Tuesday, October 18, 2016

విశాఖ ఏజెన్సీలో చలి పులి

లమ్మసింగిలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు,... ఏజెన్సీ గజగజ



విశాఖ ఏజెన్సీ ప్రాంతం చలికి వణికిపోతుంది. పగటి పూట ఎండతో అల్లాడిపోతున్న జనం, రాత్రి చలికి గజగజలాడుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు గరిష్ఠ పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తరువాత క్రమంగా రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. పగటిపూట 35 నుంచి 37 డిగ్రీల సెల్సియస్‌ మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే.. సాయంత్రం తరువాత 17 నుంచి 23 డిగ్రీల కనిష్ఠానికి పడిపోతున్నాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం వంటివి ఏర్పడే వరకు ఇదే వాతావరణ పరిస్థితి కొనసాగుతుందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు తెలంగాణ నుంచి ఆదివారం పూర్తిగా నిష్క్రమించినట్లు భారత వాతావరణశాఖ అధికారికంగా ప్రకటించింది. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఇంకా కొనసాగుతున్నట్లు చెబుతున్నారు.
 

గత రెండు రోజులుగా ఆకాశంలో మబ్బులు లేకపోవడంతో సూర్య కిరణాలు నేరుగా భూమిని తాకి పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. అదేవిధంగా సాయంత్రానికి భూమిపైన ఉన్న వేడి తిరిగి ఆకాశం వైపునకు వెళ్లడంతో వాతావరణం చల్లబడుతున్నట్లు వాతావరణశాఖ విశ్రాంత శాస్త్రవేత్త రాళ్లపల్లి మురళీకృష్ణ తెలిపారు. దీన్నే ‘రేడియేషన్‌ కూలింగ్‌’ అని అంటారని వివరించారు. కోస్తాపైకి ఉత్తర, వాయువ్య దిశగా పొడి గాలులు రావడంతోనూ పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సముద్రం నుంచి తేమ గాలులు వచ్చే వరకు దాదాపు ఇదే వాతావరణ పరిస్థితి తీర ప్రాంతాల్లో ఉంటుందని ఆయా వర్గాలు వివరించాయి. బంగాళాఖాతంలో ఆవర్తనం, అల్పపీడనం వంటివి ఏర్పడే పరిస్థితి కనిపించడం లేదు. ఆంధ్రా కశ్మీర్‌గా పేరు గాంచిన విశాఖ జిల్లా లంబసింగిలో ఈ ఏడాది చలిపులి ముందే పంజా విసురుతోంది. ఏటా నవంబరు మొదటి వారం నుంచి విశాఖ మన్యంలో చలి వణికిస్తుంటుంది. ఈ ఏడాది అక్టోబరు రెండో వారం నుంచే చలి ప్రారంభమైంది. మూడు రోజులుగా చింతపల్లిలో చలి తీవ్రత బాగా పెరిగింది. ఉదయం వేళల్లో పొగమంచు దట్టంగా కురుస్తోంది. చలి, పొగమంచు కారణంగానే అతిశీతల వాతావరణ ప్రాంతంగా లంబసింగి పర్యటక ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఉదయం మంచుదుప్పటి కప్పుకున్నట్లుగా కనిపిస్తున్న లమ్మసింగి అందాలు చూసేందుకు పర్యాటాకలు తరలివస్తున్నారు. ఇక్కడి వాతావరణంలో సరదాగా గడుపేందుకు తహతహలాడిపోతున్నారు.

No comments:

Post a Comment