Wednesday, October 19, 2016

శాన్ ఫ్రాన్సిస్కోలో స్కూల్స్ లో తుపాకుల మోత

శాన్ ప్రాన్సిస్కో  స్కూల్స్ లో కాల్పులు; నలుగురికి తీవ్రగాయాలు; ఒకరి పరిస్ధితి విషమం



శాన్‌ఫ్రాన్సిస్కోలోని రెండు స్కూళ్ళకు కలిపి వున్న పార్కింగ్‌ ప్లేస్‌లో మంగళవారం జరిగిన కాల్పుల్లో నలుగురు టీనేజ్‌ విద్యార్ధులపై కాల్పులు జరిగాయి. వారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా వుందని అధికారులు తెలిపారు. జూన్‌ జోర్డాన్‌ స్కూల్‌ ఫర్‌ ఈక్విటీ, సిటీ ఆర్ట్స్‌ అండ్‌ టెక్నాలజీ హైస్కూల్‌ నుండి విద్యార్ధులు బయటకు వస్తుండగా ఈ కాల్పుల సంఘటన చోటు చేసుకుందని పోలీసు అధికారి కార్లోస్‌ మాన్‌ఫ్రెడి తెలిపారు. ఒకే కేంపస్‌లో ఈ రెండు స్కూళ్ళు వున్నాయి. కాల్పులు జరిగిన వెంటనే బాధితుల్లో ముగ్గురు స్కూలు లోపలకు పరిగెత్తారు. నాల్గవ వ్యక్తి బేవ్యూ పోలీసు స్టేషన్‌కు పరిగెత్తాడు. పోలీసులు ప్రతి తరగతి గదిని పరిశీలించే వరకు విద్యార్ధులు ఎక్కడున్నవారు అక్కడే వుండాలని తొలుత పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. బాధితుల్లో ఒకరైన విద్యార్ధినికి ఛాతీలో తీవ్ర గాయాలయ్యాయని, ఆమె పరిస్థితి విషమంగా వుందని చెప్పారు. కాగా ముదురు రంగు హుడీలు, జీన్స్‌ ధరించిన నలుగురు అనుమానితులు వెంటనే ఆ ప్రాంతం నుండి పారిపోయారని మాన్‌ఫ్రెడి తెలిపారు. కాల్పులు జరిపినట్లుగా అనుమానిస్తున్నవారు స్కూలు విద్యార్ధులు కాదని అధికారులు చెప్పారు. విద్యార్ధినిని లక్ష్యంగా చేసుకుని వారు కాల్పులు జరిపినట్లుగా తోస్తోందని చెప్పారు.

No comments:

Post a Comment