Friday, October 28, 2016

ఇదెక్కడి న్యాయం

న్యాయవిద్య కోర్సులకు వయోపరిమితి; అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పౌరులు



న్యాయవిద్య కోర్సులకు వయోపరిమితి విధింపు నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. మూడేళ్ల బీఎల్‌కు కోర్సుకు 30 ఏళ్లు, ఐదేళ్ల కోర్సుకు 20 ఏళ్లుకు పరిమితిని విధించేశారు. ఇప్పటివరకు ఎలాంటి వయోపరిమితి లేకపోవడంతో ఏ వయసు వారైనా న్యాయవిద్యను అభ్యసించేవారు. బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా తీసుకున్న తాజా నిర్ణయంతో వయసు పైబడి వారు న్యాయవిద్యను అభ్యసించడానికి అవకాశం ఉండదు. 2016-17 విద్యా సంవత్సరానికి మాత్రమే ప్రస్తుత విధానం కొనసాగుతుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి వయో పరిమితి నిబంధన అమలులోకి రానుంది.ఈతరహా నిర్ణయంపట్ల అటు మేధావులు, ప్రజాస్వామ్య వాదుల నుండి తీవ్రస్ధాయిలో అసంతృప్తి వ్యక్తమౌతుంది. విద్యార్ధి దశలో న్యాయ విద్యను అవపోసన చేయటమంటే చాలా క్లిష్టతరమైనది. మేధో పరిపక్వత లేకుండా చట్టాలను వంటపట్టించుకోవటం అంత తేలికైనదేం కాదు..  న్యాయవ్యవస్థలో పూర్తిస్ధాయి అవగాహన సంపాదించటానికి పెద్ద పెద్ద ఉద్ధండులకే సాద్యం కానిపని. వాక్ చాతుర్యం, లోతైన పరిశీలనాత్మక శక్తి కలిగినవారే న్యాయవిద్యలో రాణించగలరు. ఇప్పటి వరకు వయస్సు పైబడిన వారుసైతం న్యాయవిద్యను అభ్యసించి న్యాయస్ధానాల్లో అద్బుతంగా తమ వృత్తిని నిర్వర్తిస్తున్న పరిస్ధితులున్నాయి. అయితే ఏక్కడో కొన్ని తప్పులు జరిగాయన్న సాకును చూపించి న్యాయవిద్యను కొన్ని వయస్సుల వారికే పరిమితం చేసి, వయస్సు పైబడిన వారికి దూరం చేయటం అంత సబబు కాదన్న అభిప్రాయం వ్యక్తమౌతుంది. ఇతర కోర్సులకు న్యాయవాద కోర్సులకు భిన్నత స్పష్టంగా కనిపిస్తుంది. అలాంటి వృత్తిలోకి వయోపరిమితిని చొప్పించటం అంత మంచిదికాదనిపిస్తుంది.  ప్రజాస్వామ్య భారత వ్యవస్ధలో న్యాయవ్యవస్ధ ఓ కీలకమైన భాగం...అలాంటి వ్యవస్ధ గురించి తెలుసుకోవాలని, దానిపై పట్టు సంపాదించాలని ఏ వయస్సువారికైనా  ఆసక్తి ఉంటుంది. అలాంటి వారి ఆశలపై నీళ్ళు చల్లే విధంగా వ్యవహరించటం , విపరీత పోకడలు తప్ప మరొకటిి కాదన్నది మేధావుల అభిప్రాయం....దీనిపై అటు న్యాయవాదుల్లోను , విద్యా వంతుల్లోనూ , ప్రజాస్వామ్య వాదుల్లోను వయోపరిమితిపై విస్తృత స్ధాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


No comments:

Post a Comment