో మీడియా విలవిలలాడుతుందా...
నోట్ల రద్దుతో మీడియాకు కష్టాలు
పెద్ద నోట్ల రద్దు వ్యాపారులు, సామాన్యులకే కాదు మీడియా సంస్థలకు కూడా గట్టి దెబ్బకొట్టింది. పత్రికలు, టీవీ ఛానళ్లకు ఆదాయం భారీగా పడిపోయింది. పెద్ద నోట్ల రద్దుతో అన్ని వస్తువులకు డిమాండ్ పడిపోయింది. వస్తువుల అమ్మకాలు తగ్గిపోయాయి. దీంతో మీడియాలో ప్రకటనలు ఇచ్చేందుకు వ్యాపారసంస్థలు ముందుకురావడం లేదు. వ్యాపారమే లేనప్పుడు ప్రకటనలు ఇవ్వడం వల్ల ఏంటి ఉపయోగం అన్నది కంపెనీల భావన. నోట్ల రద్దు వల్ల మీడియా రంగం 2000 వేల కోట్ల మేర ప్రకటనలను కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. నగదు అందుబాటులో లేకపోవడం, వినియోగదారులు ఆచితూచి ఖర్చు చేస్తున్న నేపథ్యంలో… కార్పొరేట్ సంస్థలు, కంపెనీలు, వాణిజ్య సంస్థలు వ్యాపార ప్రకటనల ఖర్చును తగ్గించుకోక తప్పడం లేదు. ఇప్పటికే షెడ్యూల్ చేసిన ప్రకటనలను కూడా కంపెనీలు వెనక్కు తీసుకుంటున్నాయి.
‘‘పెద్దనోట్ల రద్దు ప్రభావం తాత్కాలికమేనని, అంతా సర్దుకుంటుందని తొలుత అనుకున్నాం. మా అంచనా తప్పుతోంది. చాలా కంపెనీలు డిసెంబరులోనూ ప్రకటనల వ్యయాన్ని కత్తిరిస్తున్నాయి. ఒక్కరోజే మా ప్రధాన క్లయింట్లు ఇద్దరు ప్రకటనల ఖర్చును తగ్గించేశారు. మొత్తంగా చూస్తే ఈ రంగానికి 1500 కోట్లకుపైనే నష్టం తప్పదనిపిస్తోంది’’ అని ఒక ప్రఖ్యాత యాడ్ ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్ వ్యాఖ్యానించినట్టు ఎకనామిక్ టైమ్స్ మ్యాగజైన్ వెల్లడించింది. ‘ఈ సంవత్సరం ఆయా కంపెనీలు, సంస్థలు ప్రకటనలపై రూ.50వేల కోట్లు వెచ్చిస్తాయని అంచనా వేశాం. చివరి 3 నెలల్లో రూ.20వేల కోట్ల ప్రకటనలు వెలువడతాయని భావించాం. నవంబరు నాటికి ఇందులో 10వేల కోట్ల వరకు యాడ్స్ వచ్చినా… డిసెంబరుకు సంబంధించి 15 నుంచి 20 శాతం, అంటే 1500 కోట్ల నుంచి 2వేల కోట్ల వరకు ప్రకటనలు తగ్గుతాయి’’ అని డెంట్సు ఏజిస్ నెట్‌వర్క్ – దక్షిణాసియా సీఈవో ఆశిష్ భాసిన్ వ్యాఖ్యానించారు. ఇప్పట్లో సాధారణ స్థితికి వచ్చే అవకాశాలు కనిపించడం లేదని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. కనీసం ఆరు నెలలు పట్టవచ్చని అంచనా వేస్తున్నారు.
చంద్రబాబుకు ఎవరితో విభేదాలు లేవట...నమ్మాల్సిన నిజమేనా
నాకు కేసిఆర్ తో విభేదాలు లేవు ; చంద్రబాబు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో తనకు ఎలాంటి విభేదాలూ లేవని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టంచేశారు. శనివారం ఆయన దిల్లీలో హిందుస్థాన్ టైమ్స్ నిర్వహించిన నాయకత్వ సదస్సులో ‘ప్రపంచ నీటి సంక్షోభం- పరిణామాలు’ అనే అంశంపై కీలక ప్రసంగం చేశారు. కొత్త రాష్ట్రంలో ప్రధానంగా వ్యవసాయం, సాగునీటి రంగాలపై దృష్టిసారించినట్లు చెప్పారు. వర్షపు నీటిని నదులకు అనుసంధానం చేసే దిశగా కృషిచేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. తొలి అర్ధసంవత్సరంలో 25.6 శాతం వ్యవసాయం వృద్ధి సాధించినట్లు వివరించారు. మత్స్య పరిశ్రమ రంగంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందన్నారు. తొమ్మిదేళ్ల పాలనలో 30 నుంచి 300 ఇంజినీరింగ్ కళాశాలలు ఏర్పాటుచేసినట్లు గుర్తుచేశారు. ఐటీ రంగంలో ప్రపంచవ్యాప్తంగా తెలుగు విద్యార్థులు ఉన్నారని చెప్పారు. ప్రతి పాఠశాలలో డిజిటల్ తరగతులు ఉండాలని అన్నారు. నూతన రాజధాని అమరావతిలో తాత్కాలిక సచివాలయం నిర్మించుకున్నామని చెప్పారు. అమరావతికి భవిష్యత్తులో కొన్ని విశ్వవిద్యాలయాలు రానున్నాయనీ, విజయవాడ-గుంటూరు నగరాల మధ్యలో అమరావతిని నిర్మిస్తున్నట్లు తెలిపారు. తమ హయాంలోనే హైదరాబాద్ విమానాశ్రయం, సైబర్ సిటీలను నిర్మించినట్లు చెప్పారు. వాటిని చూస్తే ఎప్పుడూ గర్వంగా ఉంటుందని చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వంతో ఎలాంటి విభేదాలు లేవని, తెలంగాణ సీఎం తనకు సహచరుడని, బాగా తెలుసునని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసిమెలిసి పనిచేసేందుకు సిద్ధమని ప్రకటించారు. విభజన తర్వాత రాష్ట్రంలో కొన్ని సమస్యలు నెలకొన్నాయన్నారు. 2022 సంవత్సరం నాటికి దేశంలోని మూడు అగ్ర నగరాల్లో అమరావతి ఒకటిగా నిలపాలన్నదే తమ లక్ష్యమన్నారు. 2029 నాటికి దేశంలోనే అగ్ర, 2050 నాటికి ఉత్తమ మజిలీ నగరంగా అమరావతి నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.
రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పాలన కొనసాగిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను కోరుతున్నట్లు చెప్పారు. గతేడాది 10.99 శాతం వృద్ధి సాధించినట్లు చెప్పారు. రెండంకెల వృద్ధిరేటు సాధనే తమ విజయానికి నిదర్శనమన్నారు. సులభతర వాణిజ్యానికి ఏపీ అనుకూల రాష్ట్రంగా మారిందన్నారు. రూ.149లకే కేబుల్, అంతర్జాలం, ఫోన్ సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఇంటికీ అంతర్జాల సౌకర్యం ఏర్పాటుచేస్తున్నామనీ, భవిష్యత్తులో ప్రతి ఇంటికీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడవచ్చని సీఎం వివరించారు
మహిళా పార్లమెంటేరియన్ల తొలి మహాసభలు ఏక్కడ
అమరావతిలో మహిళా పార్లమెంటేరియన్ల సభలు; ఎపి స్పీకర్ కోడెల శివప్రసాద్
నవ్యాంధ్రప్రదేశ రాజధాని అమరావతిలో జాతీయ మహిళా పార్లమెంట్ నిర్వహించడానికి చురుకుగా సన్నాహాలు జరుగుతున్నాయి. మహిళా పార్లమెంటేరియన్ తొలి మహాసభలు వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 10,11,12 తేదీలలో అమరావతిలో నిర్వహింప చేసే క్రమంలో సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు వేగంగా పనిచేసుకు పోతున్నారు. పుణే లోని ఎంఐటీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ కార్యక్రమాన్ని సమన్వయ పరచనుండగా, గత కొన్ని నెలలుగా ఈ అంశంపై కసరత్తు చేస్తున్న డాక్టర్ కోడెల శనివారం పూణేలో పర్యటించారు. తొలుత సదస్సుకు సంబంధించిన కార్యాచరణను వేగవంతం చేస్తూ రానున్న 2నెలల కార్యాచరణ ప్రణాళిక ఖరారు చేసుకునే క్రమంలో ఎంఐటీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. సంస్థ ఉపాధ్యక్షుడు రాహుల్ వి. కరాడ్ తదితరులు ఈ భేటీలో ఉన్నారు.
అనంతరం అక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో డా.కోడెల మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఈ సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరి సహకారం అవసరమన్నారు. ఎంఐటీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ కార్యక్రమాన్ని సమన్వయ పరుస్తుందని, ఈ విద్యా సంస్థలు సహ భాగస్వామ్యం వహిస్తున్నాయన్నారు. దాదాపు పది వేల మంది విద్యార్థులను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తున్నామని దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థినులు ఎవరైనా సదస్సుకు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. ఉన్నత ఆశయం తో ఈ సదస్సు నిర్వహిస్తుండగా జాతీయ, అంతర్ జాతీయ స్థాయి సంస్థలు భాగస్వామ్యం వహించటం విశేష మన్నారు. మూడు రోజులపాటు జరిగే ఈ సభల్లో దేశవ్యాప్తంగా 400కు పైగా మహిళా పార్లమెంట్ , శాసన సభ్యులు పాల్గొంటారన్నారు. సమావేశాలకు చైర్మన్‌గా తాను, చీఫ్ ప్యాట్రన్‌గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహరించనుండగా, అధ్యక్షురాలిగా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ట్రస్టీ సుధా నారాయణ మూర్తి ఉంటారన్నారు.
ఇప్పటి వరకు సిద్దం చేసిన తాత్కాలిక కార్యాచరణను అనుసరించి ‘మహిళా ప్రోత్సాహం - ప్రజాస్వామ్యం పటిష్టత’ అనే అంశంపై 3 రోజులు జరిగే మహాసభలో విభిన్న అంశాలు చర్చకు వస్తాయన్నారు. తొలి రోజు‘మహిళా సాధికారిత- రాజకీయ సవాళ్లు’, వ్యక్తిత్వ నిర్మాణం - భవిష్యత్తు దార్శనికత, గురు శిష్యుల సంబంధాల పెంపు అన్న అంశాలు, రెండవ రోజు మహిళల స్థితి - నిర్ణయాత్మక శక్తి, మీకు మీరే సాటి అనే అంశాలపైన ప్రముఖుల ప్రసంగాలు ఉంటాయన్నారు. మూడవ రోజు మహిళా సాధికారిత కోసం పరుగు నిర్వహిస్తామని, ప్రతి రోజూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేలా ఏర్పాట్లు ఉంటాయని సభాపతి డా.కోడెల పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో మహారాష్ట్ర కౌన్సిల్ చైర్మన్ నింబాల్కర్, ప్రభుత్వ సలహాదారు రామలక్ష్మి, ఓఎస్‌డి గురుమూర్తి ఉన్నారు.
మహారాష్ట్రలో రాహుల్‌కు చెందిన గ్రూప్ 79 విద్యా సంస్థలను నిర్వహిస్తోంది. ఎంఐటీస్కూల్ ఆఫ్ గవర్నమెంట్ పేరుతో ప్రజా పాలన రంగంలో శిక్షణను ఇచ్చే విద్యా సంస్థ కూడా ఇందులో ఉంది. అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఈ దిశగా చొరవ తీసుకుని సదస్సు నిర్వహణ చేపట్టగా, యునెస్కో సైతం ఈ సదస్సులో భాగస్వామ్యం కాబోతుంది. ఇటువంటి మహిళా పార్లమెంట్ నిర్వహించడం ఇదే ప్రథమం కాగా దీనికి దేశవ్యాప్తంగా ఉన్న మహిళా పార్లమెంటేరియన్లు, ప్రజాప్రతినిధులతో సహా వివిధ రంగాల్లోని మహిళా ప్రముఖులను సభాపతి ఇప్పటికే ఆహ్వానిస్తున్నారు. దేశవ్యాప్తంగా పది వేల మంది చురుకైన విద్యార్థినులను ఈ సదస్సుకు ఆహ్వనించి వారిని ఉత్తేజితులను చేయనున్నారు. ఈ సమావేశాలను కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్, భారతీయ ఛాత్ర సంసాద్ ఫౌండేషన్, ఇంటర్ పార్లమెంటరీ యూనియన్‌ల సహకారంతో ఆంధ్రప్రదేశ్ శాసనసభ, రాష్ట్ర ప్రభుత్వం సంయిక్తంగా నిర్వహించనున్నాయి.
Saturday, December 3, 2016
ప్రజారాజ్యమా....పోలీసు రాజ్యమా
రాష్ట్రంలో పోలీస్ రాజ్యం; కాలరాయబడుతున్న హక్కులు; సిపిఐ రామక్రిష్ణ
రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తోందని, సమస్యలపై ఆందోళన చేస్తే ప్రజాస్వామ్య హక్కును కూడా కాలరాస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. హోం మంత్రి చినరాజప్ప నిమిత్తమాత్రుడని, శాంతిభద్రతలన్నీ పోలీసుల చేతుల్లో పెట్టేశారని విమర్శించారు. విశాఖ జిల్లా చింతపల్లి ఏరియా ధారకొండలో ఓ సభలో పాల్గొనేందుకు వెళ్ళిన తమపార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవివి సత్యనారాయణమూర్తిని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌లో నిర్భంధించారని పేర్కొన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు సహా వామపక్ష నేతలు ఎక్కడ సమస్యలపై ఆందోళనకు దిగితే అక్కడ ముందస్తు అరెస్టులు, గృహనిర్బంధాలకు పోలీసులు బరితెగించారని, ఈ చర్యలను తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. చిన్న ప్రదర్శన చేయాలన్నా అనుమతించడం లేదన్నారు. ఈ పోలీస్ చర్యను నిరసిస్తూ రాష్ట్ర వ్యాపితంగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి, భవిష్యత్ పోరాట కార్యక్రమాన్ని రూపొందిస్తామన్నారు. జనసేన నేత పవన్ కళ్యాణ్‌ను కలిసి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపైన, కేంద్రం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపైన చర్చించామన్నారు. అంశాలన్నింటిపైనా పవన్‌కళ్యాణ్ అసంతృప్తితో ఉన్నట్లు వెల్లడించారు. పవన్‌తో కలిసి చర్చించిన అంశాలను సిపిఎం దృష్టికి కూడా తీసుకువెళ్ళి, రాబోయే కాలంలో ప్రజా సమస్యల పరిష్కారం దిశగా, కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు కలిసి పని చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు.
మమతా బెనర్జీపై మండిపడ్డ గవర్నర్
మమతా బెనర్జీపై బెంగాల్ గవర్నర్ ఆగ్రహం
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీపై ఆ రాష్ట్ర గవర్నర్ కేశరీనాథ్ త్రిపాఠి ఆగ్రహం వ్యక్తం చేశారు. సైన్యాన్ని తక్కువ చేసి మాట్లాడడం మానుకోవాలని హితవు పలికారు. టోల్‌ప్లాజాల వద్ద కేంద్రం ఆర్మీని మోహరించడంపై స్పందించిన మమత వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆర్మీ మోహరింపును సీఎం తిరుగుబాటుగా అభివర్ణించారు. అయితే తమ మోహరింపునకు సంబంధించి ప్రభుత్వానికి ముందే లేఖలు రాసినట్టు ఆర్మీ ప్రకటించడంతో మమత చిక్కుల్లో పడ్డారు. తాజాగా కొద్దిసేపటి క్రితం మమత వ్యాఖ్యలపై గవర్నర్ స్పందించారు. ఆర్మీపై ఆరోపణలు చేసేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని సూచించారు.
నోట్లు వెదజల్లి ఏంజాయ్ చేశారు..
2వేలనోట్లతో కచేరి; గుజరాత్ లో అర్భాటంగా వివాహ వేడుక
నోట్ల రద్దుతో జనం అల్లాడుతుంటే కొత్త నోట్లతో కొందరు సరదాలు చేస్తున్నారు. ప్రధానిమోడి జన్మభూమి గుజరాత్‌లో మాత్రం డబ్బులు ఎక్కువైనట్లుంది. రూ.2000 రూపాయిల కొత్త నోట్లను విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. ప్రముఖ గాయకుడు కీర్తిదాన్ గడ్విపై అభిమానులు రెండు వేల రూపాయిల వర్షం కురిపించారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఓ వివాహవేడుకలో కీర్తిదాన్ కచేరీ జరిగింది. కార్యక్రమంలో ఆయన పాటకు ఖుషీ అయిన అభిమానులు రెండు వేల రూపాయిల నోట్లను విచ్చలవిడిగా వెదజల్లారు. కొత్త నోట్ల కోసం గంటల తరబడి క్యూలో నిలబడి జనాలు నానా ఇబ్బందులు పడుతుంటే వీరికి వెదజల్లేంత డబ్బులు ఎక్కడ్నుంచి వచ్చాయని సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్ ఒక్క సామాన్యుడికే.. సంపన్నులు కాదన్న మాట మరోసారి రుజువైందని నిపుణులు మండిపడుతున్నారు.
టోల్ వలిచేయ్...
టోల్ గేట్ల వద్ద చిల్లర సమస్య; వాహనదారులకు తప్పనిపాట్లు
దేశవ్యాప్తంగా టోల్‌గేట్స్ వద్ద వాహనదారులకు ఇబ్బందులు ఎదరవుతున్నాయి. పాతనోట్లు చెల్లకపోవడం, రూ.2వేలకు చిల్లర లేకపోవడంతో టోల్‌గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడుతున్నాయి. బెంగళూరు, అహ్మదాబాద్, నాగపూర్‌తో పాటు పలు ప్రాంతాల్లో జనం ఇబ్బంది పడుతున్నారు. కొన్ని చోట్ల పాత నోట్లు తీసుకుంటున్నా, రూ.2వేలకు పాత రూ.500 నోటును చిల్లరగా టోల్‌గేట్ల యాజమాన్యం ఇస్తున్నారు. దీంతో పాతనోట్లను ఎలా మార్చాలో అర్థం కావడం లేదని వాపోతున్నారు. అటు ముంబైలో టోల్‌గేట్ల వద్ద చిల్లర సమస్య ఎక్కువైంది. అందరూ రూ.2వేల నోట్లు ఇస్తుండటంతో చిల్లర లేక తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గంటల కొద్దీ టోల్‌గేట్ల వద్ద ఆగిపోవాల్సి వస్తోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది రూ.500నోట్లను తీసుకోకపోవడంతో గొడవలు జరుగుతున్నాయి. చాలా టోల్‌గేట్లలో స్వైపింగ్ మిషన్లు అందుబాటులో లేవు. దీంతో ప్రయాణికులకు టోల్‌గేట్ నిర్వాహకులకు మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి.
ప్రాణాలు తీసిన బొగ్గుగని
చైనా బొగ్గుగనిలో భారీ పేలుడు 21మంది మృతి
చైనాలోని హీలాంగ్‌జియాంగ్ ప్రావిన్స్‌లోని ఖిటాయ్హె నగరంలోని ఓ బొగ్గు గనిలో జరిగిన పేలుడులో 21 మంది మృతి చెందినట్టు అధికారులు ప్రకటించారు. గనిలో శిథిలాల కింద 22 మంది చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు రంగంలోకి దిగిన సహాయ సిబ్బంది 21 మంది మృతి చెందినట్టు నిర్ధారించారు. ఒక్కరు మాత్రం ఇంకా శిథిలాల కింద చిక్కుకున్నారని, రక్షించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. గనిలో పేలుడు ఘటనలో పోలీసులు అరెస్టులు ప్రారంభించారు. గని యజమాని, మేనేజర్ సహా నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
Friday, December 2, 2016
ఇక కాపుల సత్తా చూపిస్తాం
నాలుగంచెల ఉద్యమం; ముద్రగడ
ఏపీలోని 13 జిల్లాల కాపు ఐకాస నేతలతో మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం సమావేశమయ్యారు. కాపు జాతికోసం నాలుగు అంచెల ఉద్యమం చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈనెల 18న నల్ల రిబ్బన్లు, కంచం, గరిటతో ఆందోళన, ఈ నెల 30న ప్రజాప్రతినిధులను కలిసి వినతిపత్రాలు ఇస్తామని తెలిపారు. జనవరి 9న కొవ్వొత్తుల ప్రదర్శన, జనవరి 25న రావులపాలెం నుంచి అంతర్వేది వరకు పాదయాత్ర నిర్వహించనున్నట్లు చెప్పారు. పాదయాత్రకు పోలీసు అనుమతి తీసుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
ఏం చెప్పావ్ స్వామీ....అలా పెట్టు మోడీకి
తప్పు సరిదిద్దకుంటే జనాగ్రహం తప్పదు; సుబ్రహ్మణ్యస్వామి
భాజపా ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ప్రధాని తీసుకున్న నోట్లరద్దు నిర్ణయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ న్యూస్ ఛానల్‌తో మాట్లాడుతూ.. దేశంలో అవినీతి, నల్లధనం నిర్మూలనే ధ్యేయంగా నవంబర్ 8న ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయంతో దేశంలో నెలకొన్న గందరగోళాన్ని సరిదిద్దకపోతే ప్రజాదరణ అంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు కూడా ఆరు నెలల పాటు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందనీ.. ఆ తర్వాత ప్రజాదరణ అంతా ఆమెకు ప్రతికూలంగా మారిందని గుర్తుచేశారు. అంతేకాకుండా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీపైనా తీవ్ర విమర్శలు చేశారు. నోట్లరద్దు నిర్ణయం అమలు ఘోరంగా ఉందన్నారు. ఆర్థికవేత్తలైన ఆర్థికశాఖ మంత్రులు దేశానికి అవసరం కానీ..2+2=4అని చెప్పే వారు అవసరంలేదన్నారు. నోట్లరద్దుతో ఎదురైన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రధానికి సూచించారు. అలాగైతే నోట్లరద్దుతో ప్రజలకు కొంతమేర ఇబ్బందులు వచ్చినా అది 2019 ఎన్నికల్లో ప్రభావం చూపదని వ్యాఖ్యానించారు.
ఇక ఎపిలో నగదుకొరత తీరినట్లేనా
రాష్ట్రానికి చేరుకున్న 2500కోట్లు
ఆంధ్రప్రదేశ్‌లో నగదు కొరత తీర్చేందుకు రిజర్వ్‌బ్యాంక్ నుండి రూ.2500కోట్లు రాష్ట్రానికి చేరుకుంది. కార్గోవిమానాల ద్వారా నగదును రాష్ట్రానికి చేరవేశారు. విశాఖ, తిరుపతి, కడప, అనంతపురం ప్రాంతాలకు విమానాల్లోనూ, మిగిలిన ప్రాంతాలకు రోడ్డుమార్గాల ద్వారా నగదు చేరవేస్తున్నారు. రిజర్వ్‌బ్యాంక్ నుంచి వచ్చిన నగదు మధ్యాహ్నానికల్లా రాష్ట్రవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు చేరుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. బ్యాంకర్లు తాత్సారం చేయకుండా ప్రజలకు నగదు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. సమయపాలన లేకుండా ప్రజల సౌకర్యార్థం పనిచేయాలని సూచించారు. రాష్ట్రంలో నగదు కొరతపై ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్ చేశారు. ఇన్ని రోజులైనా నగదు కొరత సమస్య తీరకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర అవసరాలకు సరిపడా నగదు పంపాలని కోరారు. దీనిపై స్పందించిన ఆర్‌బీఐ గవర్నర్ ఏపీకి వెంటనే రూ.2500 కోట్లు సరఫరా చేయాలని ఆదేశించారు
Subscribe to:
Posts (Atom)