Friday, May 13, 2016

చౌదరికి మళ్ళీ రాజ్యసభ దక్కేనా?

చౌదరికి మళ్ళీ రాజ్యసభ దక్కేనా?


కేంద్రమంత్రి సుజనా చౌదరికి మళ్లీ రాజ్యసభ టికెట్ దక్కుతుందా? ఈ విషయంలో పార్టీలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుజనా చౌదరి (వై సత్యనారాయణ చౌదరి)పై గత కొంతకాలంగా సొంతపార్టీకి చెందిన ఎంపీలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేయడం, తీసుకున్న రుణాలను చెల్లించలేదన్న ఆరోపణలు వంటి పరిణామాలు ప్రస్తుత పరిస్థితుల్లో సుజనా చౌదరికి ప్రతికూలంగా మారాయి.
కేంద్రంలో సహాయమంత్రిగా ఉన్నా.. పార్టీ ఎంపీలను పట్టించుకోవడం లేదని కొంతకాలం కిందట టీడీపీ ఎంపీలు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ఆయనకు మరోసారి రాజ్యసభకు అవకాశం ఇవ్వబోమని ఆ సమయంలోనే చంద్రబాబు ఎంపీలకు చెప్పినట్టు ప్రచారం జరిగింది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు లోకేష్‌కు అత్యంత సన్నిహితుడిగా పనిచేస్తూ ఎన్నికల్లో ఆర్థిక వ్యవహారాలను చూసుకున్నారని పార్టీ వర్గాలు చెప్పాయి. ఆ సమయంలోనే ఆయన లోకేష్‌కు అత్యంత సన్నిహితుడిగా మారగా, ఆ తర్వాత కాలంలో వారిద్దరి మధ్య కొంత దూరం పెరిగిందని చెబుతున్నారు. అయితే ఎంపీలు ఫిర్యాదు చేసిన తర్వాత సుజనా చౌదరిలో కొంత మార్పు వచ్చిందని, గడిచిన ఆరు నెలల్లో చంద్రబాబుకు మళ్లీ దగ్గరయ్యారన్న మాట కూడా పార్టీలో వినిపిస్తోంది.

ప్రస్తుతం జూన్‌లో జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో మిత్రపక్షమైన బీజేపీకి ఒక స్థానం కేటాయించనుండగా, మిగిలిన రెండు స్థానాలకు పార్టీలో పోటీ పెరుగుతోంది. సుజనా చౌదరికి తిరిగి టికెట్ ఇచ్చే విషయాన్ని పార్టీకే చెందిన మరో ఎంపీ సీఎం రమేష్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. రాజ్యసభ ప్రస్తుత ఖాళీల్లో టీడీపీ మూడు స్థానాలను గెలుచుకునే అవకాశాలుండగా, అందుకోసం చాలామందే పోటీ పడుతున్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సైతం రాజ్యసభకు వెళ్లాలన్న ఆలోచనలో ఉన్నారు. ఆయనతో పాటు మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు కూడా టికెట్‌ను ఆశిస్తున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఆర్థికపరుడైన వేమిరెడ్డి ప్రభాకర రెడ్డికి టికెట్ రేసులో ఉన్నారు.

No comments:

Post a Comment