Thursday, October 27, 2016

సిబిఐకు దొరికిపోయిన మాజీ ఎంపి వల్లభనేని బాలశౌరి

సిబిఐ ఉచ్చులో మాజీ ఎంపి బాలశౌరీ



ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ మాజీ ఉద్యోగి పోలు శ్రీధర్‌పైన సీబీఐ అధికారులు అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారన్న ఆరోపణలపై ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ మాజీ ఉద్యోగి పోలు శ్రీధర్‌ను ఇటీవల సీబీఐ అరెస్ట్‌ చేసింది. 2007 జనవరి 1 నుంచి 2012 డిసెంబరు 31 మధ్య కాలంలో పోలు శ్రీధర్‌ తన ఆదాయానికి మించి రూ.11.96 కోట్లు అక్రమ ఆస్తులు సంపాదించారని సీబీఐ ఆయనపై చార్జిషీట్‌ దాఖలు చేసింది. కేసు విచారణలో భాగంగా గుంటూరు, హైదరాబాద్‌, నోయిడాల్లో సీబీఐ విస్తృతంగా సోదాలు నిర్వహించింది. పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. ఈ డాక్యుమెంట్ల ఆధారంగా జరిపిన విచారణలో గుంటూరు మాజీ ఎంపి బాలశౌరి, తాను ఎంపీగా ఉన్న సమయంలో ఆయన సొంత బ్యాంకు ఖాతా నుంచి శ్రీధర్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ ఎకౌంట్‌కు పెద్ద ఎత్తున నగదు బదిలీ అయినట్లు గుర్తించింది. ఢిల్లీకి సమీపంలోని నజ్‌ఫగడ్‌ ప్రాంతంలో 2007-08 సంవత్సరంలో బాలశౌరి 20 ఎకరాల స్థలాన్ని రూ.12.5 కోట్లకు కొనుగోలు చేశారు. ఈ స్థలం కొనుగోలులో బాలశౌరికి, రైతులకు మధ్యవర్తిగా శ్రీధర్‌ వ్యవహరించారు. రైతులకు చెల్లించాల్సిన మొత్తాన్ని శ్రీధర్‌ ఖాతాకు తరలించారు. అందులో భాగంగా నజ్‌ఫగడ్‌లోని యాక్సిస్‌ బ్యాంకులోని శ్రీధర్‌ ఖాతాలోకి ఒకసారి రూ.8.4 కోట్లు, బెంగళూరులో అదే బ్యాంకులో ఉన్న శ్రీధర్‌ ఖాతాలో ఒకసారి రూ.1.2 కోట్లు, మరోసారి రూ.2.3 కోట్లు డిపాజిట్‌ అయ్యాయి. ఇంత భారీస్థాయిలో లావాదేవీలు గుట్టుచప్పుడు కాకుండా జరగడానికి నజ్‌ఫగడ్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ మేనేజర్‌ మనీశ్‌ సక్సేనా సహకరించారని సీబీఐ గుర్తించింది. శ్రీధర్‌ పేరుతో నకలీ ఖాతాలు తెరచి కోట్ల రూపాయల లావాదేవీలు నడిచేందుకు పెద్ద ఎత్తున ముడుపులు తీసుకొని సహకరించారన్న ఆరోపణలతో సక్సేనాపైనా సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసి, ఆయన్ను అరెస్ట్‌ చేసింది. వచ్చే వారంలో బాలశౌరిని పిలిచి విచారించే అవకాశం ఉందని సీబీఐ అధికారి ఒకరు వెల్లడించారు. 

No comments:

Post a Comment