విప్లవ యోధుడు క్యాస్ట్రో కన్నుమూత
క్యూబా విప్లవ మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో(90) శనివారం కన్నుమూశారు. 1926 ఆగస్టు 13న బిరాన్‌లోని హోల్గిన్‌లో జన్మించిన ఆయన అసలు పేరు ఫిడెల్ అలెజాండ్రో క్యాస్ట్రో రూజ్. 1959 నుంచి 1976 వరకూ ప్రధానిగా పనిచేసిన ఆయన .. 1976 నుంచి 2008 వరకు క్యూబా అధ్యక్షునిగా దేశానికి మార్గనిర్దేశనం చేశారు. 1959లో ఫుల్జెన్సియో బతిస్టాలో మిలటరీ ఆధిపత్యాన్ని కూలదోసిన క్యాస్ట్రో పాశ్చాత్య దేశాల్లో తొలి కమ్యూనిస్టు దేశాన్ని ఏర్పాటు చేశారు. క్యూబాను దాదాపు 5 దశాబ్దాల పాటు పాలించారు. 2006లో తీవ్ర అనారోగ్యానికి గురవడంతో పార్టీ అధ్యక్ష పదవితో పాటు అధ్యక్ష పదవికి రాజీనామా చేసి తమ్ముడు రౌల్‌కు బాధ్యతలు అప్పజెప్పారు. తుది శ్వాస విడిచే వరకూ కమ్యూనిస్టు సిద్ధాంతాల పరిరక్షణ కోసం కృషి చేశారు.గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న క్యాస్ట్రో చివరిసారిగా ఏప్రిల్‌లో జరిగిన కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్ సభలో ముగింపు ప్రసంగం చేశారు. తనకు త్వరలో 90 ఏళ్లు వస్తున్నాయని.. మరికొద్ది రోజుల్లో చనిపోబోతున్నానని ముందుగానే ఆయన ప్రకటించారు. అనారోగ్యం బారిన పడిన తర్వాత ఆయన కనిపించకపోవడంతో చాలా సార్లు మరణించారని వార్తలు కూడా వచ్చాయి. అధ్యక్ష పదవి నుంచి తప్పుకుని బాధ్యతలను సోదరుడు రౌల్‌కు అప్పగించాక ఆయన ఆరు నెలల పాటు ఎవరికీ కనిపించలేదు. 19, జూన్ 2008లో ఆయన వెనెజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్‌తో మాట్లాడుతున్న దృశ్యాలు కనిపించాయి.కమ్యూనిస్టు సిద్ధాంతాల కోసం ఎంతో కృషి చేసిన క్యాస్ట్రోకు 2014లో చైనా శాంతి బహుమతి లభించింది. నోబెల్ శాంతి పురస్కారానికి సమాంతరంగా 2010 నుంచి కన్ఫ్యూసియస్ శాంతి బహుమతి పేరుతో ఏటా దీన్ని చైనా అందిస్తోంది. నోబెల్ శాంతి పురస్కారాన్ని మలాలా, కైలాష్ సత్యార్థి స్వీకరించడానికి ఒక రోజు ముందు ఆయన ఈ కన్ఫ్యూసియస్ శాంతి పురస్కారాన్ని అందుకున్నారు.
No comments:
Post a Comment