Sunday, December 4, 2016

మహిళా పార్లమెంటేరియన్ల తొలి మహాసభలు ఏక్కడ

అమరావతిలో మహిళా పార్లమెంటేరియన్ల సభలు; ఎపి స్పీకర్ కోడెల శివప్రసాద్


నవ్యాంధ్రప్రదేశ రాజధాని అమరావతిలో జాతీయ మహిళా పార్లమెంట్‌ నిర్వహించడానికి చురుకుగా సన్నాహాలు జరుగుతున్నాయి. మహిళా పార్లమెంటేరియన్ తొలి మహాసభలు వ‌చ్చే సంవ‌త్స‌రం ఫిబ్ర‌వ‌రి 10,11,12 తేదీలలో అమరావతిలో నిర్వ‌హింప చేసే క్రమంలో స‌భాప‌తి డాక్ట‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు వేగంగా పనిచేసుకు పోతున్నారు. పుణే లోని ఎంఐటీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ కార్య‌క్ర‌మాన్ని స‌మ‌న్వ‌య‌ ప‌ర‌చనుండగా, గ‌త కొన్ని నెలలుగా ఈ అంశంపై కసరత్తు చేస్తున్న డాక్ట‌ర్ కోడెల శనివారం పూణేలో పర్యటించారు. తొలుత సదస్సుకు సంబంధించిన కార్యాచ‌ర‌ణ‌ను వేగ‌వంతం చేస్తూ రానున్న 2నెలల కార్యాచరణ ప్రణాళిక ఖరారు చేసుకునే క్రమంలో ఎంఐటీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. సంస్థ ఉపాధ్యక్షుడు రాహుల్ వి. కరాడ్ తదితరులు ఈ భేటీలో ఉన్నారు.

అనంతరం అక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో డా.కోడెల మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఈ సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరి సహకారం అవసరమన్నారు. ఎంఐటీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ కార్య‌క్ర‌మాన్ని స‌మ‌న్వ‌య‌ ప‌రుస్తుందని, ఈ విద్యా సంస్థలు సహ భాగస్వామ్యం వహిస్తున్నాయన్నారు. దాదాపు పది వేల మంది విద్యార్థులను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తున్నామని దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థినులు ఎవరైనా సదస్సుకు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. ఉన్నత ఆశయం తో ఈ సదస్సు నిర్వహిస్తుండగా జాతీయ, అంతర్ జాతీయ స్థాయి సంస్థలు భాగస్వామ్యం వహించటం విశేష మన్నారు. మూడు రోజులపాటు జరిగే ఈ సభల్లో దేశవ్యాప్తంగా 400కు పైగా మహిళా పార్ల‌మెంట్ , శాసన సభ్యులు పాల్గొంటారన్నారు. సమావేశాలకు చైర్మన్‌గా తాను, చీఫ్ ప్యాట్రన్‌గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్య‌వ‌హ‌రించ‌నుండ‌గా, అధ్యక్షురాలిగా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ట్రస్టీ సుధా నారాయణ మూర్తి ఉంటారన్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు సిద్దం చేసిన తాత్కాలిక కార్యాచ‌ర‌ణ‌ను అనుస‌రించి ‘మహిళా ప్రోత్సాహం - ప్రజాస్వామ్యం పటిష్టత’ అనే అంశంపై 3 రోజులు జరిగే మహాసభలో విభిన్న అంశాలు చ‌ర్చ‌కు వస్తాయన్నారు. తొలి రోజు‘మహిళా సాధికారిత- రాజకీయ సవాళ్లు’, వ్యక్తిత్వ నిర్మాణం - భవిష్యత్తు దార్శనికత, గురు శిష్యుల సంబంధాల పెంపు అన్న అంశాలు, రెండవ రోజు మహిళల స్థితి - నిర్ణయాత్మక శక్తి, మీకు మీరే సాటి అనే అంశాలపైన ప్రముఖుల ప్రసంగాలు ఉంటాయన్నారు. మూడవ రోజు మహిళా సాధికారిత కోసం పరుగు నిర్వహిస్తామని, ప్ర‌తి రోజూ సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించేలా ఏర్పాట్లు ఉంటాయని స‌భాప‌తి డా.కోడెల పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో మహారాష్ట్ర కౌన్సిల్ చైర్మన్ నింబాల్కర్, ప్రభుత్వ సలహాదారు రామలక్ష్మి, ఓఎస్‌డి గురుమూర్తి ఉన్నారు.

మహారాష్ట్రలో రాహుల్‌కు చెందిన గ్రూప్‌ 79 విద్యా సంస్థలను నిర్వహిస్తోంది. ఎంఐటీస్కూల్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ పేరుతో ప్రజా పాలన రంగంలో శిక్షణను ఇచ్చే విద్యా సంస్థ కూడా ఇందులో ఉంది. అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ఈ దిశగా చొరవ తీసుకుని స‌ద‌స్సు నిర్వ‌హ‌ణ చేపట్టగా, యునెస్కో సైతం ఈ సదస్సులో భాగస్వామ్యం కాబోతుంది. ఇటువంటి మహిళా పార్లమెంట్‌ నిర్వహించడం ఇదే ప్రథమం కాగా దీనికి దేశవ్యాప్తంగా ఉన్న మహిళా పార్లమెంటేరియన్లు, ప్రజాప్రతినిధులతో స‌హా వివిధ రంగాల్లోని మహిళా ప్రముఖులను స‌భాప‌తి ఇప్పటికే ఆహ్వానిస్తున్నారు. దేశవ్యాప్తంగా పది వేల మంది చురుకైన విద్యార్థినులను ఈ స‌ద‌స్సుకు ఆహ్వ‌నించి వారిని ఉత్తేజితుల‌ను చేయ‌నున్నారు. ఈ సమావేశాలను కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్, భారతీయ ఛాత్ర సంసాద్ ఫౌండేషన్, ఇంటర్ పార్లమెంటరీ యూనియన్‌ల సహకారంతో ఆంధ్రప్రదేశ్ శాసనసభ, రాష్ట్ర ప్ర‌భుత్వం సంయిక్తంగా నిర్వహించనున్నాయి.

No comments:

Post a Comment