Sunday, May 29, 2016

రజనీ టీజర్ కు అంత అధరణా

కబాడీ అడిస్తున్న కబాలీ టీజర్

దక్షిణాది సూపర్‌స్టార్ రజనీకాంత్ కథనాయకుడిగా నటించిన 'కబాలి' చిత్రం విడుదలకు ముందే సంచలన రికార్డులు నమోదు చేస్తోంది. తాజాగా టీజర్ వ్యూస్ పరంగా సరికొత్త రికార్డును ఈ చిత్రం సొంతం చేసుకుంది. గత ఏప్రిల్ 30న విడుదల చేసిన ఈ చిత్రం టీజర్ తాజాగా 2 కోట్ల వ్యూస్‌కు చేరుకుంది. తక్కువ రోజుల్లో ఎక్కువ వ్యూస్‌ను దక్కించుకున్న తొలి ఇండియన్ ఫిల్మ్‌ గౌరవాన్ని సొంతం చేసుకుందని చిత్ర నిర్మాతలు ఆనందం వ్యక్తం చేశారు. 67 సెకన్ల ఈ టీజర్ 28 రోజుల్లో ఈ రికార్డు దక్కించుకుంది. రంజిత్ దర్శకత్వంలో కలైపులి ఎస్ ధను ఈ చిత్రాన్ని నిర్మించారు. డాన్‌గా సరికొత్త అవతారంలో కనిపించనున్న రజనీ సరసన రాథికా ఆప్టే నటించారు. జూలై 1న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది.

ఎపి లెజెండ్

అమరావతిలో అన్నఎన్టీఆర్ భారీ విగ్రహం


తెలుగుదేశం పార్టీ వ్యవస్ధాపకుడు, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావుకు ఎపి రాజధాని అమరావతిలో అరుదైన గౌరవం దక్కబోతుంది.  తారక రామునికి ఘన నివాళిగా రాజధానిలో ఎన్టీఆర్ 115 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. తిరుపతిలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ 35వ మహానాడు వేదికగా ఈవిషయాన్ని బహిర్గత పరిచారు. దీనిని పార్టీ శ్రేణులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు.  ఎన్టీఆర్‌ జయంతిని పురస్కరించుకొని  మహానాడులో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుసహా పలువురు నేతలు ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ అమరావతిలో 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహాన్ని పెడుతున్నారు,. తెలుగుజాతికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన చిరస్మరణీయుడు ఎన్టీఆర్‌ విగ్రహం కూడా నెలకొల్పితే బాగుంటుంది’ అని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు సభ కరతాళధ్వనులతో ఆమోదం తెలిపింది. ఆ ప్రతిపాదనపై సియం చంద్రబాబు స్పందిస్తూ 35వ మహానాడుకు గుర్తుగా అమరావతిలో 35 మీటర్ల ఎత్తైయిన ఎన్టీఆర్‌ విగ్రహాన్ని నెలకొల్పాలని ప్రతిపాదించారు. చంద్రబాబు ప్రతిపాదనపై సభాప్రాంగణం కరతాళ ధ్వనులతో హర్హం వ్యక్తం చేసి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అమరావతిలో నిర్మించబోయే ఎన్టీఆర్ విగ్రహం తెలుగువారికి ‘ఆత్మగౌరవ స్ఫూర్తి’ నిస్తుందన్నారు.  ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని ఎంపీ మురళీమోహన ప్రతిపాదించారు. 

కృష్ణానది మధ్యలో విగ్రహం

ఎన్టీ ఆర్ విగ్రహాన్ని కృష్ణానది మద్య భాగంలో ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉంది. హైద్రాబాద్ ఉస్సేన్ సాగర్ లో బుధ్దుని విగ్రహం తరహాలో నీటి మధ్యలో ఏర్పాటు చేసి పర్యాటకులను అకట్టుకునే విధంగా నదిప్రాంతాన్ని టూరిజం స్పాట్ గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. 
 

Saturday, May 28, 2016

అమరేశ్వరునికే నామాలు....అధికారపార్టీ లీలలు

శివ..శివా...హరహర మహాదేవ శంభోశంఖర



కంచె చేను మేసింది...ప్రభుత్వ ఆస్ధులను కాపాడాల్సిన వారే వాటిని నిలువునా మింగేస్తూ లూఠీలకు తెరతీస్తున్నారు. చివరకు దేవుడిని కూడా వదిలపెట్టటంలేదు. విలువైన ఆలయ ఆస్ధులను కారుచౌకకు అప్పనంగా అమ్మేసుకుంటూ జేబులు నింపుకుంటున్నారు. అమరావతి అమరలింగేశ్వర స్వామి దేవస్ధానం సదావర్తి సత్రం భూముల అమ్మకం వ్యవహారంలో అధికార పార్టీ నేతలు భారీ కుంభకోణానికి తెరలేపారు. ఏకంగా వెయ్యి కోట్ల విలువైన భూములను 22కోట్లకే అమ్మించి పరమ శివునికే బూడిద పూశారు. ప్రస్తుతం ఈవ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తుంది.

చెన్నైలో ఖరీదైన భూమి


శ్రీసదావర్తి సత్రం భూములున్న ప్రాంతం చెన్నైలోని అత్యంత ఖరీదైన ఓల్డ్ మహాబలిపురం రోడ్డులో ఉంది. తాలంబూరు గ్రామ పరిధిలో రోడ్డు పక్కనే ఈ భూములున్నాయి. వీటి సమీపంలో సత్యభామ యూనివర్సిటీ, హిందూస్థాన్ యూనివర్సిటీ, టీసీఎస్ సహా పలు ఐటీ సంస్థలు, స్టార్ హోటళ్లు, భారీ అపార్టుమెంట్లు, రిసార్టులు, గేటెడ్ కమ్యూనిటీలు ఉన్నాయి. ఇక్కడి నుంచి సముద్ర తీరం కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. స్వాతంత్య్రానికి పూర్వమే బ్రాహ్మణులకు, వేదశాస్త్రాలను అభ్యసించే పేద విద్యార్థులకు అన్నదానం నిర్వహించాలన్న లక్ష్యంతో అమరావతి జమీందారులైన రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు వంశీకులు అప్పట్లో ఈ సత్రాన్ని నిర్మించారు. గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం కోగంటివారిపాలెంలో తమ పేరిట ఉన్న 72 ఎకరాలను, తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలో మరో 471.76 ఎకరాలను సత్రం నిర్వహణ కోసం ఇనామ్ రూపంలో దారాదత్తం చేశారు. తమిళనాడులోని కాంచీపురం జిల్లా చెంగల్పట్టు తాలూకాలో నావలూరు, తాలంబూరు, పడూరు గ్రామాల పరిధిలో ఈ భూములున్నాయి. ఈ భూముల విక్రయానికి అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం 2015 ఏప్రిల్ 6న ఉత్తర్వులు (మెమో నం. 28228) జారీ చేసింది. అందులో 83.11 ఎకరాల భూమి అమ్మకానికి ఈ ఏడాది మార్చి 28న దేవాదాయ శాఖ అధికారులు వేలం పాట నిర్వహించారు. భూమి అమ్మకం జరిపేందుకు దేవాదాయ శాఖ కమిషనర్ ఐదుగురు అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. కమిషనర్ కార్యాలయంలో ఎస్టేట్ సంయుక్త కమిషనర్ కృష్ణాజీరావు, ఎస్టేట్ అసిస్టెంట్ కమిషనర్ విజయరాజు, రీజినల్ జాయింట్ కమిషనర్ భ్రమరాంబ, గుంటూరు డిప్యూటీ కమిషనర్ సురేష్‌బాబు, అమరావతిలోని సత్రం ఈవో శ్రీనివాసరెడ్డిలను కమిటీలో సభ్యులుగా నియమించారు.

ఎమ్మెల్యే లేఖతో ఆగమేఘాలమీద కదిలిన సర్కారు
తన నియోజకవర్గంలోని శ్రీసదావర్తి సత్రానికి (అమరావతి ఆలయ పరిధిలోనిది) చెన్నై సమీపంలో భూములు ఉన్నాయని, అవి ఆక్రమణకు గురవుతున్నాయని, వాటి విక్రయానికి అనుమతించాలని కోరుతూ పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ 2014 ఆగస్టు 18న ముఖ్యమంత్రి కార్యాలయానికి లేఖ రాశారు. భూముల యవ్వారం, పైగా కాసులు తెచ్చిపెట్టేదికదా సీఎం కార్యాలయం వెంటనే స్పందించింది. 2014 సెప్టెంబర్ 12న ఆ లేఖను దేవాదాయ శాఖకు పంపింది. అన్ని ప్రక్రియలు పూర్తయి 2015 ఏప్రిల్‌లో భూముల అమ్మకానికి దేవాదాయ శాఖ అనుమతించింది. 471.76 ఎకరాల్లో ఆక్రమణలు పోను మిగిలి ఉన్న 83.11 ఎకరాలను విక్రయించేందుకు ఈ ఏడాది మార్చి 28న వేలం పాట నిర్వహించారు. వేలంలో కృష్ణా జిల్లా కైకలూరు ప్రాంతానికి చెందిన తెలుగుదేశం పార్టీ కి చెందిన కీలకనేత , చంద్రబాబు సన్నిహితుడైన సదరు వ్యక్తి దక్కించుకున్నారు. ఎకరా 13 కోట్లు పలికే భూమిని అతి తక్కువగా 50 లక్షల రూపాయలకే కట్టబెట్టేశారు. ఇదంతా పక్క పధకం ప్రకారం జరిపించేశారు. ముఖ్యనేతల కనుసన్నల్లో గుట్టుచప్పుడు కాకుండా తంతును ముగించేశారు. తమిళనాడులో భూముల విలువులు గుంటూరు ప్రజలకు, భక్తులకు ఏం తెలుస్తాయిలే అన్న , ఆలోచనతోనే ఆలయ భూములను అప్పనంగా కొట్టేసినట్లు స్పష్టమౌతుంది.


నింబంధనలు తుంగలో తొక్కి

దేవాదాయ శాఖలో ఆస్ధుల విషయంలో గతకొంతకాలంగా ‘ఈ-టెండర్’ విధానం అమలు జరుగుతుంది. అయితే 83.11 ఎకరాల సత్రం భూముల అమ్మకానికి దేవాదాయ శాఖ అధికారులు ఈ విధానాన్ని మాత్రం అమలు చేయలేదు. విలువైన భూములను అధికార పార్టీ ముఖ్యులకు నామమాత్రపు ధరకు కట్టబెట్టే ఉద్దేశంతోనే దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఇందుకు అడ్డు చెప్పలేదన్న వాదన వినిపిస్తోంది. ఎకరం ధర రూ.6 కోట్లకుపైగానే పలుకుతుండగా, వేలంలో ఎకరం రూ.27 లక్షల చొప్పున అమ్మడమేమిటని దేవాదాయ శాఖ జాయింట్ కలెక్టర్ డి.భ్రమరాంబ అభ్యంతరం తెలిపుతూ ఆ మేరకు దేవాదాయ శాఖ కమిషనర్‌కు ఏప్రిల్ 18న సవివరమైన లేఖ రాశారు. అయితే, ఆ అధికారిణి వాదనను ఏమాత్రం పట్టించుకోకుండా ఏప్రిల్ 24 సేల్ ప్రొసీడింగ్స్ జారీ చేశారు. చెన్నై సమీపంలోని తాలంబూరులో భూముల ధరలు అధికంగా ఉండడంతో తమిళనాడు రిజిస్ట్రేషన్ శాఖ భూ లావాదేవీలలో ఎకరాకు బదులు గజా ల లెక్కన రిజిస్ట్రేషన్ చార్జీలు వసూలు చేస్తోంది. ప్రభుత్వ ధరల ప్రకారమే అక్కడ ఎకరా భూమి రూ.6 కోట్ల వరకు ఉంటుంది. మరోవైపు అక్కడ ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థలు వేసిన వెంచర్లలో 200 చదరపు గజాల ఇంటి స్థలం రూ.55 లక్షల వర కు పలుకుతోంది. అంటే బహిరంగ మార్కెట్‌లో ఎక రా భూమి ధర రూ.13 కోట్ల వరకు ఉన్న ట్టు రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. శ్రీసదావర్తి సత్రం భూములు పూర్తిగా ఆక్రమణలో ఉన్నాయనే సాకు చూపించి కారు చౌకగా కొట్టేశారు.

కీలక సూత్రదారి ఈఓ శ్రీనివాసరెడ్డి
భూముల అమ్మకం వ్యవహారంలో అమరావతి అమరలింగేశ్వర స్వామి ఆలయం ఈఓ శ్రీనివాసరరెడ్డి కీలకంగా వ్యవహరించాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజకీయ పెద్దలకు అనుకూలంగా వాస్తవ పరిస్ధితులకు  విరుద్ధంగా ఉన్నతాధికారులకు తప్పుడు రిపోర్టులు పంపి భూములను తక్కవ ధరకు కట్టబెట్టటంలో క్రియాశీలకంగా వ్యవహరించాడన్న విమర్శలు వెల్లువెత్తతున్నాయి. ఇటీవలే ఏకంగా స్ధానిక ఎమ్మెల్యేకు వెండి కిరీటాన్ని ఈఓ శ్రీనివాసరెడ్డి బహుకరించటం కూడా వివాదస్పదం అవుతుంది. భూముల అమ్మకం వ్యవహారంలో  పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారటం వల్లే ఈఓ శ్రీనివాసరెడ్డి ఖరీదైన గిఫ్టులు ఇస్తున్నాడన్న వార్తలు గుప్పుమంటున్నాయి. ఈవ్యవహారంలో జిల్లాకు చెందిన ఓ మంత్రి హస్తం కూడా ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్కెచ్ మొత్తం ఆయన కనుసన్నల్లోనే నడిచిందన్న వాదన వినిపిస్తుంది. 

భూముల అమ్మకాలం కుంభకోణం విలువ సుమారుగా వెయ్యి కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. దేవుడికి నామాలు పెట్టిన వారిపై పూర్తిస్ధాయిలో విచారణ జరపాలని ప్రజలు, భక్తులు డిమాండ్ చేస్తున్నారు. వాస్తవాలను ప్రజల ముంగిట బహిర్గతం చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. 

Friday, May 27, 2016

జగన్ ఓదార్పు

సెల్లారు మృతుల కుటుంబాలకు ఓదార్పు; నేడు గొట్టిపాడుకు జగన్



వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడు రానున్నారు. ఈ నెల 14న గుంటూరు లక్ష్మీపురంలో భవన నిర్మాణ పనుల్లో పునాది తీస్తుండగా మట్టిపెళ్లలు విరిగిపడి పెదగొట్టిపాడుకు చెందిన ఏడుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. వారి కుటుంబాలను పరామర్శించేందుకు జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం గొట్టిపాడు వస్తున్నట్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత తెలిపారు. జగన్ ఉదయం 8.30 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని రోడ్డు మార్గాన ఏటుకూరు బైపాస్ మీదుగా 10 గంటలకు ప్రత్తిపాడు వస్తారని, 10.30 గంటలకు పెదగొట్టిపాడు చేరుకుని, ఏడుగురి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారని తెలిపారు. ఒక్కో కుటుంబానికి 50 వేల రూపాయల పరిహారాన్ని వైసిపి తరుపున అందజేయనున్నారు.

తమ్ముళ్ల పండగ...తిరుపతి కళకళ...అంధ్రనాడు

మహానాడు


 35వసంతాల తెలుగుదేశం పార్టీ మహాపండుగ మహానాడు ప్రతిష్టాత్మకంగా జరగనుంది.  రెండు తెలుగురాష్ట్రాలు సహా వివిధ ప్రాంతాలనుంచి ప్రతినిధుల సమావేశాలకు తరలిరానున్న నేపధ్యంలో తభారీగా ఏర్పాట్లు చేశారు. టిడిపి జాతీయపార్టీగా ఆవిర్భవించిన తరవాత తిరుపతి వేదికగా తొలిగా నిర్వహిస్తోన్న మహానాడు  కావడం.. దీనికితోడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి సొంతజిల్లా కావడంతో ప్రతిష్ఠాత్మకంగా దీన్ని చేపట్టారు. గత రెండువారాల ముందునుంచే పార్టీశ్రేణులు ప్రణాళికాబద్దంగా ఏర్పాట్లు చేపట్టారు. నెహ్రూ మున్సిపల్‌ మైదానం వేదికగా ఏర్పాటైన ప్రధానవేదిక విద్యుద్దీపాల వెలుగులో విరాజిల్లుతోంది. వేదికను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. ఎటుచూసినా పసుపుమయమే. సంబంధిత కమిటీలన్నీ అహర్నిశలూ శ్రమించడంతో పనులు పూర్తయ్యాయి. మొత్తం 30వేలమంది ప్రతినిధులు కూర్చునే వీలుగా గ్యాలరీలు బ్యారికేడ్‌ల నడుమ ఏర్పాటయ్యాయి. ప్రధాన వేదికకు సమీపానే సాంస్కృతిక కార్యక్రమాల వేదిక ఏర్పాటైంది. ఇరువైపులా మీడియా.. వీవీఐపీ, వీఐపీ, ప్రతినిధుల గ్యాలరీలు ఉన్నాయి. ఇవన్నీ పూర్తిగా భద్రతాదళాల కనుసన్నల్లోకి వెళ్లిపోయాయి.
ప్రహరీగోడ అవతలివైపున.. భోజనాలు ఏర్పాటుచేశారు. మొత్తం 20 స్టాళ్లను అందుబాటులో ఉంచారు. ఇక ముఖ్యమంత్రి సహా వీవీఐపీలకు పాఠశాల లోపల భోజనవసతి కల్పించారు. ఇప్పటికే నోరూరించే వంటకాలు వచ్చేశాయి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రాంగణం వద్ద సరిపడా తాగునీరు, మజ్జిగను ఏర్పాటుచేయనున్నారు. విద్యుద్దీపాల వెలుగుజిలుగులు.. పసుపువర్ణ కాంతులు.. నవ్యాంధ్ర రాజధాని అమరావతి.. గౌతమబుద్దుడు.. పసుపుతోరణాల రెపరెపలు.. తెలుగుదేశం వైశిష్ట్యాన్ని అణవణవునా ప్రతిబింబింపజేసే అత్యద్భుత చిత్రాలతో వేదికను తీర్చిదిద్దారు. చంద్రబాబు తనయుడు లోకేష్ ఏర్పట్లను స్వయంగా పార్టీ నేతలతో కలసి పరిశీలించి ఆనందం వ్యక్తం చేశారు. 

Thursday, May 26, 2016

నేను నమ్మితే అంతే

రాజ్యసభకు సాయిరెడ్డి నామినేషన్ దాఖలు



వైసీపీ రాజ్యసభ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఏపీ శాసనసభ కార్యదర్శి సత్యనారాయణరావుకు నామినేషన్ పత్రాలను అందజేశారు. లోటస్ పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించిన జగన్ రాజ్యసభ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి పేరును ప్రకటించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన విజయసాయిరెడ్డి గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. విజయానికి కావాల్సినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందన్నారు. పెద్దల సభలో రాష్ట్రం తరపున వాయిస్ వినిపిస్తానని విజయసాయిరెడ్డి తెలిపారు. సాయిరెడ్డి అభ్యర్ధిత్వంపై వైసిపి అధినేత జగన్ మాట్లాడుతూ సాయిరెడ్డి విలువలకు కట్టుబడ్డారని, అక్రమ కేసుల్లో తనకు వ్యతిరేకంగా చెప్పమని ఆయనపై  వత్తిడి తెచ్చారని వైఎస్ జగన్ అన్నారు. కానీ సాయిరెడ్డి సత్యాన్ని నమ్ముకున్నారని, వాస్తవాలనే చెప్తానని స్పష్టం చేశారన్నారు. అందుకే తనపై కేసుల సందర్భంగా ఆయనను కూడా నిందితుడిగా చేర్చారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఎన్ని ఒత్తిడులు ఎదురైనా సాయిరెడ్డి నైతిక విలువలకు కట్టుబడి, అండగా ఉన్నారన్నారు. విశ్వసనీయులకు సరైన స్థానం కల్పిస్తామనే సంకేతం పంపడానికే ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించినట్లు వైఎస్ జగన్ తెలిపారు. 
                                        

అందం తెచ్చిన తంటా...

మహిళా అధికారుణుల అందంపై చెత్తవార్తలు; మండిపడ్డ మహిళా ఐపిఎస్


అందమైన 10 మంది ఐఎస్, ఐపిఎస్ అధికారులపై ఓ హిందీ డెయిలీ ప్రచురించిన వార్తకధనం ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తుంది. దీనిపై తీవ్రస్ధాయిలో విమర్శలు వ్యక్తమౌతున్నాయి. ఈ కధనంపై కేరళలోని మున్నార్ ఏఎస్పీగా మెరిన్ జోసెష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 'మనం ఎప్పుడైనా అందమైన ఐపీఎస్, ఐఏఎస్ పురుష అధికారుల జాబితాను చూశామా' అంటూ ఫేస్‌బుక్ పోస్టింగ్‌లో ఆమె ప్రశ్నించారు. ఈ పోస్టింగ్ సోషల్ మీడియాలో ప్రస్తుతం దుమారం రేపుతోంది. ఐఏఎస్, ఐఏఎస్ అధికారులను అందం కొలమానంగా మీడియా చూడటం లింగవివక్షేనంటూ ఆమె మీడియాపై ఆమె మండిపడ్డారు.  మోహదృష్టితో చూస్తూ జాబితాలు సిద్ధం చేయడం ఏమిటని నిలదీశారు. ఆమె వాదనకు మద్దతుగా ఫేస్‌బుక్‌లో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఉన్నతాధికారిణులను వక్రదృష్టితో చూస్తూ , తమ యొక్క వీవర్ షిప్ పెంచుకునేందుకు వార్తలు ప్రచురించటాన్ని అందరూ తప్పుపడుతున్నారు. 

Wednesday, May 25, 2016

విశాఖలో మానవ మృగాలు

అసభ్యంగా ప్రవర్తించి...ఆపై కారుతో తొక్కించి...విశాఖలో దారుణం


కామంతో మదమెక్కిన మృగాళ్ళు కన్నుమిన్నుకానకుండా ప్రవర్తించారు. వివాహితని చూడకుండా అసభ్యంగా ప్రవర్తించటమేకాక,  వెంటపడి మరీ చంపేశారు..పరవాడ మండలం సాలాపువానిపాలెం వద్ద రెండు రోజుల క్రితం కారు ఢీకొని మహిళ మృతిచెందిన కేసు ఊహించని మలుపు తిరిగింది. విశాఖపట్నం సమీపంలోని వడ్లపూడికి చెందిన దంపతులు మాటూరి అప్పలరాజు, లావణ్య, అతడి చెల్లెలు దివ్య ఆదివారం ఉదయం అనకాపల్లి నూకాంబిక అమ్మవారిని దర్శించుకునేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్లారు. అమ్మవారిని దర్శించుకుని మధ్యాహ్నం ఆలయం సమీపంలోనే భోజనాలు చేశారు. ఆ సమయంలో అనకాపల్లి దిబ్బ వీధి రామాలయం ప్రాంతానికి చెందిన దాడి హేమకుమార్‌, అతడి స్నేహితులు నలుగురు కలిసి లావణ్యపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించారు. వారితో గొడవెందుకని భావించిన అప్పలరాజు భార్య, చెల్లెల్ని తీసుకుని వడ్లపూడికి తిరుగు ప్రయాణమయ్యాడు. అయితే మద్యం మత్తులో ఉన్న హేమకుమార్‌, అతడి స్నేహితులు కారులో వారిని వెంబడిస్తూ, లావణ్యను ఉద్దేశించి అసభ్యంగా మాట్లాడారు. సాలాపువానిపాలెం వద్ద ద్విచక్రవాహనాన్ని హేమకుమార్‌ తన కారుతో వెనుక నుంచి బలంగా ఢీకొట్టాడు. దీంతో లావణ్య కారు బాయ్‌నెట్‌పై పడగా, హేమకుమార్‌ వాహనం ఆపకుండా కొంత దూరం వెళ్లడంతో ఆమె రోడ్డుపై పడి మృతిచెందింది. భర్త అప్పలరాజు, అతని చెల్లెలు దివ్య రోడ్డుకు పక్కగా పడిపోవడంతో వారిద్దరికీ గాయాలైనా ప్రాణాలతో బయటపడ్డారు. ఈ సంఘటన చూసిన స్థానికులు కారును వెంబడించారు. చివరకు పరవాడలోని కొండ ప్రాంతంలో నిందితులు ఉపయోగించిన కారు ఆగి ఉండడం గమనించారు. కానీ, అందులో ఎవరూ కనిపించలేదు. కారు టైరు పంక్చర్‌ కావడంతో నిందితులు దాని, నంబర్‌ ప్లేటు తొలగించి కారులో పడేసి పరారయ్యారు. పోలీసులు అక్కడకు వెళ్లి కారును స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అప్పలరాజు, దివ్యలను ఆస్పత్రికి తరలించి, చికిత్స చేయిస్తున్నారు. కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాటూరి దివ్య నుంచి పోలీసులు వాగ్మూలం తీసుకున్నారు. ఇది ప్రమాదం కాదని, ఉద్దేశపూర్వకంగానే హేమకుమార్‌, అతడి స్నేహితులు కారుతో గుద్ది చంపారని ఆమె తెలిపింది. కాగా, మాటూరి లావణ్య అప్పలరాజు, లావణ్య(29) దంపతులకు ఇద్దరు కుమారులు శశాంక్‌ (4), విశాల్‌(1) ఉన్నారు. ముక్కు పచ్చలారని ఆ పసివాళ్లు.. ఏం జరిగిందో తెలియక తల్లి కోసం బోరున విలపిస్తున్నారు. ఘటన తెలుసుకున్న మహిళా సంఘాలు, ప్రజాసంఘాలు నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశాయి.
ఇదిలా వుంటే ప్రమాదానికి కారకుడైన హేమంత్ తోపాటు అతని స్నేహితులు ఇల్లు విడిచి పారిపోయారు. వారికోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.


ఛాయ్ వాలా పాలనకు రెండేళ్ళు

మోఢీ సర్కారుకు రెండేళ్ళు...అంబరానంటనున్న సంబరాలు


ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా భాజపా భారీ ఎత్తున ర్యాలీలు, సభలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. రేపు ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి మోదీ హాజరుకానున్నారు. భాజపా జాతీయ కార్యదర్శి అనిల్‌ జైన్‌ మాట్లాడుతూ కేంద్ర మంత్రులు, పార్టీ కార్యకర్తలు వివిధ ప్రాంతాల్లో మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలకు సంబంధించిన వేడుకలను నిర్వహించనున్నారు. మే 27 నుంచి జూన్‌ 15 వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ మోదీ రెండేళ్ల పాలన విజయోత్సవ సభను నిర్వహించేందుకు ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. గతేడాది నిర్వహించిన మొదటి విజయోత్సవ సభ మథురలో జరిగింది. 198 నగరాల్లో 33 బృందాలు ఈ వేడుకలను నిర్వహించనున్నారు. ఈనెల 27న వివిధ ప్రాంతాల్లో భాజపా ఏర్పాటు చేయనున్న కార్యక్రమాలకు కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు.
                            మరోవైపు రెండేళ్ళ పాలనలో మోడీ సాధించిన ఘనతపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. వ్యక్తిగత ిఇమేజ్ ను పెంచుకోవటం, పర్యటనల పేరుతో విదేశాల్లో గడిపి రావటం మినహా పెద్దగా దేశానికి మోడీ వల్ల ఓనగూరింది ఏమిలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలో అత్యధికంగా గల కార్మికులు, కర్షకుల కోసం మోడీ కొత్తగా అనుసరించిన విధానాలు  ఏమీలేవన్నది కూడా జగమెరిగిన సత్యమేనంటున్నారు. కార్పోరేట్ లకు పెద్ద పీఠ వేస్తూ సువిశాల భారత ప్రజలకుమాత్రం రెండేళ్ళ కాలంలో తీరని  ద్రోహం చేశారన్నది కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుందంటున్నారు మేధావులు, రాజకీయ విశ్లేషకులు.

Tuesday, May 24, 2016

బిజెపి వర్సెస్ టిడిపి....ఆట మొదలైంది....

సఖ్యతగా మెలగకపోతే సంగతి తేలుస్తాం; టిడిపికి బిజెపి నేతల హెచ్చరిక


బిజెపి అండ లేకుంటే ప్రజాక్షేత్రంలో తెదేపా గల్లంతుఖాయమని భాజపా అర్బన్‌ జిల్లా అధ్యక్షుడు అమ్మిశెట్టి ఆంజనేయులు అన్నారు. సోమవారం అరండల్‌పేటలోని భాజపా అర్బన్‌ పార్టీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెదేపా ప్రభుత్వానికి అనేక రకాలుగా సహకరిస్తుంటే పలువురు తెదేపా నేతలు భాజపాపై పలురకాలుగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రెండు నెలల క్రితం రాజమండ్రిలో జరిగిన భాజపా బహిరంగ సభలో భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రాష్ట్రానికి లక్షా యాబైవేల కోట్లు నిధులు మంజూరు చేశామని చెబితే.. తెదేపా నేతలు ఇప్పుడు వాటి వివరాలు అడగడం హాస్యస్పదమన్నారు. ఇప్పటికైనా భాజపాతో సఖ్యతగా మెలగాలని అలా కాకుండా భాజపాపైన కానీ, నాయకులపైన కానీ అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు.  భాజపా సీనియర్‌ నాయకుడు జూపూడి రంగరాజు మాట్లాడుతూ నోటికి ఇష్టం వచ్చినట్లు టిడిపి నేతలు మాట్లాడటం సరికాదన్నారు. కలసి పనిచేసి రాష్ట్ర అభివృద్ధికోసం పాడుపడాలని సూచించారు.  సమావేశంలో బిజెపి మీడియా ఇన్ ఛార్జి యలగలేటి గంగాధర్ తోపాటు, పార్టీనేతలు జగన్‌మోహన్‌, ప్రభాకర్‌, తిరుపతిరావు,  శ్రీనివాసరెడ్డి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

విషాదంగా మారిన కాశీ యాత్ర...

ఓరిస్సాలో రోడ్డు ప్రమాదంలో గుంటూరు భక్తులకు గాయాలు, ఒకరు మృతి


గుంటూరు నుంచి కాశీకి వెలుతున్న యాత్రికుల బస్సు మంగళవారం వేకువ జామున ఒడిశాలోని జాజుపూర్‌ ప్రాంతంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తులశమ్మ అనే మహిళ మృతిచెందగా మరో 40 మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో తీవ్రంగా గాయపడిన 10 మందిని కటక్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బాధితులంతా గుంటూరు జిల్లా నర్సరావుపేట నియోజకర్గానికి చెందినవారు. ఈనెల 20వ తేదిన ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో కాశీయాత్రకు బయలు దేరి వెళ్ళారు.

అమరావతిలో మేము భాగస్వాములమవుతామంటున్న జపాన్ కంపెనీలు

ఎపి రాజధానిలో జపాన్ బృందం



జపాన్‌ బృందం  అమరావతిలో పర్యటించింది. వెలగపూడికి చేరుకున్న జపాన్‌ బృందానికి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యే శ్రవణ్‌కుమార్‌, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులను బృంద సభ్యులు పరిశీలించారు. అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పన, పారిశ్రామిక రంగానికి ఉన్న అనుకూలతలపై ఈ బృందం అధ్యయం చేయనుంది. రాజధాని నిర్మాణానికి సంబంధించిన త్రీడి చిత్రాన్ని పరిశీలించారు. స్ధానిక పరిస్ధితులను సిఆర్డిఎ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

మాల్యాని పట్టుకోలేని వారు దావూద్ ను భారత్ రప్పించటమా....నిజమా...కలా....

దావూద్ ను భారత్ కు రప్పిస్తాం; రాజ్ నాధ్ సింగ్




ముంబయి వరుస పేలుళ్ల సూత్రధారి, అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీంను అరెస్టుచేసి త్వరలోనే భారత్‌కు తీసుకొస్తామని కేంద్ర హోంశాఖమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు. ‘దావూద్‌ను త్వరలోనే పట్టుకుంటాం. ఎట్టిపరిస్థితుల్లోనూ భారత్‌కు తీసుకొస్తాం. అతడు ఒక అంతర్జాతీయ ఉగ్రవాది. అతడిని పట్టుకొనేందుకు అంతర్జాతీయ సంస్థల సహకారం తీసుకోవాల్సి ఉంటుంద’న్నారు. దావూద్‌కు సంబంధించిన సమాచారాన్ని ఇప్పటికే పాకిస్థాన్‌కు అందజేసినట్లు చెప్పారు. దావూద్‌ను భారత్‌కు అప్పగించే అంశంలో పాకిస్థాన్‌ను ఒప్పించేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రయత్నాలు కొనసాగిస్తోందన్నారు.

ఇదిలా వుంటే రాజ్ నాధ్ వ్యాఖ్యలపై జనం పెదవి విరుస్తున్నారు. బ్యాంకులను ముంచిన విజయ మాల్యాను పట్టుకోలేని వారు, 1993 ముంబయి పేలుళ్ల ప్రధాన సూత్రధారి 250 మంది ప్రాణాలు కోల్పోగా, 700 మందికి పైగా క్షతగాత్రులు కావటానికి కారకుడైన దావూద్ ను భారత్ కు తీసుకొస్తామని చెప్పటం విడ్డూరంగా ఉందంటున్నారు.

రాంగోపాల....ఇదేమి గోల

భాజాపా ఎమ్మెల్యే అందంపై వర్మ ట్విట్లు...



ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పదట్వీట్లతో పబ్లిసిటీ సంపాదించే రామ్‌గోపాల్‌ వర్మ ఇప్పుడు రాజకీయాలపై ఫొకస్‌ పెట్టాడు. మొన్న జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అసోం రాష్ట్రంలో భాజపా తొలిసారి పాగా వేసిన సంగతి తెలిసిందే. బెంగాలీ, అస్సామీ చిత్రాల్లో నటించిన పాపులారిటీ సాధించిన అంగూర్‌లతా భాజపా టిక్కెట్‌పై విజయం సాధించారు. దీనిపై వర్మ ట్విట్టర్‌ వేదికగా కామెంట్స్‌ చేశారు. ‘ఒక ఎమ్మెల్యే ఇంత అందంగా ఉంటే..అచ్చే దిన్‌ వచ్చేసినట్లే. థ్యాంక్యూ అంగూర్‌ లతా, మోదీ గారు. మొదటిసారి రాజకీయాలంటే ఇష్టం కలుగుతోంది’ అంటూ కామెంట్స్‌ చేశారు. వర్మ ట్విట్టర్లో ఎప్పుడు ఎలా స్పందిస్తాడో ఎవరికి అంతుచిక్కకుండా ఉంది.. రాజకీయాల్లో ఇప్పటికే ఎంతో మంది మహిళలు, జయసుధ, జయలలిత, జయప్రద లాంటి నటీమణులు రాణిస్తుండగా, నటి అంగూర్ లత అందం విషయంపైనే వర్మ కామెంట్లు చేయటం వెనుక మర్మమేంటో అంతుచిక్కటంలేదు.. ఏది ఏమైనా వర్మ ట్విట్టర్ కు తాళంపడే రోజులు ఏప్పుడొస్తాయని గిట్టని వారంతా భావిస్తున్నారట....

కత్తిపోయి డోలు వచ్చే ఢాం..ఢాం...సింగపూర్ పోయి జపాన్ వచ్చే జామ్ జామ్....

అమరావతి మీ ఇల్లే...పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రండి; జపాన్ కంపెనీలకు బాబు పిలుపు



జపాన్ కంపెనీలు టోక్యోను మొదటి ఇల్లుగాను, అమరావతిని రెండో ఇల్లుగానూ పరిగణించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. జపాన్ ఆర్థిక, వాణిజ్య మంత్రి యసూకి టకాగి నాయకత్వంలో 80 మంది ప్రతినిధుల బృందం సోమవారం నగరానికి వచ్చింది. విజయవాడ గేట్‌వే హోటల్‌లో ఈ బృందంతో ముఖ్యమంత్రి సమావేశమై మాట్లాడుతూ.. సాంకేతిక విషయాల్లో ఎంతో ముందంజలో ఉన్న జపాన్ నుంచి ఆంధ్రప్రదేశ్ నేర్చుకునే దశలో ఉందన్నారు. టోక్యో మాదిరి అమరావతి అభివృద్ధి చెందేందుకు జపాన్ వాణిజ్య సంస్థలు సహకరించాలని కోరారు. అమరావతి నిర్మాణంలోనూ బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో అమరావతి నుంచి టోక్యోకు నేరుగా విమానాలు నడుపుతామని చెప్పారు. ఈ సందర్భంగా జపాన్ కంపెనీలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చాయి. సార్ట్ గ్రిడ్ ఫీడర్ మేనేజ్‌మెంట్ , స్మార్ట్ గ్రిడ్ మీటర్స్ మేనేజ్‌మెంట్ రెన్యువవబుల్ ఎనర్జీ మేనేజ్‌మెంట్ అంశాలపై పనిచేసేందుకు ప్యూజీ ఎలక్ట్రిక్ కంపెనీ ముందుకు వచ్చింది. నవ్యాంధ్రలో పెట్టుబడులు పెట్టేందుకు పలు జపాన్ కంపెనీలు ముందుకు వాటికి కావాల్సిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చారు. స్మార్ట్ సిటీ నిర్మాణం, ఎనర్జీ మేనేజ్‌మెంట్‌లలో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు హిటాచీ కంపెనీ ఆసక్తి కనబరచగా.. ఏపీలో ఇప్పటికే ఎల్‌ఈడీ బల్బులు, ఎనర్జీసేవింగ్ పంపుసెట్లు అందించామని కొత్త ఆలోచనలతో ముందుకు వస్తే పూర్తిగా సహకరిస్తామని చెప్పారు.

రెండో ముద్దాయి భాజాపానే అన్న విషయం దేశం నేతలకు ఇప్పుడెలా తెలిసింది

విభజనలో తొలిముద్దాయి కాంగ్రెస్,..రెండో ముద్దాయి కాషాయపార్టీనే; జివియస్


రాష్ట్ర విభజనలో తొలిముద్దాయి కాంగ్రెస్ అయితే రెండో ముద్దాయి బిజెపినే అంటూ గుంటూరు టిడిపి జిల్లా అధ్యక్షుడు , వినుకొండ ఎమ్మెల్యే జివియస్ అంజనేయులు సంచలన వ్యాఖ్యలు చేశారు. మిత్రపక్షమైన బిజెపిని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారాన్నిరేపుతున్నాయి. బిజెపి నేతలు కేంద్రంపై వత్తిడి తేకుండా ఉంటే ఆనాడు రాష్ట్ర విభజనే జరిగి ఉండేది కాదన్నారు. విభజనలో బిజెపికి భాగముందన్న ఆంజనేయులు, విభజన చట్టంలోని హామీలను నెరవేర్చటంతోపాటు, ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర అనుసరిస్తున్న వైఖరిని తప్పుపట్టారు. 

                      ఇదిలా వుంటే టిడిపి నేతలు రోజురోజుకు బిజెపిని టార్గెట్ చేస్తూ మాట్లాడటం చూస్తుంటే చంద్రబాబు ఢిల్లీ టూర్ పై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. బాబు టూర్ తరువాతే దేశం నేతలు బిజెపి పై ఒంటికాలిపై దూకుతుండటం చూస్తుంటే ఢిల్లీ టూర్ టిడిపి ఆశలను అడియాశలు చేశాయన్న విషయం స్పష్టమౌతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. భాజాపాతో బెడిసి కొట్టటం వల్లే దేశం నేతలు కొంత అయోమయంలో పడ్డట్టు తెలుస్తుంది. నిన్నటి దాకా కాంగ్రెస్ పార్టీ విభజనకు కారణమన్న వారు, హఠాత్తుగా బిజెపి విభజనకు కారణమని ఆరోపిస్తుండటం విస్మయాన్నిగొలుపుతుంది. రాష్ట్ర ప్రజలు సైతం దేశం నేతల మాటలకు ముక్కున వేలేసుకుంటున్నారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించటంలో క్రియాశీలకంగా వ్యవహరించిన బిజెపితో ఎన్నికల్లో పొత్తుపెట్టుకుని చెట్టాపట్టాలేసుకుని అధికారంలోకి వచ్చి తీరా ఇప్పుడు విమర్శలు చేస్తుండటంపై పలువురు పెదవి విరుస్తున్నారు.

Wednesday, May 18, 2016

దుబాయ్ టూ హైద్రాబాద్ - భారీగా డ్రగ్స్ రవాణా

 దుబాయ్ టూ హైద్రాబాద్ - భారీగా డ్రగ్స్ రవాణా


శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. ఎమిరేట్స్ ఫ్లయిట్లో దుబాయి నుంచి వచ్చిన ఓ మహిళ వద్ద 2 కిలోల కొకైన్ను రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకుని ఆమెను అదుపులోకి తీసుకున్నారు.  సదరు విమానంలోని ప్రయాణికులు కొకైన్ తీసుకువస్తున్నట్లు రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులకు ముందస్తుగా సమాచారం అందింది. దీంతో వారు అప్రమత్తమయ్యారు. అందులోభాగంగా ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయితే సదరు మహిళపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తూ... అదుపులోకి తీసుకుని... దాదాపు రెండు గంటల పాటు విచారించారు. ఆ మహిళ వద్ద ఉన్న ఐదు పుస్తకాలకు రెండు వైపులా అల్యూమినియం ఫాయిల్ కవర్లు ఉండడంతో విప్పి చూశారు. దీంతో పుస్తకాల పేపర్లలో  కొకైన్ తీసుకువస్తున్నట్లు ఆమె అంగీకరించింది. 2 కేజీల కొకైన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న కొకైన్ విలువ రూ. 10 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు చెప్పారు

Tuesday, May 17, 2016

బంగాళాఖాతంలో వాయుగుండం - తీవ్ర తుఫాన్ గా మారే అవకాశం

                          
బంగాళాఖాతంలో వాయుగుండం - తీవ్ర తుఫాన్ గా మారే అవకాశం
                                

వాయుగుండం తుఫానుగా మారనుందని విశాఖ తుఫాన్ కేంద్రం హెచ్చరించింది. చెన్నైకి 120 కిలోమీటర్ల దూరంలో దక్షిణ ఆగ్నేయ దిశగా నైరుతి బంగాళఖాతంలో అది కేంద్రీకృతం కానున్నట్లు వెల్లడించింది. ఉత్తర వాయవ్య దిశగా పయనం అయ్యి అనంతరం దిశ మార్చుకొని ఉత్తర ఈశాన్య దిశగా పయనించనున్నట్లు తెలిపింది. రాగల 24గంటల్లో ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. రేపు రాత్రికి లేదా ఎల్లుండి ఉదయం నాటికి తుఫాన్ గా మారే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దక్షిణ కోస్తాలో విస్తారంగా వర్షాలు పడనున్నాయి. ఉత్తరకోస్తాలో మాత్రం ఓ మోస్తరుగా పడతాయి. తీరం వెంబడి గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు రానున్నాయి. దక్షిణ కోస్తాలో అన్ని ప్రధాన ఓడరేవుల్లో మూడో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఉత్తర కోస్తాలో ప్రధాన ఓడరేవుల్లో ఒకటో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మత్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లరాదని ఆదేశించారు.

Monday, May 16, 2016

పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు


పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరోసారి పెరిగాయి. లీటర్‌ పెట్రోల్‌పై రూ.83 పైసలు, డీజిల్‌పై రూ.1.26 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ తెలిపింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడం, రూపాయితో డాలర్‌ మారకం విలువ పెరగడం వంటి కారణాల వల్ల ధరలు పెంచినట్లు పేర్కొంది. ఈ నెల 1న పెట్రోల్‌ రూ.1.06 పైసలు, డీజిల్‌ రూ.2.94 పైసలు పెంచిన సంగతి తెలిసిందే

మో ‘ఢీ‘ తో బాబు భేటీ

మో ‘ఢీ‘ తో బాబు భేటీ


రాష్ట్రంలో కరవు పరిస్థితిపై ప్రధాని మోదీకి నివేదించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు మంగళవారం హస్తినకు వెళ్లనున్నారు. మంగళవారం ఉదయం 9.30 గంటలకు దిల్లీ చేరుకొని, మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ కానున్నారు. మోదీతో సమావేశం సందర్భంగా మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించారు. రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులు, ప్రత్యేక హోదా, రాయితీలు, పన్ను మినహాయింపు తదితర 13 అంశాలపై సుదీర్ఘ కసరత్తు చేసినట్లు సమాచారం. ఈ సమస్యలన్నింటిపైనా ప్రధాని మోదీకి చంద్రబాబు ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నారు. ప్రధానితో భేటీలో ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్‌ పాల్గొననున్నారు. మరో వైపు బాబు పర్యటనపై పలు గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. త్వరలో రాజ్యసభ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో బిజెపికి ఓరాజ్యసభ స్ధానం ఇవ్వటంతోపాటు, పనిలో పనిగా రెండు గవర్నగిరి పోస్టులు టిడిపికి కేటాయించలన్న ప్రతిపాదనను కూడా మోఢీ ముందు చంద్రబాబు ఉంచనున్నాడన్న వార్తలు కూడా గుప్పుమంటున్నాయి. 

నేటి నుండి జగన్ జలదీక్ష

MONDAY, MAY 16, 2016

జగన్ జలదీక్ష



వైకాపా అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేటి నుండి నిరాహార దీక్ష చేపట్టనున్నారు. కర్నూలు జిల్లా కేంద్రంలోని కేంద్రీయ విద్యాలయం సమీపంలో ఆయన దీక్షలో కూర్చుంటారు. మూడురోజుల పాటు దీక్ష కొనసాగనుంది. రాష్ట్రంలో సాగునీటి రంగాన్ని టిడిపి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నందుకు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అక్రమప్రాజెక్టులు అడ్డుకోవడంలో విఫలమైనందుకు ఈ దీక్ష చేపడుతున్నట్లు జగన్‌ ఇప్పటికే ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టుల ద్వారా కృష్ణా నది నీటిని వినియోగించుకునేందుకు సిద్ధమౌతున్నా ఏపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు కనీసం వాటిని అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదని వైకాపా ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టులను నిలిపివేయించేలా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చేందుకే జగన్‌ దీక్ష చేపడుతున్నట్లు పార్టీనేతలు ప్రకటించారు. 

తమిళనాడు, కేరళ, పుదుచ్ఛేరిల్లో ప్రారంభమైన పోలింగ్

తమిళనాడు, కేరళ, పుదుచ్ఛేరిల్లో ప్రారంభమైన పోలింగ్ 

MONDAY, MAY 16, 2016


తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల శాసనసభ ఎన్నికలతో పాటు తెలంగాణలోని ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ ఉపఎన్నికల పోలింగ్‌ ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో ఐదువేల మందికి పైగా అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తమిళనాడు, కేరళ పుదుచ్ఛేరిల్లో ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. తమిళనాడులో 234 నియోజకవర్గాలున్నప్పటికీ 232 స్థానాల్లోనే పోలింగ్‌ జరుగుతోంది. అరవకురిచ్చి, తంజావూరులో ఎన్నికలను ఈసీ వాయిదా వేసింది. ముఖ్యమంత్రి జయలలిత చెన్నైలోని ఆర్కేనగర్‌ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. ఈ స్థానం నుంచి అత్యధికంగా 45 మంది పోటీచేస్తున్నారు. అటు కేరళలో 140 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్‌ ప్రారంభమైంది. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని 30 స్థానాల్లో పోలింగ్‌ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి ఎన్‌.రంగస్వామి నేతృత్వంలోని ఏఐఎన్‌ఆర్‌సీ సహా అన్నాడీఎంకే, భాజపా, పీఎంకే పార్టీలు ఈసారి ఒంటరిగానే బరిలో ఉన్నారు. తెలంగాణా పరిధిలోని ఖమ్మం జిల్లా పాలేరులో ఉపఎన్నిక పోలింగ్‌ ప్రారంభమైంది. నియోజకవర్గంలో లక్షా 90వేల 351 మంది ఓటర్లున్నారు. 2014 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి గెలుపొందిన రాంరెడ్డి వెంకటరెడ్డి(కాంగ్రెస్‌) హఠాన్మరణంతో ఉపఎన్నిక అనివార్యమైంది. ఉదయం 7గంటల ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఎన్నికలను ప్రశాంతం నిర్వహించేందుకు భారీగా పోలీసు బలగాలను మోహరించారు. 

Saturday, May 14, 2016

గుంటూరులో సెల్లార్ దుర్ఘటన- విరిగిపడ్డ మట్టి పెళ్ళలు

గుంటూరులో సెల్లార్ దుర్ఘటన- విరిగిపడ్డ మట్టి పెళ్ళలు-ఏడుగురు మృతి


గుంటూరులోని హరిహరమహల్ సమీపంలోని నిర్మాణంలో ఉన్న కమర్షియల్ కాంప్లెక్సు సెల్లార్ తవ్వకంలో అపసృతి చోటుచేసుకుంది. సెల్లార్ మట్టిపెళ్ళలు విరిగిపడటంతో ప్రమాదం చోటుచేసుకుంది.శిధిలాల క్రిందపడి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.పోలీసులు, ఎన్డిఆర్ ఎఫ్ టీం మూడుగంటలు శ్రమించి ఏడు మృతదేహలను వెలికితీశారు. 
.కార్మికులంతా ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడుకు చెందినవారు. బాదితకుటుంబాలను అన్ని విధాలుగా అదుకుంటామని ఉప ముఖ్యమంత్రి రాజెప్ప అన్నారు. మృతులు ఒక్కో కుటుంబానికి 20లక్షల పరిహారం అందజేశారు.

పొగాకు ధరలు పడిపోవటానికి వ్యాపారుల కూటమిగా ఏర్పడటమే కారణామా

పొగాకు రైతులను ప్రభుత్వం అదుకుంటుంది;ప్రత్తిపాటి

saturday, MAY 14, 2016







పొగాకు ధరలు పడిపోవటానికి వ్యాపారులంతా కూటమిగా మారటమే కారణమని  ఎపి వ్యవసాయం శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. పొగాకు మార్కెట్‌లో నెలకొన్న సంక్షోభం, రైతుల సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఆయన తెలిపారు. ఒంగోలు వేలం కేంద్రం-2లో శనివారం జరిగిన వేలాన్ని మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొగాకు వ్యాపారులు కూటమిగా ఏర్పడటం వల్లే ధరలు తగ్గుతున్నాయని వివరించారు. ఈ ఏడాది ఆంధ్ర సీజన్‌ కింద 120 మిలియన్ల పొగాకు పంట ఉత్పత్తికి బోర్డు అనుమతి ఇవ్వగా.. 126 మిలియన్లు ఉత్పత్తి జరిగిందన్నారు. ఎగుమతిదారులు, సిగరెట్‌ తయారీ సంస్థలు ఇచ్చిన ఇన్నెంట్‌ ప్రకారం కొనుగోలు చేయాలని కోరారు. పొగాకు ధరల సమస్యలపై వచ్చే వారంలో కేంద్ర వాణిజ్య శాఖమంత్రి నిర్మలాసీతారామన్‌తో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రైతులు సిండికేట్‌ అయితే ఒకటి రెండు రోజులు వేలంను నిలుపుదల చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌, తెదేపా సీనియర్‌ నాయకుడు కరణం బలరామకృష్ణమూర్తి, పొగాకు బోర్డు ఈడీ పట్నాయక్‌, సంతనూతలపాడు తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ బీఎన్‌ విజయ్‌కుమార్‌ ఒంగోలు ఎమ్‌సీ ఛైర్మన్‌ సింగరాజు రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.

మూడురాష్ట్రాల్లో ముగిసిన ప్రచారం...పోలింగ్ కు సర్వంసిద్ధం

SATURDAY, MAY 14, 2016

మూడురాష్ట్రాల్లో ముగిసిన ప్రచారం...పోలింగ్ కు సర్వంసిద్ధం



తమిళనాడు, కేరళ, కేంద్రపాలితప్రాంతమైన పుదుచ్చేరిలో హోరాథహోరీగా సాగిన ఎన్నికల ప్రచారానికి తెరపడింది. సోమవారం అనగా 16వతేదిన ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నేపధ్యంలో మూడురాష్ట్రాల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని రాజకీయ పార్టీల అభ్యర్ధులు డబ్బు, మద్యాన్ని విచ్చలవిడిగా పంపిణీ చేశారు.  కేరళలో మొత్తం 2.61 కోట్ల మంది ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 140 శాసన సభ స్థానాలకుగాను మొత్తం 1,203 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వారిలో 109 మంది మహిళలు కూడా ఉన్నారు. తమిళనాడులో 5.79 కోట్ల మందికిపైగా ప్రజలు సోమవారం ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 234 శాసనసభ స్థానాలకుగాను 3,776 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారిలో నలుగురు ముఖ్యమంత్రి అభ్యర్థులు కూడా ఉన్నారు. అన్నాడీఎంకే తరఫున జయలలిత, డీఎంకే తరఫున కరుణానిధి, డీఎండీకే తరఫున విజయ్‌కాంత్‌, పీఎంకే నుంచి అన్భుమణి రాందాస్‌లు ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ఉన్నారు. పుదుచ్చేరీలో 9.43 లక్షల మంది సోమవారం ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. 30 అసెంబ్లీ స్థానాలకుగాను 300 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

తమిళ నాడులో కట్లపాములు

SATURDAY, MAY 14, 2016

ఓట్లకోసం నోట్లు... డబ్బుతో ఓటర్లకు గాలం...తమిళనాడు ఎన్నికల చిత్రాలు



తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో  నాకాబంధీ చేపట్టిన ఎన్నికల అధికారులు, సంబంధిత పోలీసులు కోయంబత్తూరు, తిరుపూర్ జిల్లాలో భారీ ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నారు. కోయంబత్తూరు బైపాస్ రోడ్డులో ఓ కంటైనర్ ను పరిశీలించగా అందులో రూ. 195 కోట్ల నగదు కట్టలు ఉన్న విషయం గుర్తించి సీజ్ చేశారు. మూడు కంటైనర్లలో డబ్బు కోయంబత్తూరు నుంచి విశాఖకు ఈ కంటైనర్లు వెళుతున్నాయని అధికారులు అన్నారు. విశాఖలోని ఎస్ బీఐ బ్యాంకులో ఈ నగదు డిపాజిట్ చెయ్యడానికి తీసుకు వెలుతున్నామని విచారణలో డ్రైవర్లు చెప్పారని పోలీసు అధికారులు అంటున్నారు. అయితే అందుకు సంబంధించిన ఎలాంటి పత్రాలు లేకపోవడంతో కంటైనర్లును స్వాధీనం చేసుకున్నారు. నగదు ఉన్న కంటైనర్లను జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తరలించారు. ఈ నగదు విషయంపై ఉన్నత స్థాయి విచారణ జరుపుతున్నామని ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ నెల 16వ తేదిన తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఒకే దశలో పోలింగ్ జరుగుతున్నందున వివిధ రాజకీయ పార్టీల నాయకుల ఓటర్లకు నగదు పంపిణి చెయ్యడానికి అనేక ప్రయత్నాలు చేశారు. గత గురువారం వరకు తమిళనాడులో ఎన్నికల అధికారులు రూ. 100 కోట్లు సీజ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా ఓ రాష్ట్రంలో రూ. 100 కోట్లు అక్రమ నగదు సీజ్ చెయ్యడం ఇదే మొదటి సారి.  ఒక్క అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడు రూ. 100 కోట్ల అక్రమ రవాణా నగదును ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తిరుపూర్ జిల్లాలో 3 కంటేనర్లలో పట్టుకున్న రూ. 570 కోట్ల భారీ నగదును విశాఖకు తరలిస్తున్నట్లు ఆ రాష్ట్ర ఎన్నికల చీఫ్ ఆఫీసర్ రాజేశ్ లోహానీ తెలిపారు. కంటేనర్లకు సెక్యూర్టీగా వెళ్తున్న సిబ్బందికి సరైన దుస్తులు కూడా లేవని, వాళ్ల దగ్గర ఆ సొమ్ముకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా లేవని ఆయన స్పష్టం చేశారు. రూ.570 కోట్ల నగదుతో వెళ్తోన్న కంటేనర్ల గురించి ఎస్‌బీఐ అధికారులతో మాట్లాడినట్లు ఆయన చెప్పారు. అయితే ఆ ఘటనపై విచారణ చేపట్టేందుకు ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు రాజేశ్ తెలిపారు. సెక్యూర్టీ సిబ్బంది దగ్గర కేవలం ఫోటో కాపీలు మాత్రమే ఉన్నాయని, వాళ్ల దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్లు లేవని ఆయన స్పష్టం చేశారు.

మనస్సు కరిగిస్తామంటున్న దేశం నేతలు....ఎవరది...ఎందుకు

SATURDAY, MAY 14, 2016

మేం బిజెపిని వీడం-ఎపి ప్రజలు హోదాని వదులుకోరు;డొక్కా


ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర ప్రజల్లో భావోద్వేగాలు ఉన్నాయంటున్నారు టిడిపి అధికార ప్రతినిధి డొక్కా మాణిక్యవరప్రసాద్. విభజన నష్టాన్ని భర్తీ చేసేందుకు ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రమే హమీ ఇచ్చిందన్నారు. దీనిని వదులు కోవడానికి ఎపి ప్రజలు సిద్ధంగాలేరన్నారు. హోదా ఇవ్వాలని సియం చంద్రబాబు అనేక మార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేశారని డొక్కా ఈ సందర్భంగా గుర్తు చేశారు. విభజన చట్టంలోని అంశాలు, లోటు బడ్జెట్,  స్పెషల్ స్టేటస్ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందన్నారు. హోదా ఇచ్చే విషయంలో బిజెపికి పరిమితులుంటే అది టిడిపికి సంబంధం లేదన్నారు. కేంద్రాన్ని ఒప్పించి,  మనస్సు కరిగించి ప్రత్యేక హోదా సాధించడానికి కృషి చేస్తామన్నారు. జగన్ కృష్ణా జలాల ప్రాజెక్టుల విషయంలో రెండు రాష్ట్రాల ప్రజలను రెచ్చగొట్టేలా దీక్షలు చేయటం సరికాదన్నారు డొక్కా మాణిక్య వరప్రసాద్. 

జార్ఖండ్, బీహార్ రాష్ట్రాల్లో ఇద్దరు జర్నలిస్టులు కాల్చివేత

జార్ఖండ్, బీహార్ రాష్ట్రాల్లో ఇద్దరు జర్నలిస్టులు కాల్చివేత

Shot-dead
ఒక రోజు వ్యవధిలో బీహార్,  జార్ఖండ్ లో ఇద్దరు జర్నలిస్టులను గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపారు. బీహార్ లోని ‘హిందూస్థాన్’ అనే హిందీ దినపత్రికలో బ్యూరో చీఫ్ గా పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టు రాజ్ దేవ్ ను సివాన్ జిల్లాలోని రైల్వేస్టేషన్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు తుపాకీతో కాల్చారు. ఒక బులెట్ అతని తలలోకి, మరో బులెట్ ఛాతీలోకి దూసుకుపోయాయి. రాజ్ దేవ్ ను ఆసుపత్రికి తరలించే సమయానికే చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు.  హత్యకు గల కారణాలు తెలియరాలేదని పోలీసులు వివరించారు.
జార్ఖండ్ లోని ఛాత్రా జిల్లాలో నిన్న రాత్రి అఖిలేష్ ప్రతాప్(35) అనే జర్నలిస్టును గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపారు. జార్ఖండ్ లో ఒక స్థానిక ఛానెల్ లో పనిచేస్తున్న అఖిలేష్ ప్రతాప్ పై స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద కాల్పులకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.  ఈ సంఘటనపై జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘుబార్ దాస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితులను అరెస్టు చేయాలని  ఆ రాష్ట్ర  డీజీపీని ఆదేశించారు.

Friday, May 13, 2016

అంధ్రప్రదేశ్ ఆణిముత్యం-జస్టిస్ లావు నాగేశ్వరరావు


అంధ్రప్రదేశ్ ఆణిముత్యం-జస్టిస్ లావు నాగేశ్వరరావు


స్వయంకృషి,పట్టుదలతో ఎదిగిన లావు

మాజీ అడిషనల్ సొలిసిటర్ జనరల్ లావు నాగేశ్వరరావు శుక్రవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణం చేశారు. సాధారణంగా సుప్రీంకోర్టుకు జడ్జిగా ఎంపికవ్వాలంటే ముందుగా ఏదైనా హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన అనుభవం ఉండాలి. కానీ లావు నాగేశ్వరరావు అందుకు ప్రత్యేకం. సుప్రీంకోర్టులో సీనియర్‌ కౌన్సిల్‌గా ప్రాక్టీస్‌ చేస్తూ ఏకంగా జడ్జి అయిన ఘనత సాధించిన తొలి తెలుగు వ్యక్తి లావు నాగేశ్వరావు. అంతేకాదు జస్టిస్‌ సంతోష్‌ హెగ్డే తర్వాత నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా దక్షిణాది నుంచి ఎన్నికైన రెండో న్యాయమూర్తి. సుప్రీంకోర్టులో సీనియర్‌ లాయర్‌గా 22 ఏళ్లుగా పనిచేస్తూ ఎన్నో కీలకమైన కేసులను వాదించి ఖ్యాతిగడించారు. స్వయంకృషికి, పట్టుదలకు మారుపేరుగా నిలిచారు. తాజాగా లావు నాగేశ్వరరావు నియామకంతో సుప్రీం కోర్టులో తెలుగువారి జడ్జిల సంఘ్య మూడుకు చేరింది. ఇప్పటికే జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ ఎన్.వి రమణలు సుప్రీం కోర్టులో న్యాయమూర్తులుగా ఉన్నారు. సుప్రీం కోర్టుతో సహా దేశంలోని వివిధ రాష్ట్రాల హైకోర్టులలో ఆయన తన వాదనలు వినిపించారు. 2002లో తోలిసారిగా వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో అదనపు సొలిసిటర్‌ జనరల్‌గా నియమితులయ్యారు. 

లావుప్రస్తానం గుంటూరు జిల్లా నుండే

గుంటూరు జిల్లా పెదనందిపాడులో లావు వెంకటేశ్వర్లు, శివనాగేంద్రమ్మ దంపతుల ఐదుగురు పిల్లల్లో తొలి సంతానం నాగేశ్వరరావు. నల్లపాడులోని లయోలా స్కూలులో ఆయన ప్రాథమిక విద్య కొనసాగింది. గుంటూరులోని టీజేపీఎస్‌ కళాశాలో బీకాం డిగ్రీ పూర్తి చేశారు. చదువుకునే రోజుల్లోనే నాటక రంగంపై ఆసక్తితో అనేక ఇంగ్లిష్‌ నాటికలు ప్రదర్శించి ప్రిన్స్‌గా పేరు పొందారు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత తండ్రికి వ్యాపారంలో చేదోడు వాదోడుగా నిలిచారు. కానీ, దానిపై అంతగా ఆసక్తి లేక.. ఏసీ కళాశాలలో లా చదివారు. 1982నుంచి 1984 వరకూ గుంటూరు జిల్లా కోర్టులోనూ, ఆ తర్వాత 1994వరకూ హైకోర్టులోనూ ప్రాక్టీస్‌ చేశారు. లాయర్‌గా ప్రాక్టీసు చేస్తున్న సమయంలోనే.. 'ప్రతిధ్వని' సినిమాలో పోలీస్‌ ఆఫీసర్‌ పాత్ర పోషించారు. నాటకాలు, సినిమాలే కాదు.. క్రికెట్‌ అన్నా ఆయనకుచాలా ఇష్టం. ఆ క్రీడలో గొప్ప ప్రతిభ ప్రదర్శించి క్రికెటర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆంధ్ర జట్టు తరపున రంజీల్లో ఆడారు. సొంత గ్రామాన్నే దత్తత తీసుకున్నారు తన స్వగ్రామమైన పెదనందిపాడు అంటే నాగేశ్వరరావుకు చాలా ఇష్టం. జన్మభూమి రుణం తీర్చుకోవడానికి ఆ ఊరినే ఆయన దత్తత తీసుకున్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు, యువత ఉపాధికి శ్రీకారం చుట్టారు. చెట్లు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడమే కాకుండా ఊరిలో ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేశారు. ఊరిని పూర్తిగా సర్వే చేయించి ప్రతి ఇంటిలోని వ్యక్తుల పేర్లతో సహా పూర్తి డేటాను తయారు చేసి సంక్షేమ కార్యక్రమాలకు పునాది వేశారు. పెదనందిపాడు ఎడ్యుకేషనల్‌ సొసైటీని ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు స్కాలర్ షిప్‌లుఅందజేస్తున్నారు. సంవత్సరానికి రూ.లక్ష వ్యయంతో ఒక విద్యార్థిని చదివిస్తున్నారు. 


విజయ్ మాల్యా విలాసం-బ్యాంకుల హస్తగతం

విజయ్ విల్లా స్వాధీనం

విజయ్ మాల్యా విల్లా స్వాధీనం
  బ్యాంకులను శఠగోపం పెట్టి విదేశాలకు పారిపోయిన పారిశ్రామికవేత్త విజయ్‌ మాల్యా చుట్టూ ఉచ్చుబిగుసుకుంటుంది. గోవాలో ఆయన భవంతిని బ్యాంకు అధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. రూ. 90 కోట్లు విలువ చేసే ఈ విల్లాను ఎస్ బీఐ క్యాప్ ట్రస్టీ తన అధీనంలోకి తీసుకుంది. దీన్ని స్వాధీనం చేసుకునేందుకు ఉత్తర గోవా కలెక్టర్ గురువారం బ్యాంకు అధికారులకు అనుమతి మంజూరు చేశారు. గోవా వచ్చినప్పుల్లా విజయ్ మాల్యా ఈ భవంతిలో బస చేసేవారని, ఇందులో ఎన్నోసార్లు ప్రముఖులకు పార్టీలు ఇచ్చారని స్థానికులు వెల్లడించారు.

రూ.9,000 కోట్ల మేర బ్యాంకింగ్ రుణ ఎగవేతలు, అక్రమ ధనార్జన వంటి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం బ్రిటన్‌లో ఉన్న విజయ్‌ మాల్యాపై రెడ్ కార్నర్ (అరెస్ట్ వారెంట్) నోటీస్ జారీ చేయాలని  సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) గ్లోబల్ పోలీస్- ఇంటర్‌పోల్‌కు గురువారం ఒక లేఖ రాసింది. తమ చట్ట నిబంధనల ప్రకారం- మాల్యాను దేశం నుంచి బహిష్కరించడం సాధ్యంకాదని బ్రిటన్ తేల్చి చెప్పడంతో రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

అప్పులబాధతో అన్నదాత బలవన్మరణం

అప్పులబాధతో అన్నదాత బలవన్మరణం

గుంటూరు జిల్లా గురజాలలో జక్కా వెంకటేశ్వర్లు(45) అనే కౌలు రైతు గురువారం  ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గత సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురవడంతో వేసిన పంట చేతికి రాకపోవడంతో అప్పులు పాలై ఈ సంవత్సరం కూడా ఎలా ఉంటుందో అని మనోవేదనకు గురై ప్రాణాలు తీసుకున్నాడు.గత రెండు సంవత్సరాలుగా పంట నననష్టపోవడంతో  సుమారు (20) ఇరవై లక్షలు అప్పు మిగిలింది. గతేడాది పది ఎకరాలు పంట సాగు చేయగా ఆరు లక్షలు అప్పు అయింది.ఈ యేడాది కూడా ప్రారంభ దశలో వర్షాలు కురవడంతో మళ్ళీ పది ఎకరాలు కౌలుకు తీసుకుని పొలంలో రెండు బోర్లు వేసి సాగుచేశాడు పంట చేతికి వచ్చే సమయంలో వర్షాలు కురవక మరలా బోర్లు ఎండిపోవడంతో ఆశించిన స్థాయిలో దిగుబడులు రాక పోవడంతో సుమారు పద్నాలుగు లక్షలు(14) అప్పులు అయ్యాయి ఈ అప్పులు ఎలా తీర్చాలనే మనోవేదనకు గురై  ఇంటిలోనే దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు సంఘటనా స్థలానికి యస్ ఐ సురేష్ చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు మృతునికి భార్య ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు వున్నారు         రిపోర్ట్;బుచ్చిబాబు, గురజాల,అమరావతి బ్రేకింగ్ న్యూస్                                                                 

నాచారంలో ఎగసిన అగ్నికీలలు

నాచారంలో  ఎగసిన అగ్నికీలలు

హైద్రాబాద్(తెలంగాణా); నాచారం పారిశ్రామిక వాడలో  భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రారిశ్రామికవాడలోని రోడ్‌ నెంబరు 18లో ఉన్న శాలిస్లైట్‌ రసాయన పరిశ్రమలో రియాక్టర్లు పేలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడటంతో సమీపంలోని ప్రజలు భయాందోళనతో పరుగుల తీశారు. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని 10 ఫైరింజన్లతో మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఉప్పల్‌ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ ఘటనాస్థలిని పరిశీలించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. భారీగా ఆస్తినష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. పరిశ్రమలోని రసాయన ట్యాంకర్లు పేలడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. ప్రమాదం కారణంగా పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగ అలుముకోవడంతో ప్రజలు శ్వాస సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. పరిశ్రమలో భారీ పేలుళ్ల శబ్దాలకు స్థానికులు భయాందోళనకు లోనయ్యారు.
రిపోర్టర్; బూరుగ రమేష్, హైద్రాబాద్, తెలంగాణా, అమరావతి బ్రేకింగ్ న్యూస్

ఎపిలో ఉద్యోగ మేళా

ఎపిలో ఉద్యోగ మేళా


ఎంతోకాలంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తీపికబురు... త్వరలో ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ల విడుదలకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ)రెడీ అవుతోంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 20,250 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో పోలీసు విభాగానికి చెందినవి 8 వేలుకాగా, మిగిలిన 12 వేల పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసే అవకాశం ఉంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం అతి త్వరలోనే 1100 ఖాళీలతో గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఆ తర్వాత సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ (సీఎఎస్‌) పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ జారీ అవుతుందని తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి వచ్చే మార్గదర్శకాలను బట్టి దశల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు కమిషన్‌ సిద్ధమవుతోంది. ఇండెంట్‌ అందిన 15 రోజుల్లోగా నోటిఫికేషన్లు విడుదల చేయాలని ఏపీపీఎస్సీ భావిస్తోంది. తొలిగా దేవాదాయశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు రంగం సిద్ధంచేస్తున్నారు. ఇటీవలే ఏపీపీఎస్సీ నవీకరించిన వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. గతానికి భిన్నంగా తొలిసారి ‘వన్‌టైమ్‌ రిజిసే్ట్రషన్‌’ కు ఏర్పాటు చేశారు. ఇందులో డిపార్ట్‌మెంటల్‌ టెస్ట్‌లకు సంబంధించిన విభాగాన్ని ఓపెన్‌ చేశారు. జూన్‌లో నిర్వహించే పరీక్షలు రాయగోరు అభ్యర్థులు తమ వివరాలతో రిజిసే్ట్రషన్‌ చేసుకునే అవకాశం కల్పించారు. ఇక డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్లకు సంబంధించిన విభాగాన్ని తొలి నోటిఫికేషన్‌ విడుదల చేయగానే ఓపెన్‌ చేయాలని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. గ్రూప్‌-1, 2, 4లకు సంబంధించిన సిలబ్‌సలో మార్పులను ఖరారు చేయాలని భావిస్తున్నారు. ప్రతిపాదిత సిలబ్‌సపై వచ్చిన 1,234 అభ్యంతరాలను సబ్జెక్టు నిపుణులకు ఏపీపీఎస్సీ పంపించింది.  మారిన సిలబ్‌సను త్వరలో ప్రకటించనున్నారు. మరో వైపు పోటీపరీక్షలకు తర్ఫీదు నిచ్చేందుకు ఇప్పటికే పలు కోచింగ్ అకాడమీలు పుట్టుగొడుగుల్లా పుట్టుకొచ్చి నిరుద్యోగులకు శిక్షణలు మొదలుపెట్టాయి.