Tuesday, May 24, 2016

బిజెపి వర్సెస్ టిడిపి....ఆట మొదలైంది....

సఖ్యతగా మెలగకపోతే సంగతి తేలుస్తాం; టిడిపికి బిజెపి నేతల హెచ్చరిక


బిజెపి అండ లేకుంటే ప్రజాక్షేత్రంలో తెదేపా గల్లంతుఖాయమని భాజపా అర్బన్‌ జిల్లా అధ్యక్షుడు అమ్మిశెట్టి ఆంజనేయులు అన్నారు. సోమవారం అరండల్‌పేటలోని భాజపా అర్బన్‌ పార్టీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెదేపా ప్రభుత్వానికి అనేక రకాలుగా సహకరిస్తుంటే పలువురు తెదేపా నేతలు భాజపాపై పలురకాలుగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రెండు నెలల క్రితం రాజమండ్రిలో జరిగిన భాజపా బహిరంగ సభలో భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రాష్ట్రానికి లక్షా యాబైవేల కోట్లు నిధులు మంజూరు చేశామని చెబితే.. తెదేపా నేతలు ఇప్పుడు వాటి వివరాలు అడగడం హాస్యస్పదమన్నారు. ఇప్పటికైనా భాజపాతో సఖ్యతగా మెలగాలని అలా కాకుండా భాజపాపైన కానీ, నాయకులపైన కానీ అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు.  భాజపా సీనియర్‌ నాయకుడు జూపూడి రంగరాజు మాట్లాడుతూ నోటికి ఇష్టం వచ్చినట్లు టిడిపి నేతలు మాట్లాడటం సరికాదన్నారు. కలసి పనిచేసి రాష్ట్ర అభివృద్ధికోసం పాడుపడాలని సూచించారు.  సమావేశంలో బిజెపి మీడియా ఇన్ ఛార్జి యలగలేటి గంగాధర్ తోపాటు, పార్టీనేతలు జగన్‌మోహన్‌, ప్రభాకర్‌, తిరుపతిరావు,  శ్రీనివాసరెడ్డి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment