Sunday, December 4, 2016

చంద్రబాబుకు ఎవరితో విభేదాలు లేవట...నమ్మాల్సిన నిజమేనా

నాకు కేసిఆర్ తో విభేదాలు లేవు ; చంద్రబాబు



తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో తనకు ఎలాంటి విభేదాలూ లేవని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టంచేశారు. శనివారం ఆయన దిల్లీలో హిందుస్థాన్‌ టైమ్స్‌ నిర్వహించిన నాయకత్వ సదస్సులో ‘ప్రపంచ నీటి సంక్షోభం- పరిణామాలు’ అనే అంశంపై కీలక ప్రసంగం చేశారు. కొత్త రాష్ట్రంలో ప్రధానంగా వ్యవసాయం, సాగునీటి రంగాలపై దృష్టిసారించినట్లు చెప్పారు. వర్షపు నీటిని నదులకు అనుసంధానం చేసే దిశగా కృషిచేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. తొలి అర్ధసంవత్సరంలో 25.6 శాతం వ్యవసాయం వృద్ధి సాధించినట్లు వివరించారు. మత్స్య పరిశ్రమ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉందన్నారు. తొమ్మిదేళ్ల పాలనలో 30 నుంచి 300 ఇంజినీరింగ్‌ కళాశాలలు ఏర్పాటుచేసినట్లు గుర్తుచేశారు. ఐటీ రంగంలో ప్రపంచవ్యాప్తంగా తెలుగు విద్యార్థులు ఉన్నారని చెప్పారు. ప్రతి పాఠశాలలో డిజిటల్‌ తరగతులు ఉండాలని అన్నారు. నూతన రాజధాని అమరావతిలో తాత్కాలిక సచివాలయం నిర్మించుకున్నామని చెప్పారు. అమరావతికి భవిష్యత్తులో కొన్ని విశ్వవిద్యాలయాలు రానున్నాయనీ, విజయవాడ-గుంటూరు నగరాల మధ్యలో అమరావతిని నిర్మిస్తున్నట్లు తెలిపారు. తమ హయాంలోనే హైదరాబాద్‌ విమానాశ్రయం, సైబర్‌ సిటీలను నిర్మించినట్లు చెప్పారు. వాటిని చూస్తే ఎప్పుడూ గర్వంగా ఉంటుందని చెప్పారు.

తెలంగాణ ప్రభుత్వంతో ఎలాంటి విభేదాలు లేవని, తెలంగాణ సీఎం తనకు సహచరుడని, బాగా తెలుసునని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసిమెలిసి పనిచేసేందుకు సిద్ధమని ప్రకటించారు. విభజన తర్వాత రాష్ట్రంలో కొన్ని సమస్యలు నెలకొన్నాయన్నారు. 2022 సంవత్సరం నాటికి దేశంలోని మూడు అగ్ర నగరాల్లో అమరావతి ఒకటిగా నిలపాలన్నదే తమ లక్ష్యమన్నారు. 2029 నాటికి దేశంలోనే అగ్ర, 2050 నాటికి ఉత్తమ మజిలీ నగరంగా అమరావతి నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.

రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పాలన కొనసాగిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను కోరుతున్నట్లు చెప్పారు. గతేడాది 10.99 శాతం వృద్ధి సాధించినట్లు చెప్పారు. రెండంకెల వృద్ధిరేటు సాధనే తమ విజయానికి నిదర్శనమన్నారు. సులభతర వాణిజ్యానికి ఏపీ అనుకూల రాష్ట్రంగా మారిందన్నారు. రూ.149లకే కేబుల్‌, అంతర్జాలం, ఫోన్‌ సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఇంటికీ అంతర్జాల సౌకర్యం ఏర్పాటుచేస్తున్నామనీ, భవిష్యత్తులో ప్రతి ఇంటికీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడవచ్చని సీఎం వివరించారు

No comments:

Post a Comment