Saturday, September 10, 2016

హైద్రాబాద్ అసెంబ్లీలో ఇవే చివరి సమావేశాలు; సియం బాబు



ఏపీ శాసనమండలిలో శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ అంశాలపై ప్రసంగించారు. హైదరాబాద్‌లో ఇవే చివరి సమావేశాలు అనుకుంటున్నా.. అత్యవసరమైతే తప్ప లేకపోతే అమరావతిలోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ అసెంబ్లీతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 1980లో తొలిసారిగా శాసనమండలికి వచ్చానని, నాటి అనుభవాలను నెమరేసుకున్నారు. 38 ఏళ్లలో చాలా సమస్యలు పరిష్కరించగలిగామన్నారు. 

పవన్ విమర్శలకు భయపడును; వెంకయ్యనాయుడు

జనసేన నేత పవన్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్పందించారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ హోదా పేరుతో కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు. సామాన్య ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరముందన్నారు. ఇంతవరకు ఏ రాష్ట్రానికి చేయనటువంటి సాయం ఆంధ్రప్రదేశ్‌కు చేశామని వివరించారు. కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధిని ఎవరూ శంకించాల్సిన అవసరం లేదన్నారు. పవన్ విమర్శలకు భయపడి వెనక్కిపోనని స్పష్టం చేశారు. ఏపీ నుంచి ప్రాతినిథ్యం వహించకపోయినా ... రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేశానని చెప్పారు. భాజపా అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి మంత్రివర్గ సమావేశంలోనే తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ తీర్మానం చేశామని గుర్తు చేశారు. రెవెన్యూ లోటును కేంద్రమే భర్తీ చేస్తుంది, పోలవరం ప్రాజెక్టుకు పూర్తి నిధులు కేంద్రమే మంజూరు చేస్తుందని తెలిపారు. కేంద్ర విద్యాసంస్థలు పదేళ్లలో ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో పేర్కొన్నారు. కానీ రెండేళ్లలోనే విద్యాసంస్థలు ఏర్పాటు చేశాం. ‘నాకు ఎవరి కితాబులు అవసరం లేదన్నారు.

Friday, September 9, 2016

అయోధ్యలో అడుగుపెట్టిన రాహుల్ గాంధీ


యూపీలో ‘కిసాన్‌ యాత్ర‘లో ఉన్న కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఇవాళ అయోధ్య చేరుకున్నారు. దాదాపు 20 నిమిషాల పాటు అక్కడే ఉన్న రాహుల్‌.. ప్రముఖ హనుమాన్‌ గర్హి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అయితే వివాదాస్పద రామజన్మభూమి- బాబ్రీ మసీదు వద్ద గల రామ మందిరాన్ని రాహుల్‌ సందర్శించలేదు. హనుమాన్‌ ఆలయంలో పూజల అనంతరం రాహుల్‌ ఫైజాబాద్‌ బయల్దేరి వెళ్లారు. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం గాంధీ కుటుంబానికి చెందిన ఏ ఒక్కరూ అయోధ్యలో పర్యటించలేదు. 26ఏళ్ల క్రితం రాహుల్‌ తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హనుమాన్‌ గర్హి ఆలయాన్ని దర్శించుకోవాలనుకున్నా.. కొన్ని కారణాల వల్ల అది సాధ్యపడలేదు. ఆ తర్వాత ఆ కుటుంబానికి చెందిన సానియా, రాహుల్‌లు ఎన్నోసార్లు యూపీలో పర్యటించినప్పటికీ అయోధ్య మాత్రం వెళ్లలేదు. కాగా.. మరికొద్ది రోజుల్లో ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాహుల్‌ అయోధ్య వెళ్లడంపై వివిధ పార్టీల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. రాజకీయ కారణాల వల్లే రాహుల్‌ పర్యటించారని భాజపా, సహా పలు పార్టీలు ఆరోపిస్తున్నాయి.

గోరటి వెంకన్నకు కాళోజీ పురస్కారం



హైదరాబాద్‌ రవీంధ్రభారతిలో ప్రజాకవి కాళొజీ జయంతి వేడుకల  సందర్భంగా ప్రజాకవి గోరటి వెంకన్నకు కాళొజీ పురస్కారం ప్రదానం చేశారు. తెలంగాణా సభాపతి మధుసూదనాచారి, మంత్రులు కడియం శ్రీహరి, ఈటల రాజేందర్‌, నాయిని నర్సింహారెడ్డి సాంస్కృతిక మండలి ఛైర్మన్‌ రసమయి బాలకృష్ణ, నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్‌, నారదాసు లక్ష్మణ్‌రావు, సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొని కాళొజీ సేవలను కొనియాడారు. సభాపతి మధుసూదనాచారి మాట్లాడుతూ... తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక కాళొజీ అని వివరించారు. కాళొజీ పేరటి ఏర్పాటు చేసిన అవార్డును గోరటి వెంకన్నకు ప్రదానం చేయడం అభినందనీయమన్నారు.

పాస్ పోర్టు రద్దు చేశారు, భారత్ ఎలా రమ్మంటారు; విజయ్ మాల్యా


భారత్ రావడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ ఢిల్లీలోని పాటియాల కోర్టులో కింగ్‌ఫిషర్‌ మాజీ అధినేత విజయ్‌ మాల్యా పిటిషన్ వేశారు. అయితే పాస్‌ పోర్టు రద్దవడంతో భారత రాలేకపోతున్నానని చెప్పారు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని న్యాయస్థానాన్ని కోరారు. విజయ్‌ మాల్యాకు గత వారం ముంబైలో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ నాన్ బెయిలబుల్‌ వారంట్‌ జారీ చేశారు. బ్యాంకులకు రూ. 9 వేల కోట్లు ఎగ్గొట్టిన మాల్యా మార్చి 2వ తేదీన భారత నుంచి పారిపోయి లండన్‌లో తలదాచుకుంటున్నారు. ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) ఎన్ని నోటీసులు ఇచ్చినా ఆయన స్పందించడంలేదు.

కేంద్రంపై డైరెక్ట్ యటాక్ 


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడలో ‘సీమాంధ్ర ఆత్మగౌరవ సభ’ నిర్వహించనున్నారు. సాయంత్రం 4గంటల నుంచి 5గంటల వరకు పవన్ ప్రసంగించనున్నారు. సభ ముగియగానే పవన్ ఆమరణ దీక్షకు దిగనున్నట్లు సమాచారం అందుతుంది. కేంద్రం ఇచ్చిన హామీలు రెండున్నర సంవత్సరం గడిచినా అమలు చేయకపోవడంపై పవన్ దీక్ష చేయబోతున్నట్లుగా విశ్వసనీయవర్గాల ద్వారా సమాచారం. కేంద్రం వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లి ఆ తర్వాత ఏపీ ఎంపీల మీద ఒత్తిడి తెచ్చాలా మూడు దశల్లో కార్యాచరణను పవన్ ఇది వరకే తిరుపతి బహిరంగ సభలో ప్రకటించారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీని కేంద్రం ప్రకటించేసింది.. సీఎం చంద్రబాబు స్వాగతించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇక తిరుపతి సభలో చెప్పినట్లుగా మూడు దశల్లో పోరాటం అక్కర్లేదు.. డైరెక్టుగా కేంద్రంతో పోరాటానికి దిగాలని పవన్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అయితే ఇదే కాకినాడ సభ ముగిసిన తరువాత సభా వేదిక పైనే దీక్ష‌ ప్రారంభించాలని పవన్ కృత నిశ్చయంతో ఉన్నట్లుగా సమాచారం. 

హోదాకోసం నేడే జనసేన బహిరంగ సభ; కాకినాడ లో ఏర్పాట్లు పూర్తి 


ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ కాకినాడలో శుక్రవారం నిర్వహించనున్న బహిరంగ సభపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా బదులుగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం బుధవారం చేసిన ప్రకటనకు నిరసనగా శనివారం రాష్ట్ర బంద్‌కు విపక్షాలు పిలుపునిచ్చాయి. ప్యాకేజీపై రాష్ట్ర ప్రభుత్వ స్పందన, విపక్షాల ఆందోళనల నడుమ ఇదే అంశంపై పవన్‌కల్యాణ్‌ నిర్వహించే సభ కీలకంగా మారింది. ఈ సభకు చిరంజీవి, పవన్‌ అభిమానులే కాకుండా, సామాజికవర్గ పరంగా పార్టీలకతీతంగా నాయకులు, కార్యకర్తలు తరలివెళుతున్నారు. అయితే వీరిలో ఎక్కువ మంది యువకులే కావడం గమనార్హం. పవన్‌కల్యాణ్‌ స్థాపించిన జనసేన పార్టీ మరో ప్రజారాజ్యం పార్టీ కాకూడదని యువత కోరుకుంటున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులకు నాందిపలుకుతుందనుకున్న ప్రజారాజ్యం పార్టీ, ఎన్నికల్లో తుస్సుమనడంతో చిరంజీవి అభిమానులు తీవ్ర నిరాశ చెందారు.  ఈ నేపథ్యంలో శుక్రవారం కాకినాడలో శుక్రవారం బహిరంగ సభలో పవన కల్యాణ్‌ ఏం మాట్లాడతారా అని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

పాకిస్ధాన్ ఉద్రవాద తయారీ ఫ్యాక్టరీ; ప్రధాని మోడీ

ఉగ్రవాదాన్ని ప్రేరేపించే ఆ మాపొరుగుదేశంపై నిషేధం విధించాలి. అంతర్జాతీయ సమాజంలో దానిని ఒంటరిని చేయాలి’’ అంటూ పాకిస్థాన్‌పై ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. లావోస్‌ రాజధాని వియంటియాన్‌లో గురువారం జరిగిన ఆసియాన్‌, తూర్పు ఆసియా సదస్సుల్లో ఆయన మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా, చైనా ప్రధాని లీ కెకియాంగ్‌ సమక్షంలో పాక్‌ పేరు చెప్పకపోయినా నేరుగానే ఆయన విమర్శలు చేశారు. ప్రపంచానికంతటికీ ఉగ్రవాదాన్ని ఎగుమతి చేసే ఈ దేశాన్ని నిలువరించే సమయం మనకు ఇప్పుడు వచ్చిందన్నారు. ఉగ్రవాదం ఎగుమతి రోజురోజుకూ పెరుగుతోందని, ఇది మనందరికీ ఉమ్మడి ముప్పుగా మారిందని హెచ్చరించారు. ఒకే ఒక్క దేశం ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేస్తోందని జీ20 సదస్సులో విమర్శలు గుప్పించిన మోదీ.. మూడు రోజుల్లోనే ఏసియాన్‌ సదస్సులోనూ పాక్‌ లక్ష్యంగా పదునైన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరత, సంపద సృష్టి అనే ఉమ్మడి లక్ష్యాలతో మనం కలిశామని, కానీ, శాంతికి ఇప్పుడు ప్రమాదం వాటిల్లిందని వివరించారు. కాగా, వివాదాస్పద దక్షిణ చైనా సముద్రం గురించి ప్రస్తావిస్తూ.. బల ప్రయో గం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రయత్నిస్తే శాంతి సుస్థిరతలు ప్రమాదంలో పడతాయని పరోక్షంగా చైనాను తప్పుబట్టారు. కాగా, దక్షిణ చైనా సముద్రంపై తమకే హక్కులు ఉన్నాయంటున్న చైనా వాదనకు చట్టపరంగా ఆధారాల్లేవని అంతర్జాతీయ ట్రైబ్యునల్‌ తీర్పునకు కట్టుబడి ఉండాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు ఒబామా స్పష్టం చేశారు.

స్విస్ ఛాలెంజ్ పై రాష్ట్రాన్ని ప్రశ్నించిన హైకోర్టు

ఏపి రాజధాని అమరావతి నిర్మాణం కోసం స్విస్‌ ఛాలెంజ్‌ పద్ధతిలో టెండర్లను ఆహ్వానించేప్పుడు ఆదాయ వివరాలను ఎందుకు రహస్యంగా ఉంచాల్సి వస్తోందని హైకోర్టు మరోసారి ప్రశ్నించింది. సిఆర్‌డిఎ(క్రిడా) సవరించిన టెండర్‌ నోటిఫికేషన్‌ను చెన్నైకు చెందిన ఎన్వీఎన్‌ ఇంజినీర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ డైరెక్టర్‌ కార్తీయనాథన్‌, హైదరాబాద్‌కు చెందిన ఆదిత్య కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ డైరెక్టర్‌ బి మల్లికార్జునరావు వేర్వేరుగా దాఖలు చేసిన రిట్‌ పిటిషన్లపై గురువారం ప్రభుత్వ వాదనలు ముగిశాయి. ఈ సందర్భంగా న్యాయమూర్తి సర్కారుకు పలు ప్రశ్నలు సంధించారు. సింగపూర్‌ కన్సార్టియం విషయంలో జీవోను పరిశీలిస్తే ముందే ప్రభుత్వం జోక్యం చేసుకున్నట్టు స్పష్టం అవుతోందని న్యాయమూర్తి పేర్కొన్నారు. సాక్షాత్తూ ప్రభుత్వమే జోక్యం చేసుకుంటే కిందిస్థాయి సంస్థలు లేదా అధికారులు వ్యతిరేకంగా ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఏపిీ తరఫున అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహత్గీ దానికి జవాబు చెప్పకుండా మరో అంశంపై వాదించారు. స్విస్‌ఛాలెంజ్‌ విధానంలో ఆదాయ వివరాలన్నీ ప్రాథమిక దశలోనే వెల్లడించాలని చట్టం చెబుతోందని న్యాయమూర్తి అనగానే, అటార్నీ జనరల్‌ స్పందిస్తూ సింగపూర్‌ కన్సార్టియం ప్రతిపాదనలను తొలి దశలోనే బట్టబయలు చేస్తే పెద్ద పెద్ద కంపెనీలు ముందుకు రాకపోవచ్చునన్నారు. సింగపూర్‌ కంపెనీ కూడా వెనక్కి వెళ్లిపోయే ప్రమాదం ఉందని బదులిచ్చారు. ఆదాయ వివరాలు లేకుండా ఏ కంపెనీ ముందుకు వస్తుందని హైకోర్టు పేర్కొనగా, ఎల్‌అండ్‌టి వంటి పేరున్న కంపెనీయే ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని అటార్నీ జనరల్‌ జవాబిచ్చారు. ఆదిత్య కంపెనీకి అర్హతే లేదని, మరో కంపెనీ ఎన్వీఎన్‌ ప్రీ బిడ్డింగ్‌ మీటింగ్‌లో కూడా పాల్గొనలేదని చెప్పారు. ప్రపంచానికే తలమానికంగా భావిస్తున్న రాజధాని విషయంలో పాలకులు ఆదాయ వివరాలు వెల్లడించకుండా టెండర్లను ఆహ్వానించడంలో ఆంతర్యం ఏమిటి? సింగపూర్‌ కన్సార్టియం ప్రతిపాదనలన్నీ సీల్డ్‌ కవర్‌లో గోప్యంగా ఉన్నాయని చెబుతున్న వారు ఏపికి మేలు జరుగుతుందని ముందే నిర్ణయానికి ఎలా వచ్చారు? ప్రధాన ప్రతిపాదికుడైన సింగపూర్‌ కన్సార్టియం ఇచ్చిన నివేదికపై ఏపీ సర్కార్‌ ఎందుకు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది? ఆదాయ వివరాలు తెలిస్తేనే కదా అంతకంటే పెద్ద కంపెనీలు ముందుకొచ్చేది అని హైకోర్టు నిలదీసింది. స్టే వంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తే, ఇంతవరకు జరిగిన పనులపై తీవ్ర ప్రభావం పడుతుందని ప్రాజెక్టు ఆగితే అభివృద్ధి పూర్తిగా కుంటుపడుతుందనిఅటార్నీ జనరల్‌ వాదించారు. చిన్నపాటి కంపెనీల కేసుల్ని కొట్టేయాలని కోరారు. రాజధాని నిర్మాణం ద్వారా విదేశీ పెట్టుబడుల్ని రాబట్టాలన్న మహత్తర సంకల్పం ఉన్నందునే ఆదాయ వివరాల్ని గోప్యంగా ఉంచుతున్నామన్నారు. ఇవేవీ తప్పుకానే కాదని చట్టం కూడా స్పష్టం చేస్తోందన్నారు. టెండర్‌లో బిడ్స్‌ దాఖలు చేసి అర్హత పొందితే ఆ తర్వాత కంపెనీలకు ఆదాయ వివరాలు ఇస్తామని అటార్నీ జనరల్‌ వివరించారు. ఈనెల 12న తీర్పును వెలువరిస్తామని న్యాయమూర్తి ప్రకటించారు. సవరించిన టెండర్ల నోటిఫికేషన్‌ ప్రకారం బిడ్స్‌ దాఖలుకు ఆఖరి తేదీ ఈ నెల 13వ తేదీకి ఒక రోజు ముందుగా న్యాయమూర్తి తీర్పు వెలువరించనున్నారు.

Sunday, September 4, 2016

వెంకన్న సన్నిధిలో సింధూ

కలియుగస్వామి మొక్కు చెల్లించుకున్న సింధూ

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ఒలింపిక్ రజత పతక విజేత పీవీ సింధూ దర్శించుకున్నారు. కోచ్ గోపిచంద్‌, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి శనివారం రాత్రి ఆమె తిరుమల చేరుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో సింధు, ఆమె కుటుంబసభ్యులు సహా కోచ్ గోపీచంద్ స్వామి రిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి ఆహ్వానం పలికి ఏడుకొండల వాడి దర్శన ఏర్పాట్లు పూర్తి చేశారు. దర్శనం అనంతంరం సింధు స్వామి వారికి తులాభారంగా 68 కేజీల బెల్లాన్ని సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. అనంతరం సింధు, గోపిచంద్ కుటుంబ సభ్యులకు టీటీడీ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.

చిరంజీవిని జాతి క్షమించదట...కాపు కార్పోరేషన్ ఛైర్మన్


చిరుపై కస్సుమంటున్న కాపు  కార్పోరేషన్ ఛైర్మన్

ముఖ్యమంత్రి చంద్రబాబు కాపుల అభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని.. వాటికి అడ్డంకులు సృష్టిస్తే కాపు జాతి క్షమించదంటూ కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు చిరంజీవికి కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ చలమలశెట్టి రామానుజయ లేఖ రాశారు. నగరంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఈ లేఖను విడుదల చేశారు. ‘మిమ్మల్ని అభిమానించే వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని, అయితే ఇటీవలకాలంలో మీ వ్యవహారశైలి కాపు సామాజికవర్గంలోని ప్రతి ఒక్కరికీ బాధ కలిగిస్తోంది’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. వైసీపీ అధినేత జగన్‌ పన్నిన కుట్రలో భాగంగా రాజకీయ పునరావాసం లేని కొంతమంది నాయకులు సీఎంపై విమర్శలు చేస్తున్నారని, అటువంటి వారితో మీరు కూడా కలవడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. రామానుజ లేఖ సంగతి పక్కనపెడితే, కాపు కార్పోరేషన్ ఛైర్మన్ గా ఉండి కనీసం కాపులను గుప్పిట్లో పెట్టుకోలేక పోతున్నాడని తెలుగుదేశం నేతలు రామానుజయకు రోజు తలంటుతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. పట్టుమని పదిమందికాపులను కూడా వెనుకేసుకుని తిరగలేని వ్యక్తికి కాపు ఛైర్మన్ ఎలా ఇచ్చారంటూ...అధినాయకత్వం తీరును బాహాటంగానే తప్పుపడుతున్నారట. నిన్నటికి నిన్న సదావర్తి సత్రం భూముల వ్యవహారంలో కీలకంగా ఉండి అభాసుపాలై పార్టీకి బ్యాడ్ నేమ్ తెచ్చిన రామానుజయను సాగనంపి మరో కొత్త కాపుకు ఛైర్మన్ పదవి కట్టబెట్టాలని కాపుసామాజిక వర్గం అభిప్రాయపడుతుందట...

ఎపిలో పోలీసుశాఖలో ఉద్యోగాల మేళా

పోలీసు శాఖలో భర్తీలు షురూ


ఆంధ్రప్రదేశ్ స్టేట్‌ లెవెల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ (ఎపిఎస్‌ఎల్‌పిఆర్‌బి)- పోలీస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్‌లో కింది విభాగాల్లో స్టయిపెండరీ క్యాడెట్‌ ట్రైనీ (కానిస్టేబుల్‌) పోస్టుల భర్తీకోసం దరఖాస్తులు కోరుతోంది. 
విభాగం: మెకానిక్స్‌ ఖాళీలు: 25 అర్హత: పదోతరగతి లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. ఐటిఐ(వైర్‌మెన్/ మెకానిక్‌ మోటార్‌ వెహికిల్‌/ డీజిల్‌ మెకానిక్‌/ ఫిట్టర్‌) ఉత్తీర్ణులై ఉండాలి. 
విభాగం: డ్రైవర్‌ ఖాళీలు: 134
అర్హత: ఇంటర్‌ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. లేదా పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు ఐటిఐ (వైర్‌మెన్/ మెకానిక్‌ మోటార్‌ వెహికిల్‌/ డీజిల్‌ మెకానిక్‌/ ఫిట్టర్‌) ఉత్తీర్ణులై ఉండాలి. లైట్‌ మోటార్‌ వెహికిల్‌ డ్రైవింగ్‌ లైసెన్సతోపాటు డ్రైవింగ్‌లో రెండేళ్ల అనుభవం ఉండాలి. 
వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. 
ఎంపిక: ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్‌, ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌, రాత పరీక్ష ద్వారా 
రాత పరీక్ష: నవంబరు మూడోవారంలో 
ఆనలైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: సెప్టెంబరు 13 నుంచి 
ఆనలైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: అక్టోబరు 13 
వెబ్‌సైట్‌: recruitment.appolice.gov.in

Saturday, September 3, 2016

కాణిపాక బ్రహ్మోత్సవం

గణనాధుని బ్రహ్మోత్సవాలు; ఈనెల 5 నుండే


చిత్తూరు జిల్లా కాణిపాక వరసిద్ది వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 5 నుంచి 21 రోజుల పాటూ వైభవంగా జరుగనున్నాయి. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. భక్తులకు అసౌకర్యం కలగకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. బ్రహ్మోత్సవాల వివరాలు...5న వినాయక చవితి, 6న హంసవాహనం,7న నెమలి వాహనం, 8న మూషిక వాహనం, 9న శేష వాహనం, 10న వృషభ వాహనం, 11న గజవాహనం, 12న రథోత్సవం, 13న అశ్వవాహనం,14న ధ్వజ అవరోహణం,15న అధికార నంది వాహనం,16న రావణబ్రహ్మ వాహనం,17న యాళి వాహనం, 18న సూర్య ప్రభ వాహనము, 19న చంద్రప్రభ వాహనము, 20న కామధేను వాహనం, 21న పూలంగి సేవ, 22న కల్పవృక్ష వాహనం, 23న విమానోత్సవం,24న పుష్పపల్లకి సేవ, 25న తెప్పోత్సవాలు నిర్వహిస్తున్నారు.

అడ్డదారుల్లో అంబానీ...నిబంధనలకు టిటిడి తిలోదకాలు...

అంబానీకి టిటిడి రెడ్ కార్పెట్


రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ శుక్రవారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. కుమారుడు అనంత్‌ అంబానీతో కలసి ఆయన వేకువజాము సుప్రభాతం, అభిషేకల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం హుండీలో కానుకలు సమర్పించారు. ఇదే సందర్భంగా వేద పండితులు ఆశీర్వచనం అందించగా, అధికారులు లడ్డూ ప్రసాదాలు అందజేశారు. అంతకుముందు తిరుపతి అలిపిరి వద్ద మూసివేసిన టోల్‌గేట్‌ను నిబంధనలకు విరుద్ధంగా వేవకుజాము 1 గంటకు తెరిచి అంబానీ కుటుంబం, సన్నిహితులతో కూడిన వాహనాలు తిరుమలకు అనుమతించటం విమర్శలకు తావిచ్చింది. దీనిపై మాట్లాడేందుకు టీటీడీ అధికారులు నిరాకరించారు.

లెక్క చెప్తే సరి లేకుంటే లెక్క తేల్చేస్తాం

నివేదికలు ఇవ్వకుండా నిధులా; పురందేశ్వరి


ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాకు 14వ ఆర్థిక సంఘం అభ్యంతరం చెబుతోందని బీజేపీ మహిళా నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి చెప్పారు. విజయవాడలో శనివారం బీజేపీ పదాధికారుల సమావేశనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.... ఏపీకి కేంద్ర ప్రభుత్వం సహాయం చేయడం లేదని టీడీపీ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఇప్పటి వరకు కేంద్రం రూ.4వేల కోట్లు రెవెన్యూ లోటు భర్తీ చేసిందని పురందేశ్వరి చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పనులు త్వరితగతిన జరగడం లేదని...పోలవరం అథారిటీని పరిగణనలోకి తీసుకోకుండా అంచనాలు పెంచేశారని ఆమె ఆరోపించారు. పోలవరంలో పట్టిసీమ అంతర్భాగం కాదన్నారు. ఏపీ రాజధాని అమరావతికి సంబంధించి ప్రభుత్వం సరైన డీపీఆర్ ఇవ్వలేదని పేర్కొన్నారు. అయినా రాజధానికి కేంద్ర ప్రభుత్వం రూ.1050 కోట్లు ఇచ్చిందని గుర్తుకు చేశారు. రాజధానికి, పోలవరానికి సంబంధించి ఏ నివేదికలు ఇవ్వకుండా కేంద్రం నిధులు కేటాయించలేదంటే ఎలా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని పురందేశ్వరి ప్రశ్నించారు.