రాజ్యసభ ఎన్నికలకు మోగిన నగారా
రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను విడుదలచేసింది. వచ్చేనెలలో 15 రాష్ట్రాలకు చెందిన 57 మంది సభ్యులు పదవీకాలం ముగియనుంది. దీంతో 57 స్థానాల్లో ఎన్నికలను నిర్వహించనున్నారు. లోక్‌సభలో సంపూర్ణ మెజార్టీ వున్న భాజపాకు రాజ్యసభలో మాత్రం కేవలం 49 మంది సభ్యుల బలమేవుంది. రాజ్యసభలో పెద్దపార్టీ కాంగ్రెస్‌కు 64 మంది సభ్యుల బలముంది. తాజాగా జరగనున్న ఎన్నికల్లో భాజపా, మిత్రపక్షాల బలం పెరిగే అవకాశముంది. రాజ్యసభలో పదవీకాలం ముగియనున్న ముఖ్యుల్లో కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, సురేష్ ప్రభాకర్ ప్రభు, బీరేంద్రసింగ్, పీయూష్‌గోయల్, ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, నిర్మలా సీతారామన్... తదతరులున్నారు. కాంగ్రెస్ సీనియర్‌నేత అంబికాసోని పదవీకాలం కూడా ముగియనుంది. ప్రాథమికంగా చూస్తే భాజపాకు చెందిన 14 మంది పదవీకాలం ముగియనుంది. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్, ఝార్ఖండ్, హరియాణా రాష్ట్రాల్లోనే 20కుపైగా స్థానాల్లో ఎన్నిక జరగనుంది. ఈ రాష్ట్రాల అసెంబ్లీల్లో భాజపా, మిత్రపక్షాలకు చెందిన సభ్యులు మెజార్టీగా వున్నారు. దీంతో భాజపా కూటమికే చెందిన వారే రాజ్యసభకు ఎంపికవుతారు. ఉత్తరప్రదేశ్‌లో 11, బిహార్‌లో 5 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. యూపీలో అధికారంలో వున్న సమాజ్‌వాదీ పార్టీ, బిహార్‌లో జేడీయూ-ఆర్జేడీ కూటమికి ఎక్కువస్థానాలు దక్కే అవకాశాలున్నాయి. కర్ణాటకలో జరగనున్న నాలుగుస్థానాల ఎన్నిక మాత్రం అక్కడ అధికారంలో వున్న కాంగ్రెస్‌కు ఉపశమనం కలిగించే అంశమే. ఈ రాష్ట్రం నుంచి రాజ్యసభ ఎంపీలుగా ఎన్నికయిన వెంకయ్యనాయుడు, అయనూర్ మంజునాథ్(భాజపా), ఆస్కార్ ఫెర్నాండెజ్(కాంగ్రెస్), విజయ్‌మాల్యా (ఇండిపెండెంట్) పదవీ కాలం ముగుస్తుంది. విజయ్‌మాల్యా రాజీనామా చేయడంతో ఆ స్థానంతో కలిపి మొత్తం నాలుగుస్థానాలకు కర్ణాటకలో ఎన్నికలు జగనున్నాయి.
No comments:
Post a Comment