Friday, May 13, 2016

అంధ్రప్రదేశ్ ఆణిముత్యం-జస్టిస్ లావు నాగేశ్వరరావు


అంధ్రప్రదేశ్ ఆణిముత్యం-జస్టిస్ లావు నాగేశ్వరరావు


స్వయంకృషి,పట్టుదలతో ఎదిగిన లావు

మాజీ అడిషనల్ సొలిసిటర్ జనరల్ లావు నాగేశ్వరరావు శుక్రవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణం చేశారు. సాధారణంగా సుప్రీంకోర్టుకు జడ్జిగా ఎంపికవ్వాలంటే ముందుగా ఏదైనా హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన అనుభవం ఉండాలి. కానీ లావు నాగేశ్వరరావు అందుకు ప్రత్యేకం. సుప్రీంకోర్టులో సీనియర్‌ కౌన్సిల్‌గా ప్రాక్టీస్‌ చేస్తూ ఏకంగా జడ్జి అయిన ఘనత సాధించిన తొలి తెలుగు వ్యక్తి లావు నాగేశ్వరావు. అంతేకాదు జస్టిస్‌ సంతోష్‌ హెగ్డే తర్వాత నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా దక్షిణాది నుంచి ఎన్నికైన రెండో న్యాయమూర్తి. సుప్రీంకోర్టులో సీనియర్‌ లాయర్‌గా 22 ఏళ్లుగా పనిచేస్తూ ఎన్నో కీలకమైన కేసులను వాదించి ఖ్యాతిగడించారు. స్వయంకృషికి, పట్టుదలకు మారుపేరుగా నిలిచారు. తాజాగా లావు నాగేశ్వరరావు నియామకంతో సుప్రీం కోర్టులో తెలుగువారి జడ్జిల సంఘ్య మూడుకు చేరింది. ఇప్పటికే జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ ఎన్.వి రమణలు సుప్రీం కోర్టులో న్యాయమూర్తులుగా ఉన్నారు. సుప్రీం కోర్టుతో సహా దేశంలోని వివిధ రాష్ట్రాల హైకోర్టులలో ఆయన తన వాదనలు వినిపించారు. 2002లో తోలిసారిగా వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో అదనపు సొలిసిటర్‌ జనరల్‌గా నియమితులయ్యారు. 

లావుప్రస్తానం గుంటూరు జిల్లా నుండే

గుంటూరు జిల్లా పెదనందిపాడులో లావు వెంకటేశ్వర్లు, శివనాగేంద్రమ్మ దంపతుల ఐదుగురు పిల్లల్లో తొలి సంతానం నాగేశ్వరరావు. నల్లపాడులోని లయోలా స్కూలులో ఆయన ప్రాథమిక విద్య కొనసాగింది. గుంటూరులోని టీజేపీఎస్‌ కళాశాలో బీకాం డిగ్రీ పూర్తి చేశారు. చదువుకునే రోజుల్లోనే నాటక రంగంపై ఆసక్తితో అనేక ఇంగ్లిష్‌ నాటికలు ప్రదర్శించి ప్రిన్స్‌గా పేరు పొందారు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత తండ్రికి వ్యాపారంలో చేదోడు వాదోడుగా నిలిచారు. కానీ, దానిపై అంతగా ఆసక్తి లేక.. ఏసీ కళాశాలలో లా చదివారు. 1982నుంచి 1984 వరకూ గుంటూరు జిల్లా కోర్టులోనూ, ఆ తర్వాత 1994వరకూ హైకోర్టులోనూ ప్రాక్టీస్‌ చేశారు. లాయర్‌గా ప్రాక్టీసు చేస్తున్న సమయంలోనే.. 'ప్రతిధ్వని' సినిమాలో పోలీస్‌ ఆఫీసర్‌ పాత్ర పోషించారు. నాటకాలు, సినిమాలే కాదు.. క్రికెట్‌ అన్నా ఆయనకుచాలా ఇష్టం. ఆ క్రీడలో గొప్ప ప్రతిభ ప్రదర్శించి క్రికెటర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆంధ్ర జట్టు తరపున రంజీల్లో ఆడారు. సొంత గ్రామాన్నే దత్తత తీసుకున్నారు తన స్వగ్రామమైన పెదనందిపాడు అంటే నాగేశ్వరరావుకు చాలా ఇష్టం. జన్మభూమి రుణం తీర్చుకోవడానికి ఆ ఊరినే ఆయన దత్తత తీసుకున్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు, యువత ఉపాధికి శ్రీకారం చుట్టారు. చెట్లు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడమే కాకుండా ఊరిలో ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేశారు. ఊరిని పూర్తిగా సర్వే చేయించి ప్రతి ఇంటిలోని వ్యక్తుల పేర్లతో సహా పూర్తి డేటాను తయారు చేసి సంక్షేమ కార్యక్రమాలకు పునాది వేశారు. పెదనందిపాడు ఎడ్యుకేషనల్‌ సొసైటీని ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు స్కాలర్ షిప్‌లుఅందజేస్తున్నారు. సంవత్సరానికి రూ.లక్ష వ్యయంతో ఒక విద్యార్థిని చదివిస్తున్నారు. 


No comments:

Post a Comment