Friday, October 28, 2016

అమరావతిలో మరో కీలకఘట్టం

రాజధాని శాశ్విత భవనాలకు నేడే శంఖుస్ధాపన



ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణంలో బృహత్తర ఘట్టానికి మరికొద్ది గంటల్లో ఎపి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది.. ప్రభుత్వ భవనాల సముదాయ నిర్మాణానికి శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి అరణ్ జైట్లీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు  చేతుల మీదుగా శంఖుస్ధాపన జరగనుంది. 950 ఎకరాల్లో భవనాల నిర్మాణానికి రూ.5600 కోట్లు అవసరమవుతాయని అంచనా. రాష్ట్ర సచివాలయం, శాసనసభ, మండలి భవనాలు, రాజ్‌భవన్‌, ముఖ్యమంత్రి నివాస భవనం, ప్రభుత్వ విభాగాధిపతుల కార్యాలయాలు, మంత్రులు, అధికారులు, ఉద్యోగుల నివాసగృహాలు వంటివన్నీ ప్రభుత్వ భవనాల సముదాయంలో భాగంగానే నిర్మిస్తారు. 2018 డిసెంబరు నాటికి భవనాల నిర్మాణం కొలిక్కి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. శంఖుస్ధాపనకోసం తుళ్ళూరు మండలం లింగాయపాలెం సమీపంలో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3.35 నిమిషాలకు దాని శంకుస్థాపనతో పాటు రిజర్వుబ్యాంకు ప్రాంతీయ కార్యాలయం, విజయవాడలో మురుగునీటి పారుదల వ్యవస్థ, గుంటూరులో భూగర్భ డ్రైనేజీ నిర్మాణంతోపాటు రాజధానిలో ఏడు రోడ్ల నిర్మాణానికి సంబంధించిన శిలాఫలకాలు ఆవిష్కరిస్తారు. ఇప్పటికే 2016 ఫిబ్రవరి 17న తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసి నిర్మాణాన్ని శరవేగంగా పూర్తిచేశారు. హైదరాబాద్‌లోని సచివాలయాన్ని ఇక్కడికి తరలించారు. ఇప్పుడు శాశ్వత భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేయడం రాజధాని నిర్మాణంలో కీలక ఘట్టం. రెండు మూడు నెలల్లో ఆకృతులు ఖరారు చేసి నిర్మాణాలు మొదలు పెట్టనుంది. మరో పక్క వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, విశ్వవిద్యాలయాలకూ భూములు కేటాయించింది. విట్‌ విశ్వవిద్యాలయం నవంబరు 3న, ఇండో-యూకే ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ సంస్థ ఆస్పత్రి నిర్మాణానికి నవంబరు 7న శంకుస్థాపన చేయనున్నాయి. రాజధానిలో 2018 డిసెంబరునాటికి పూర్తి చేయాల్సిన పనులకు సంబంధించి ప్రభుత్వం లక్ష్యాలను నిర్దేశించుకుంది.

 

No comments:

Post a Comment