Wednesday, October 19, 2016

నకిలీ విత్తన సంస్ధలపై కొరడా....అద్దె నియంత్రణ చట్టం...ఎపి మంత్రి వర్గం నిర్ణయం

అద్దె నియంత్రణచట్టం; ఎపి క్యాబినెట్ కీలక నిర్ణయం



ఆంధ్రప్రదేశ్‌లో అద్దె నియంత్రణ చట్టం-2016ను రూపొందించాలని న్యాయశాఖను రాష్ట్ర మంత్రిమండలి కోరింది. నకిలీ విత్తనాలు, విష పూరిత ఆహార పదార్థాలు అమ్మే వారిపై పిడి (ప్రివెంటివ్‌ డిటెన్షన్‌) యాక్టు ప్రయోగించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో కొత్తగా నాలుగు పట్టణాభివృద్ధి సంస్థల ఏర్పాటును ఆమోదించింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి అధ్యక్షతన మంగళవారం  జరిగిన మంత్రి మండలి సమావేశం పలు కీలక నిర్ణయలు తీసుకుంది. ఈ వివరాలను సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మీడియాకు వెల్లడించారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో నకిలీ మిర్చి, పత్తి విత్తనాలు అమ్మిన కావేరీ, బ్రహ్మపుత్ర, జీవా తదితర బ్రాండ్లకు చెందిన కంపెనీల యజమానులపై పిడి యాక్టు పెట్టాలని నిర్ణయించారు. జీవా మిర్చి విత్తనాలు వేసిన వారికి ఎకరాకు రూ.30 వేల నుండి రూ.40 వేలు పరిహారాన్ని ఆ కంపెనీ నుండి ఇప్పించాలని నిర్ణయించారు.  అవి నాసి రకం విత్తనాలని నిర్ధారణైంది. కావేరీ విత్తనాల డిస్ట్రిబ్యూటర్లు, డీలర్ల అనుమతులను రద్దు చేశారు. ఆ యజమానిని అరెస్టు చేయాలని నిర్ణయించారు. ఒకవేళ దొరకని పక్షంలో బుధవారం వారి ఫొటోలతో ప్రకటనలు వేయాలని క్యాబినెట్‌ నిర్ణయించింది. నాసిరకం, కల్తీ బయో ప్రొడక్ట్స్‌ను విక్రయిస్తున్న 210 కంపెనీలు, ఇటీవల గుర్తించిన 51 కంపెనీల శాంపిళ్లను పరిశీలించి వాటిపై చర్యలు తీసుకుంటామని, చట్టపరంగా అప్పీలుకు వెళతామని మంత్రి వివరించారు. తెలుగుదేశం నాయకులు ఉన్నా సరే చర్యలు తీసుకుంటామ న్నారు. వాటిని విక్రయిస్తున్న వారిపైనా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఇప్పటికే స్పెషల్‌ విజిలెన్స్‌ బృందాలు ఏర్పాటు చేశామన్నారు. ఏపి ఇన్‌ఫాస్ట్రక్చర్‌ డవెలప్‌మెంట్‌ అండ్‌ ఎనాబిలింగ్‌ యాక్టును సవరించాలని నిర్ణయించారు. ఈ చట్టం ప్రకారం ముందుగా సమావేశంలో నిర్ణయం తీసుకుని, అనుమతుల కోసం మళ్లీ ప్రభుత్వం వద్దకు వెళ్లాల్సి వస్తోంది. ఇక ముందు అలాంటి పరిస్థితి లేకుండా ఒకేచోట అనుమతులు పొందే విధంగా చట్టంలో మార్పులు చేస్తారు. ఏపి టూరిజం అండ్‌ కల్చర్‌ హెరిటేజ్‌ బోర్డు-2016 ఆర్డినెన్స్‌ ముసాయిదా రూపకల్పనకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. దీని పరిధిలోకి పర్యాటక, సాంస్కృతిక, హెరిటేజ్‌ శాఖలన్నీ ఈ బోర్డు పరిధిలోకి వస్తాయి. దీనికి రాష్ట్ర పరిధిలో చైర్మన్‌గా ముఖ్యమంత్రి, జిల్లాలో కలెక్టర్‌, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కమిషనర్లు చైర్మన్లుగా ఉంటారు. ప్రైవేటు వ్యవసాయ కళాశాలను ఆచార్య రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోకి తీసుకొచ్చేందుకు వీలుగా క్యాబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఏపి సదుపాయాల చట్టం-2001 డ్రాఫ్ట్‌ బిల్లుకు సవరణ చేసేందుకు క్యాబినెట్‌ ఆమోదించింది. దీని ప్రకారం ఇక నుండి అభివృద్ధికి తీసుకునే అన్ని అనుమతులూ ఒకేచోట నుండి తీసుకోవచ్చు. డబుల్‌ రిజిస్ట్రేషన్‌ నియంత్రణకు అవసరమైన విధంగా రిజిస్ట్రేషన్‌ చట్టంలో మార్పులు చేయాలని నిర్ణయించారు. నాలా పన్ను చెల్లింపులో వస్తున్న ఇబ్బందులను ఇకముందు రాకుండా ఉండేందుకు వీలుగా నేరుగా నాలా చెల్లిస్తే అన్ని అనుమతులొచ్చే విధంగా క్యాబినెట్‌ నిర్ణయం తీసుకుంది. కొత్త అద్దెల చట్టం అమల్లోకి వస్తే అద్దెలు నోటరీ ద్వారా గానీ, రిజిస్ట్రేషన్‌ పద్ధతిలోగానీ కుదుర్చుకోవాల్సి ఉంటుంది. సెక్యూరిటీ డిపాజిట్‌ మూడు నెలలకు మించకుండా ఉండే విధంగా మార్పులు చేశారు. రిపేర్లు చేయడం, సబ్‌లీజుకు ఇవ్వకుండా నిరోధించడం వంటి అనేక కొత్త అంశాలను ఇందులో పొందుపరిచారు. గ్యారంటీ మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. శ్రీకాకుళం ఆముదాలవలస చక్కెర కర్మాగారాన్ని అంబికా సుగర్స్‌ అండ్‌ ఆగ్రో ఇండిస్టీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ నుండి ఎపిఐఐసికి అప్పగించనున్నారు. 2003లో ఈ ఫ్యాక్టరీని అంబికా గ్రూపు రూ.6.4 కోట్లకు తీసుకుంది. అక్కడ పారిశ్రామిక అవసరాల రీత్యా అందులో ఉన్న భూమి 74.70 ఎకరాలను రూ.22.25 కోట్లకు ఎపిఐఐసికి అప్పగించాలని నిర్ణయించారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారమే భూమిని తీసుకునే విధంగా క్యాబినెట్లో నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు. ఆర్థికశాఖ ఎకౌంట్స్‌ డిపార్టుమెంట్లో జూనియర్‌, సీనియర్‌ అసిస్టెంట్లుగా ఉన్న వారిని అసిస్టెంట్ల పేరు స్థానంలో ఎకౌంట్స్‌ ఆఫీసర్‌గా మార్చాలని నిర్ణయించారు. జాతీయ కర్మచారీ అభివృద్ధి కార్పొరేషన్‌కు డీడ్‌ ఆఫ్‌ బ్లాక్‌ గ్యారంటీని రూ.10 కోట్ల నుండి రూ.50 కోట్లకు పెంచడానికి ఆమోదం తెలిపింది. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లిలో ఫుడ్‌ పార్కు ఏర్పాటుకు ఎపిఐఐసికి 716.47 ఎకరాలను తీసుకోవాలని నిర్ణయించింది. ఇందుకు రైతులకు ఎకరాకు రూ.7.50 లక్షలు చెల్లించేందుకు మంత్రిమండలి ఆమోదించింది. తిరుపతిలోని మంగళంలో ఎకరం లక్ష చొప్పున 2.94 ఎకరాలను బ్రహ్మకుమారీస్‌కు ఇవ్వడానికి నిర్ణయించారు. చంద్రగిరి మండలం పుల్లయ్యగారిపల్లెలో సినీనటులు మోహన్‌బాబుకు 1.50 ఎకరాలను మార్కెట్‌ విలువ ప్రకారం కేటాయించారు. రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదించింది.  కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం బుడ్డపాడులో స్టీలు ప్లాంటు ఏర్పాటు కోసం 370.39 ఎకరాలను జైరాజ్‌ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ కంపెనీకి ఇచ్చేందుకు ఎపిఐఐసికి అప్పగించాలని నిర్ణయించారు. దీనితో మూడుదశల్లో కంపెనీ పెట్టుబడులు పెడుతుంది. ఇసుకను అక్రమంగా రవాణా చేసే వారిపై కఠిన నిర్ణయాలు తీసుకోవాలని, అందులో తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్నా చర్యలు తీసుకోవాల్సిందేనని తీర్మానించింది. అవసరమైతే అధికారులపైనా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. స్మార్ట్‌పల్స్‌ సర్వేపైనా సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలో నాలుగు పట్టణాభివృద్ధి సంస్థలకు క్యాబినెట్‌ ఆమోద ముద్రవేసింది. అనంతపురం-ధర్మవరం-హిందూపురాన్ని కలుపుతూ అనంతపురం అర్బన్‌ డెలప్‌మెంట్‌ అధారిటీని ఏర్పాటు చేశారు. 2791.70 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇది ఉంటుంది. తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ కేంద్రంగా రాజమండ్రి, సామర్లకోట, పెద్దాపురం, గొల్లప్రోలు, కత్తిపూడి పరిధిలో గోదావరి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీని ఏర్పాటు చేశారు. 8800 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికి పైబడి ఇది ఉంటుంది. కర్నూలు-నంద్యాల -ఆత్మకూరును కలిపి కర్నూలు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ, 1644 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నెల్లూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీని ఏర్పాటు చేశారు.






No comments:

Post a Comment