ప్రత్యేక హోదాకు అడ్డుపడుతున్న బిజెపి
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లు ఓటింగ్‌కు రాకుండా ఎన్డీఎ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజరు సింగ్, రాజ్యసభ సభ్యులు జైరాం రమేష్ గురువారం ఆరోపించారు. ఒకే వేళ ఆ బిల్లు చర్చకు వచ్చి, ఓటింగ్‌కు వెళ్తే టిడిపి, బిజెపిల బండారం బయట పడుతుందని, అందుకే ఆ బిల్లు రాకుండా రాజ్యసభను వాయిదా వేసేందుకు కేంద్రం కుట్ర పన్నిందని అన్నారు. వాస్తవానికి కెవిపి ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్ బిల్లు శుక్రవారం మధ్యాహ్నం రాజ్యసభలో చర్చకు రావల్సి ఉంది. కాని అంతకంటే ముందే సభను మధ్యాహ్నానికి వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇది కేంద్ర మంత్రి వెంకయ్య ఆడిన నాటకంలోని భాగమేనని విమర్శించారు.కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరల సమావేశంలో దిగ్విజరు సింగ్, జైరాం రమేష్, సుబ్బిరామి రెడ్డి, జెడి శీలం, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు రఘువీరా రెడ్డి తదితరులు మాట్లాడారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకునేందుకు నాటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రానికి పదేళ్ళపాటు ప్రత్యేక హోదా ప్రకటిస్తామని అన్నది వెంకయ్య నాయుడే కదా? అని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వాలంటే చట్టపరంగా ఉండనవసరం లేదని, కేవలం కేంద్ర మంత్రి వర్గం ఆమోదంతోనే ఇవ్వవచ్చునని అన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో నాటి యుపిఎ కేంద్ర మంత్రి వర్గం ఏపి ప్రత్యేక హోదాను ఆమోదించిందని, దాన్ని అమలు చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం ఏపి ప్రజలను మోసం చేస్తోందని అన్నారు. విభజన చట్టాన్ని అమలు చేయడంలో గత రెండేళ్ళుగా మోడి ప్రభుత్వం విఫలమైందన్నారు. బిజెపి, టిడిపిలకు ఇది ఒక పరీక్ష అని, ఏపి పట్ల చిత్త శుద్ధి ఉంటే ప్రైవేట్ మెంబర్ బిల్లుకు మద్దతివ్వాలని డిమాండు చేశారు.
No comments:
Post a Comment