Sunday, December 4, 2016

నోట్ల రద్దుతో మీడియా విలవిలలాడుతుందా...

నోట్ల రద్దుతో మీడియాకు కష్టాలు


పెద్ద నోట్ల రద్దు వ్యాపారులు, సామాన్యులకే కాదు మీడియా సంస్థలకు కూడా గట్టి దెబ్బకొట్టింది. పత్రికలు, టీవీ ఛానళ్లకు ఆదాయం భారీగా పడిపోయింది. పెద్ద నోట్ల రద్దుతో అన్ని వస్తువులకు డిమాండ్ పడిపోయింది. వస్తువుల అమ్మకాలు తగ్గిపోయాయి. దీంతో మీడియాలో ప్రకటనలు ఇచ్చేందుకు వ్యాపారసంస్థలు ముందుకురావడం లేదు. వ్యాపారమే లేనప్పుడు ప్రకటనలు ఇవ్వడం వల్ల ఏంటి ఉపయోగం అన్నది కంపెనీల భావన. నోట్ల రద్దు వల్ల మీడియా రంగం 2000 వేల కోట్ల మేర ప్రకటనలను కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. నగదు అందుబాటులో లేకపోవడం, వినియోగదారులు ఆచితూచి ఖర్చు చేస్తున్న నేపథ్యంలో… కార్పొరేట్‌ సంస్థలు, కంపెనీలు, వాణిజ్య సంస్థలు వ్యాపార ప్రకటనల ఖర్చును తగ్గించుకోక తప్పడం లేదు. ఇప్పటికే షెడ్యూల్ చేసిన ప్రకటనలను కూడా కంపెనీలు వెనక్కు తీసుకుంటున్నాయి.

‘‘పెద్దనోట్ల రద్దు ప్రభావం తాత్కాలికమేనని, అంతా సర్దుకుంటుందని తొలుత అనుకున్నాం. మా అంచనా తప్పుతోంది. చాలా కంపెనీలు డిసెంబరులోనూ ప్రకటనల వ్యయాన్ని కత్తిరిస్తున్నాయి. ఒక్కరోజే మా ప్రధాన క్లయింట్లు ఇద్దరు ప్రకటనల ఖర్చును తగ్గించేశారు. మొత్తంగా చూస్తే ఈ రంగానికి 1500 కోట్లకుపైనే నష్టం తప్పదనిపిస్తోంది’’ అని ఒక ప్రఖ్యాత యాడ్‌ ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్‌ వ్యాఖ్యానించినట్టు ఎకనామిక్ టైమ్స్ మ్యాగజైన్ వెల్లడించింది. ‘ఈ సంవత్సరం ఆయా కంపెనీలు, సంస్థలు ప్రకటనలపై రూ.50వేల కోట్లు వెచ్చిస్తాయని అంచనా వేశాం. చివరి 3 నెలల్లో రూ.20వేల కోట్ల ప్రకటనలు వెలువడతాయని భావించాం. నవంబరు నాటికి ఇందులో 10వేల కోట్ల వరకు యాడ్స్‌ వచ్చినా… డిసెంబరుకు సంబంధించి 15 నుంచి 20 శాతం, అంటే 1500 కోట్ల నుంచి 2వేల కోట్ల వరకు ప్రకటనలు తగ్గుతాయి’’ అని డెంట్సు ఏజిస్‌ నెట్‌వర్క్‌ – దక్షిణాసియా సీఈవో ఆశిష్‌ భాసిన్‌ వ్యాఖ్యానించారు. ఇప్పట్లో సాధారణ స్థితికి వచ్చే అవకాశాలు కనిపించడం లేదని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. కనీసం ఆరు నెలలు పట్టవచ్చని అంచనా వేస్తున్నారు.

No comments:

Post a Comment