Monday, November 28, 2016

కుంకుమపువ్వు వాడటం గర్బవతులకు డేంజరా....

గర్భవతులకు కుంకమపువ్వు మేలు చేస్తుందా...




కుంకుమ పువ్వు పాలల్లో కలుపుకు తాగితే మంచి రంగున్న బిడ్డపుడతాడని అందరు చెబుతుంటారు. పెద్దల మాటలు విని గర్భవతులకు కుంకుమపువ్వును పాలల్లో కలిపి తాగిస్తుంటారు. మితంగా కుంకుమ పువ్వు గర్భవతులకు మేలు కలిగిస్తుంది...అలాగని అమితంగా తీసుకుంటే మాత్రం ప్రమాదమేనట.... నిజంగా కుంకుమ పువ్వు తాగితే పుట్టబోయే పిల్లలు మంచి రంగుతో పుడతారా..? అంటే.. కాదని అంటోంది వైద్యశాస్త్రం. 

కుంకుమ పువ్వును పరిమితంగా తీసుకుంటే గర్భిణి స్త్రీలకు మంచి పోషకాహారంగా ఉపయోగపడుతుంది. దీనిలో బీ-కాంప్లెక్స్ విటమిన్ కు సంబంధించిన థయామిన్, రైబోఫ్లేవిన్ వంటి విలువైన పోషకాలు ఉంటాయి. గర్భవతుల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. గర్భం దాల్చిన తరువాత మహిళల్లో ప్రొజెస్టెరాన్ హార్మోన్ ఉత్తేజమై… మలబద్ధకాన్ని పెంచుతుంది. కుంకుమ పువ్వును చిటికెడు మించకుండా తీసుకోవడం వల్ల.. జీర్ణప్రక్రియ సాఫీగా జరిగి.. మలబద్ధకాన్ని దరిచేరనివ్వదు. పైగా గర్భవతులకు ఆకలిని కూడా పెంచుతుంది.

ఇక కుంకుమ పువ్వు తాగడం వల్ల పుట్టబోయే బిడ్డ మంచి ఎర్రటి రంగులో పుడుతుందనేది అపోహ మాత్రమేనట. వైద్యశాస్త్రంలో అందుకు శాస్త్రీయ నిర్ధారణ లేదట. పుట్టబోయే బిడ్డ రంగును తల్లిదండ్రుల జీన్స్ నిర్ధారిస్తాయి, కాని తినే ఆహార పదార్ధాలు కావు. పూర్వికులు ఏం చెప్పినా అందులో నిగూఢార్ధం దాగి ఉంటుందనేది కుంకుమ పువ్వు విషయంలోనూ స్పష్టమవుతుంది.

పాలు మానవులకు మంచి పౌష్టికాహారం. ఇందులో ఫోలిక్ యాసిడ్ ఉండటం వల్ల.. గర్భిణిలకు చాలా మేలు జరుగుతుంది. గర్భం దాల్చిన స్త్రీలు రెండో నెల నుండి ఐదో నెలవరకు వాంతులు, వేవిళ్లు కారణంగా ఆహారం తీసుకోవాడానికి ఇష్టపడరు. ముఖ్యంగా పాలను చూసి.. ఆ సమయంలో వికారం కనబరుస్తారు. కుంకుమ పువ్వు అనే సుగంధద్రవ్యం పాలను మరింత రుచిగా మార్చడంతో పాటు సుగంధ భరితంగా చేస్తుంది. పైగా బిడ్డ మంచి రంగులో పుడతాడనే నమ్మకాన్ని కల్పించడం వల్ల కుంకుమ పువ్వును అయిష్టంగా నైనా గర్భిణీలు తీసుకుంటారు.

కుంకుమ పువ్వును అమితంగా తీసుకుంటే కలిగే నష్టాలు కూడా ఎక్కువే. గర్భవతులు దీన్ని పాలలో చిటికెడు కంటే ఎక్కువగా వేసుకోకూడదు. ఎందుకంటే ఇది ఒక నేచురల్ హెర్బ్ కాబట్టి పరిమితికి మించినప్పుడు అది గర్భసంచిని ముడుచుకుపోయేలా చేసే అవకాశం ఉంది. మరీ ఎక్కువగా వాడితే గర్భస్రావమూ అయ్యే ప్రమాదం ఉంది. 

No comments:

Post a Comment