Wednesday, May 25, 2016

విశాఖలో మానవ మృగాలు

అసభ్యంగా ప్రవర్తించి...ఆపై కారుతో తొక్కించి...విశాఖలో దారుణం


కామంతో మదమెక్కిన మృగాళ్ళు కన్నుమిన్నుకానకుండా ప్రవర్తించారు. వివాహితని చూడకుండా అసభ్యంగా ప్రవర్తించటమేకాక,  వెంటపడి మరీ చంపేశారు..పరవాడ మండలం సాలాపువానిపాలెం వద్ద రెండు రోజుల క్రితం కారు ఢీకొని మహిళ మృతిచెందిన కేసు ఊహించని మలుపు తిరిగింది. విశాఖపట్నం సమీపంలోని వడ్లపూడికి చెందిన దంపతులు మాటూరి అప్పలరాజు, లావణ్య, అతడి చెల్లెలు దివ్య ఆదివారం ఉదయం అనకాపల్లి నూకాంబిక అమ్మవారిని దర్శించుకునేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్లారు. అమ్మవారిని దర్శించుకుని మధ్యాహ్నం ఆలయం సమీపంలోనే భోజనాలు చేశారు. ఆ సమయంలో అనకాపల్లి దిబ్బ వీధి రామాలయం ప్రాంతానికి చెందిన దాడి హేమకుమార్‌, అతడి స్నేహితులు నలుగురు కలిసి లావణ్యపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించారు. వారితో గొడవెందుకని భావించిన అప్పలరాజు భార్య, చెల్లెల్ని తీసుకుని వడ్లపూడికి తిరుగు ప్రయాణమయ్యాడు. అయితే మద్యం మత్తులో ఉన్న హేమకుమార్‌, అతడి స్నేహితులు కారులో వారిని వెంబడిస్తూ, లావణ్యను ఉద్దేశించి అసభ్యంగా మాట్లాడారు. సాలాపువానిపాలెం వద్ద ద్విచక్రవాహనాన్ని హేమకుమార్‌ తన కారుతో వెనుక నుంచి బలంగా ఢీకొట్టాడు. దీంతో లావణ్య కారు బాయ్‌నెట్‌పై పడగా, హేమకుమార్‌ వాహనం ఆపకుండా కొంత దూరం వెళ్లడంతో ఆమె రోడ్డుపై పడి మృతిచెందింది. భర్త అప్పలరాజు, అతని చెల్లెలు దివ్య రోడ్డుకు పక్కగా పడిపోవడంతో వారిద్దరికీ గాయాలైనా ప్రాణాలతో బయటపడ్డారు. ఈ సంఘటన చూసిన స్థానికులు కారును వెంబడించారు. చివరకు పరవాడలోని కొండ ప్రాంతంలో నిందితులు ఉపయోగించిన కారు ఆగి ఉండడం గమనించారు. కానీ, అందులో ఎవరూ కనిపించలేదు. కారు టైరు పంక్చర్‌ కావడంతో నిందితులు దాని, నంబర్‌ ప్లేటు తొలగించి కారులో పడేసి పరారయ్యారు. పోలీసులు అక్కడకు వెళ్లి కారును స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అప్పలరాజు, దివ్యలను ఆస్పత్రికి తరలించి, చికిత్స చేయిస్తున్నారు. కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాటూరి దివ్య నుంచి పోలీసులు వాగ్మూలం తీసుకున్నారు. ఇది ప్రమాదం కాదని, ఉద్దేశపూర్వకంగానే హేమకుమార్‌, అతడి స్నేహితులు కారుతో గుద్ది చంపారని ఆమె తెలిపింది. కాగా, మాటూరి లావణ్య అప్పలరాజు, లావణ్య(29) దంపతులకు ఇద్దరు కుమారులు శశాంక్‌ (4), విశాల్‌(1) ఉన్నారు. ముక్కు పచ్చలారని ఆ పసివాళ్లు.. ఏం జరిగిందో తెలియక తల్లి కోసం బోరున విలపిస్తున్నారు. ఘటన తెలుసుకున్న మహిళా సంఘాలు, ప్రజాసంఘాలు నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశాయి.
ఇదిలా వుంటే ప్రమాదానికి కారకుడైన హేమంత్ తోపాటు అతని స్నేహితులు ఇల్లు విడిచి పారిపోయారు. వారికోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.


No comments:

Post a Comment