Saturday, May 28, 2016

అమరేశ్వరునికే నామాలు....అధికారపార్టీ లీలలు

శివ..శివా...హరహర మహాదేవ శంభోశంఖర



కంచె చేను మేసింది...ప్రభుత్వ ఆస్ధులను కాపాడాల్సిన వారే వాటిని నిలువునా మింగేస్తూ లూఠీలకు తెరతీస్తున్నారు. చివరకు దేవుడిని కూడా వదిలపెట్టటంలేదు. విలువైన ఆలయ ఆస్ధులను కారుచౌకకు అప్పనంగా అమ్మేసుకుంటూ జేబులు నింపుకుంటున్నారు. అమరావతి అమరలింగేశ్వర స్వామి దేవస్ధానం సదావర్తి సత్రం భూముల అమ్మకం వ్యవహారంలో అధికార పార్టీ నేతలు భారీ కుంభకోణానికి తెరలేపారు. ఏకంగా వెయ్యి కోట్ల విలువైన భూములను 22కోట్లకే అమ్మించి పరమ శివునికే బూడిద పూశారు. ప్రస్తుతం ఈవ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తుంది.

చెన్నైలో ఖరీదైన భూమి


శ్రీసదావర్తి సత్రం భూములున్న ప్రాంతం చెన్నైలోని అత్యంత ఖరీదైన ఓల్డ్ మహాబలిపురం రోడ్డులో ఉంది. తాలంబూరు గ్రామ పరిధిలో రోడ్డు పక్కనే ఈ భూములున్నాయి. వీటి సమీపంలో సత్యభామ యూనివర్సిటీ, హిందూస్థాన్ యూనివర్సిటీ, టీసీఎస్ సహా పలు ఐటీ సంస్థలు, స్టార్ హోటళ్లు, భారీ అపార్టుమెంట్లు, రిసార్టులు, గేటెడ్ కమ్యూనిటీలు ఉన్నాయి. ఇక్కడి నుంచి సముద్ర తీరం కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. స్వాతంత్య్రానికి పూర్వమే బ్రాహ్మణులకు, వేదశాస్త్రాలను అభ్యసించే పేద విద్యార్థులకు అన్నదానం నిర్వహించాలన్న లక్ష్యంతో అమరావతి జమీందారులైన రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు వంశీకులు అప్పట్లో ఈ సత్రాన్ని నిర్మించారు. గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం కోగంటివారిపాలెంలో తమ పేరిట ఉన్న 72 ఎకరాలను, తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలో మరో 471.76 ఎకరాలను సత్రం నిర్వహణ కోసం ఇనామ్ రూపంలో దారాదత్తం చేశారు. తమిళనాడులోని కాంచీపురం జిల్లా చెంగల్పట్టు తాలూకాలో నావలూరు, తాలంబూరు, పడూరు గ్రామాల పరిధిలో ఈ భూములున్నాయి. ఈ భూముల విక్రయానికి అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం 2015 ఏప్రిల్ 6న ఉత్తర్వులు (మెమో నం. 28228) జారీ చేసింది. అందులో 83.11 ఎకరాల భూమి అమ్మకానికి ఈ ఏడాది మార్చి 28న దేవాదాయ శాఖ అధికారులు వేలం పాట నిర్వహించారు. భూమి అమ్మకం జరిపేందుకు దేవాదాయ శాఖ కమిషనర్ ఐదుగురు అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. కమిషనర్ కార్యాలయంలో ఎస్టేట్ సంయుక్త కమిషనర్ కృష్ణాజీరావు, ఎస్టేట్ అసిస్టెంట్ కమిషనర్ విజయరాజు, రీజినల్ జాయింట్ కమిషనర్ భ్రమరాంబ, గుంటూరు డిప్యూటీ కమిషనర్ సురేష్‌బాబు, అమరావతిలోని సత్రం ఈవో శ్రీనివాసరెడ్డిలను కమిటీలో సభ్యులుగా నియమించారు.

ఎమ్మెల్యే లేఖతో ఆగమేఘాలమీద కదిలిన సర్కారు
తన నియోజకవర్గంలోని శ్రీసదావర్తి సత్రానికి (అమరావతి ఆలయ పరిధిలోనిది) చెన్నై సమీపంలో భూములు ఉన్నాయని, అవి ఆక్రమణకు గురవుతున్నాయని, వాటి విక్రయానికి అనుమతించాలని కోరుతూ పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ 2014 ఆగస్టు 18న ముఖ్యమంత్రి కార్యాలయానికి లేఖ రాశారు. భూముల యవ్వారం, పైగా కాసులు తెచ్చిపెట్టేదికదా సీఎం కార్యాలయం వెంటనే స్పందించింది. 2014 సెప్టెంబర్ 12న ఆ లేఖను దేవాదాయ శాఖకు పంపింది. అన్ని ప్రక్రియలు పూర్తయి 2015 ఏప్రిల్‌లో భూముల అమ్మకానికి దేవాదాయ శాఖ అనుమతించింది. 471.76 ఎకరాల్లో ఆక్రమణలు పోను మిగిలి ఉన్న 83.11 ఎకరాలను విక్రయించేందుకు ఈ ఏడాది మార్చి 28న వేలం పాట నిర్వహించారు. వేలంలో కృష్ణా జిల్లా కైకలూరు ప్రాంతానికి చెందిన తెలుగుదేశం పార్టీ కి చెందిన కీలకనేత , చంద్రబాబు సన్నిహితుడైన సదరు వ్యక్తి దక్కించుకున్నారు. ఎకరా 13 కోట్లు పలికే భూమిని అతి తక్కువగా 50 లక్షల రూపాయలకే కట్టబెట్టేశారు. ఇదంతా పక్క పధకం ప్రకారం జరిపించేశారు. ముఖ్యనేతల కనుసన్నల్లో గుట్టుచప్పుడు కాకుండా తంతును ముగించేశారు. తమిళనాడులో భూముల విలువులు గుంటూరు ప్రజలకు, భక్తులకు ఏం తెలుస్తాయిలే అన్న , ఆలోచనతోనే ఆలయ భూములను అప్పనంగా కొట్టేసినట్లు స్పష్టమౌతుంది.


నింబంధనలు తుంగలో తొక్కి

దేవాదాయ శాఖలో ఆస్ధుల విషయంలో గతకొంతకాలంగా ‘ఈ-టెండర్’ విధానం అమలు జరుగుతుంది. అయితే 83.11 ఎకరాల సత్రం భూముల అమ్మకానికి దేవాదాయ శాఖ అధికారులు ఈ విధానాన్ని మాత్రం అమలు చేయలేదు. విలువైన భూములను అధికార పార్టీ ముఖ్యులకు నామమాత్రపు ధరకు కట్టబెట్టే ఉద్దేశంతోనే దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఇందుకు అడ్డు చెప్పలేదన్న వాదన వినిపిస్తోంది. ఎకరం ధర రూ.6 కోట్లకుపైగానే పలుకుతుండగా, వేలంలో ఎకరం రూ.27 లక్షల చొప్పున అమ్మడమేమిటని దేవాదాయ శాఖ జాయింట్ కలెక్టర్ డి.భ్రమరాంబ అభ్యంతరం తెలిపుతూ ఆ మేరకు దేవాదాయ శాఖ కమిషనర్‌కు ఏప్రిల్ 18న సవివరమైన లేఖ రాశారు. అయితే, ఆ అధికారిణి వాదనను ఏమాత్రం పట్టించుకోకుండా ఏప్రిల్ 24 సేల్ ప్రొసీడింగ్స్ జారీ చేశారు. చెన్నై సమీపంలోని తాలంబూరులో భూముల ధరలు అధికంగా ఉండడంతో తమిళనాడు రిజిస్ట్రేషన్ శాఖ భూ లావాదేవీలలో ఎకరాకు బదులు గజా ల లెక్కన రిజిస్ట్రేషన్ చార్జీలు వసూలు చేస్తోంది. ప్రభుత్వ ధరల ప్రకారమే అక్కడ ఎకరా భూమి రూ.6 కోట్ల వరకు ఉంటుంది. మరోవైపు అక్కడ ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థలు వేసిన వెంచర్లలో 200 చదరపు గజాల ఇంటి స్థలం రూ.55 లక్షల వర కు పలుకుతోంది. అంటే బహిరంగ మార్కెట్‌లో ఎక రా భూమి ధర రూ.13 కోట్ల వరకు ఉన్న ట్టు రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. శ్రీసదావర్తి సత్రం భూములు పూర్తిగా ఆక్రమణలో ఉన్నాయనే సాకు చూపించి కారు చౌకగా కొట్టేశారు.

కీలక సూత్రదారి ఈఓ శ్రీనివాసరెడ్డి
భూముల అమ్మకం వ్యవహారంలో అమరావతి అమరలింగేశ్వర స్వామి ఆలయం ఈఓ శ్రీనివాసరరెడ్డి కీలకంగా వ్యవహరించాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజకీయ పెద్దలకు అనుకూలంగా వాస్తవ పరిస్ధితులకు  విరుద్ధంగా ఉన్నతాధికారులకు తప్పుడు రిపోర్టులు పంపి భూములను తక్కవ ధరకు కట్టబెట్టటంలో క్రియాశీలకంగా వ్యవహరించాడన్న విమర్శలు వెల్లువెత్తతున్నాయి. ఇటీవలే ఏకంగా స్ధానిక ఎమ్మెల్యేకు వెండి కిరీటాన్ని ఈఓ శ్రీనివాసరెడ్డి బహుకరించటం కూడా వివాదస్పదం అవుతుంది. భూముల అమ్మకం వ్యవహారంలో  పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారటం వల్లే ఈఓ శ్రీనివాసరెడ్డి ఖరీదైన గిఫ్టులు ఇస్తున్నాడన్న వార్తలు గుప్పుమంటున్నాయి. ఈవ్యవహారంలో జిల్లాకు చెందిన ఓ మంత్రి హస్తం కూడా ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్కెచ్ మొత్తం ఆయన కనుసన్నల్లోనే నడిచిందన్న వాదన వినిపిస్తుంది. 

భూముల అమ్మకాలం కుంభకోణం విలువ సుమారుగా వెయ్యి కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. దేవుడికి నామాలు పెట్టిన వారిపై పూర్తిస్ధాయిలో విచారణ జరపాలని ప్రజలు, భక్తులు డిమాండ్ చేస్తున్నారు. వాస్తవాలను ప్రజల ముంగిట బహిర్గతం చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. 

No comments:

Post a Comment